Friday, May 16, 2025
Homeవిశ్లేషణమోదీ దివాలాకోరు విధానాలపై పోరు

మోదీ దివాలాకోరు విధానాలపై పోరు

కేవీవీ ప్రసాద్‌

జులై 9 న కార్మిక సంఘాలు దేశవ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను జయప్రదం చేసేందుకు కేంద్ర కార్మిక సంఘాలతో వివిధ రాష్ట్రాలలోని అనేక స్వతంత్ర కార్మిక సంఘాలు ఐక్య ఆందోళనకు సమాయత్తమై కృషి చేస్తున్నాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక, వ్యవసాయరంగాలను కార్పొరేట్‌ కంపెనీల హస్తగతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను రక్షించుకునేందుకు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ హర్తాళ్‌ నిర్వహించ తలపెట్టాయి. శతాబ్దకాలంగా కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు రూపొందించి వాటిని నిర్బంధంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నది. వీటివల్ల సంఘం పెట్టుకోవడం, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతోపాటు సంఘాల నిర్వహణ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. రోజుకు 12 గంటలు పని విధానం అమలు చేసే దుష్ట ప్రయత్నాలు ప్రారంభించింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, అప్రెంటీస్‌, క్యాజువల్‌ లేబర్‌ తదితర పద్ధతులు అమల్లోకి తెస్తూ పర్మినెంట్‌ ఉద్యోగాలకు స్వస్తిపలికే విధానాల అమలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాల పుణ్యమాని పారిశ్రామికరంగం తిరోగమన దశకు చేరింది. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదల నమోదుతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలోపడిరది. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ తగ్గుతున్నది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనిస్తున్నదంటూ డాంబికాలుపోతున్న మోదీ ప్రభుత్వ తీరుకు ప్రతికూల నిదర్శనం ఇది. ప్రజల ఆర్థికస్థితి ప్రమాదంలో పడుతూ రోజు రోజుకూ దిగజారుతున్నది. దీనితో దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలు తమ రోజువారీ జీవన వ్యయాన్ని సైతం తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నదని కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఐఐపీ) నివేదిక తేెటతెల్లం చేస్తున్నది. 202122లో 11.4శాతంగా నమోదైన పారిశ్రామిక వృద్ధిరేటు ఈ ఏడాది 4 శాతానికే పరిమితమైంది. 202324 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే వృద్ధి రేటు 1.9 శాతం తక్కువ. మేకిన్‌ ఇండియా పేరుతో కేంద్రం సృష్టిస్తున్న హడావిడికి వాస్తవ వృద్ధి రేటు గణాంకాలకు ఉన్న వ్యత్యాసాలకు నిదర్శనం ఇది. ప్రజల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నది చేదు నిజం. గ్రామీణ భారతానికి వెన్నెముకగా నిలవాల్సిన వ్యవసాయరంగం నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతో కుదేలౌతున్నది. మోదీ పాలనలో సుమారు 1.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. డా॥ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ నాయకత్వాన ఏర్పడిన జాతీయ రైతు కమిషన్‌ సిఫార్సులను మోదీ ప్రభుత్వం అటకెక్కించింది. సి2G50% ప్రకారం మద్దతు ధరలు లభించేలా రైతాంగ ఉత్పత్తులకు మద్దతు ధరల చట్టం చేస్తామన్న హామీని గాలిలో కలిపి నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మోసకారి తనాన్ని రుజువు చేసుకున్నది. గ్రామీణ పేదలకు కాస్తంత ఆదాయాన్ని సమకూర్చే ఉపాధి హామీ పథకం నిధులకు ఏయేటికాయేడు కోత పెడుతున్నది. వ్యవసారంగానికి నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయి. