Monday, May 12, 2025
Homeవిశ్లేషణయుద్ధం టెర్రరిజాన్ని అంతం చేస్తుందా!

యుద్ధం టెర్రరిజాన్ని అంతం చేస్తుందా!

టి. లక్ష్మీనారాయణ

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి, అంతం చేయడం మనందరి లక్ష్యం. ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టడం, ఉగ్రవాదులకు మద్దతు – శిక్షణ – ఆర్థిక తోడ్పాటు అందిస్తూ, మన దేశంలోకి పంపిస్తూ, దేశ భద్రత – ప్రజల ప్రాణాలకు – సామాజిక ఉద్రిక్తతలకు – ఆర్థికాభివృద్ధికి ప్రమాదకారిగా, పక్కలో బల్లెంగా మారిన పాకిస్థాన్‌ కుట్రలు – కుతంత్రాలను ఓడిరచాలంటే యుద్ధమొక్కటే మార్గమా! కొందరు రాజకీయ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రధాన ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు, సోషల్‌ మీడియాలో యుద్ధోన్మాదంతో ఊగిపోతూ సాగిస్తున్న ప్రచారం దేశాన్ని ఎటువైపు నడిపిస్తుందో! పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌ లోని పహల్గాంలో 26 మంది అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న అత్యంత క్రూరమైన, హేయమైన, ఆటవిక కాల్పుల ఘటనతో సహజంగానే దేశ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. రాజకీయ అనుబంధాలకు, ప్రాంతాలు - మతాలకు అతీతంగా దేశ ప్రజలు ఒక్కటైనారు. ఉగ్రవాదంపై కళ్లెర్రజేశారు. అందరి నోట ఒకటే మాట, ‘‘ఉగ్రవాదాన్ని అంతం చేయాలి ప్రజల ప్రాణాలను, దేశాన్ని రక్షించుకోవాలి’’. కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌’’ను బలపరిచారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి బదులు సరిహద్దులో ఉన్న జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్లో డ్రోన్లతో యుద్ధ చర్యలకు పాల్పడి, కాల్పులు చేసి, మహిళలు, పిల్లలు అన్న విచక్షణ కూడా లేకుండా అనేక మందిని పొట్టనపెట్టుకున్నది. భారత్‌ పాకిస్థాన్‌ మధ్య పూర్తి స్థాయి యుద్ధం వైపు శరవేగంగా అడుగులుపడుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. శాశ్వత శాంతి చర్చలు ఫలప్రదంగా జరగాలని, ఉగ్రవాదానికి అంతంపలికే కార్యాచరణ రూపొందించాలని రెండు దేశాల ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
కశ్మీర్‌ భారత దేశంలో అంతర్భాగం. అది నిర్వివాదాంశం. దాన్ని వివాదాస్పద అంశంగా పాకిస్థాన్‌ మూర్ఖంగా కొనసాగించాలని భావిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అది ఆ దేశ వినాశనానికే దారి తీస్తుంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత దేశంలో కలిపేసుకుంటామంటూ విర్రవీగే మాటలు వృథా ప్రయాస. ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా దుందుడుకుగా వ్యవహరిస్తే ప్రయోజనం ఉండకపోగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సిమ్లా ఒప్పందం – 1972, సింధు నదీ జలాల ఒప్పందం – 1960కు రెండు దేశాలు చిత్తశుద్ధితో కట్టుబడి, అమలు చేయాలి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్‌ అంకితభావంతో భాగస్వామి కావాలి. నేడు రెండు దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం ఇదే.
యుద్ధం వల్ల ఎవరికి ప్రయోజనం: ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తే యుద్ధాలను ప్రేరేపించేది – లబ్ధిపొందేది సామ్రాజ్యవాద దేశాలు, ఆయుధాలు – యుద్ధ విమానాలు ఉత్పత్తి చేసే కంపెనీలు – వ్యాపార సంస్థలు – అవినీతి రాజకీయ నాయకులు, ఆయా దేశాల్లోని యుద్ధోన్మాదులు. తీవ్రంగా నష్టపోయేది మాత్రం ప్రజలే. ప్రాణాలు కోల్పోయేది వీరసైనికులు – మహిళలు – పిల్లలు – సాధారణ పౌరులు. ప్రజల ఉమ్మడి ఆస్తులు – వ్యక్తిగత ఆస్తులు విధ్వంసానికి గురౌతాయి. ద్రవ్యోల్బణం పెరిగి ధరలు పెరిగిపోతాయి. పన్నుల భారం పెరుగుతుంది. అభివృద్ధి పనులు ఆగిపోతాయి. దేశ రక్షణ బడ్జెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరింది, ఇహ! రెండో స్థానానికి ఎగబాకుతుందన్న ఆశాభావం ఆవిరైపోతుంది. యుద్ధోన్మాదుల కలలు నేరవేరితే! ప్రజల కలలు అవిరైపోతాయి. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) ద్వారా మే 6న విడుదలైన 2025 మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం 193 దేశాల్లో భారత ఉపఖండంలోని దేశాల స్థానం ఎక్కడుందో పరిశీలిద్దాం. శ్రీలంక 89 (0.776తో అధిక మానవాభివృద్ధి), భూటాన్‌ 127 (0.698తో మధ్యమ మానవాభివృద్ధి), భారత్‌ 130 (0.685తో మధ్యమ మానవాభివృద్ధి), బంగ్లాదేశ్‌ 130 (0.685తో మధ్యమ మానవభివృద్ధి), నేపాల్‌ 145 (0.622తో మధ్యమ మానవాభివృద్ధి), పాకిస్థాన్‌ 168 (0.544తో తక్కువ మానవభివృద్ధి), ఆఫ్గానిస్థాన్‌ కు సంబంధించిన తాజా గణాంకాలు అందుబాటులో లేకపోయినా మునుపటి నివేదికల ఆధారంగా తక్కువ మానవభివృద్ధి జాబితాలో ఉన్నది. ఉగ్రవాదం అంతానికి యుద్ధాలే చేస్తే మధ్యమ మానవాభివృద్ధి ర్యాంకులో ఉన్న మన దేశం తక్కువ మానవభివృద్ధి దేశంగా దిగజారే ప్రమాదం లేదా! తక్కువ మానవభివృద్ధి ర్యాంకులో ఉన్న పాకిస్థాన్‌ మరింత అధమ స్థాయికి దిగజారదా!
ఉగ్రవాదం ప్రపంచానికి తీవ్ర సవాల్‌: ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. మానవాళికే ప్రమాదకరంగా పరిణమించింది. సామాజిక, ఆర్థికాభివృద్ధికి అవరోధంగా నిలిచింది. మతాల మధ్య చిచ్చుపెడుతూ, అమాయక ప్రజల ప్రాణాలను నిర్ధాక్షిణ్యంగా బలిగొంటున్నది. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. దాని పుట్టుకకు సంబంధించిన మూలాలను సహేతుకమైన దృక్పథంతో పసిగట్టి, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలి. సంకల్పంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడం ద్వారా మాత్రమే నిర్మూలించవచ్చు. అంతర్జాతీయంగా దేశాల మధ్య సమన్వయం, సహకారం, భాగస్వామ్యం లేకుండా అసాధ్యం. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఆధిపత్యం – రాజకీయ లబ్ధి, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఒక అస్త్రంగా వాడుకున్న హీనమైన చరిత్ర అమెరికాను వెంటాడుతున్నది. దీనికి ఆఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలే ప్రబల నిదర్