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌లకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా తెచ్చిన వినాశకర మూడు వ్యవసాయ నల్లచట్టాల రద్దుకు రైతాంగం 13 మాసాలపాటు సాగించిన వీరోచిత పోరాట విరమణ సందర్భంగా రాత పూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ద్రోహం చేసింది. మరో పక్క రద్దు చేసిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించి అమలు చేసే దుష్ట ప్రయత్నం ప్రారంభించింది. నేషనల్‌ ప్రేమ్‌ వర్క్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పేరుతో కొత్త విధానం ప్రవేశపెట్టింది. మద్దతు ధరల విధానానికి స్వస్తి పలికి భవిష్యత్తులో పంటల కొనుగోలు వ్యవస్థను కార్పొరేట్‌ కంపెనీల, బడా వ్యాపారుల వశం చేసేందుకు పూనుకుంది. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌, బహుళ సహకార సంస్థల చట్టంల పేరుతో రైతాంగాన్ని కార్పొరేట్‌ కంపెనీల హస్తగతం చేయడానికి విధానాలను రూపొందించింది. మార్కెట్‌ డిజిటల్‌ పెన్షన్‌ స్కీము రద్దు చేయ పూనుకుంటున్నది. ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలపై ఇస్తున్న రాయితీలపై కోత విధించే దుర్మార్గానికి పూనుకొని పేద రైతులను వ్యవసాయానికి దూరం చేసే చర్యలు చేపడుతున్నది. మన దేశం అమెరికాకు లొంగిపోయి ఇండో అమెరికన్‌ ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్దమైంది. ఈ అగ్రిమెంట్‌ అమలు జరిగితే విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు వచ్చి పడతాయి. మన రైతాంగం పండిరచిన ఉత్పత్తులు అమ్ముకునే అవకాశాలు మృగ్యమై తీవ్ర కష్టనష్టాలు చవి చూడాల్సి వస్తుంది. పెట్టుబడిదారీ దేశాలైన ధనిక దేశాలు తమ రైతులకు భారీ మొత్తంలో సబ్సిడీలు నగదు బదిలీ రూపంలో అందిస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో, అమెరికాలో రైతులకు అందించే నగదు వారు పండిరచే పంట ధరలో సగం వరకు ఉంటుంది. జపాన్‌లో రైతు ఉత్పత్తి చేసే పంట మొత్తం విలువ ఎంతో అంత మొత్తం నగదు బదిలీ చేస్తున్నారు. ఇంత మొత్తంలో భారీ ఎత్తున సబ్సిడీలు ఇవ్వడాన్ని డబ్ల్యూటీఓ తప్పు పట్టదు. కానీ మనదేశంలో మద్దతు ధరలపై ఆంక్షలు విధించేలా ఒత్తిడి చేస్తున్నది. నగదు బదిలీలు వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయంపై ఎలాంటి ప్రభావం కలిగించవనేది వారి వాదన. నగదు బదిలీలు చేసుకోవచ్చు. కానీ మద్దతు ధరల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదంటున్నది. ఆచరణలో కోట్లాది మంది రైతులున్న మన దేశంలో నగదు బదిలీ సాధ్యం కాదు. మద్దతు ధరల విధానాన్ని వ్యతిరేకించడమంటే మనలాంటి దేశాల్లో రైతాంగ ఉత్పత్తులకు మద్దతు ధరలు లేకుండా చేసి వ్యవసాయాన్ని నష్టాల బాటలోకి నెట్టడమే అవుతుంది.
ఈ దశలో ట్రంప్‌ సుంకాల పెంపుదల విధానంతో మన దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ప్రభుత్వం కూడా అమెరికా నుంచి వచ్చే దిగుమతులపైఅదనపు సుంకాలు విధించివుంటే మన రైతులకు నష్టం జరగదు. కాని అలా జరగలేదు. జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. అమెరికా విధించిన సుంకాలపై సంప్రదింపులు జరిపేందుకు మన ప్రభుత్వం అంగీకరించింది. చర్చల్లో అమెరికాదే పైచేయి కాదని చెప్పలేం. అదే జరిగితే భారత్‌లాంటి అతి పెద్ద మార్కెట్‌ను వారి చేతుల్లో పెట్టినట్లే అవుతుంది. మన రైతాంగంపైన వ్యవసాయరంగంపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశంలో రైతాంగ ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మన దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు రైతాంగం ఐక్యంగా ఉద్యమించాలి. భారత్‌తోపాటు అమెరికా సుంకాల పెంపుతో ఇబ్బందిపడే బాధిత దేశాలన్నీ కలిసి అమెరికా పెద్దన్న పాత్రకు నిరసనగా పోరాటం సాగించాలి. జులై 9న కార్మిక శ్రేణులతోపాటు రైతాంగం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయకత్వాన నరేంద్ర మోదీ ప్రభుత్వ పారిశ్రామిక, వ్యవసాయ దివాళాకోరు విధానాలపై పెద్దఎత్తున నినదించాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా వ్యవసాయరంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి. కార్మిక, కర్షక, గ్రామీణ పేదలారా ఐక్యం కండి! మే 20 దేశవ్యాప్త సమ్మె ` గ్రామీణ హర్తాళ్‌ను జయప్రదం చేద్దాం.

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు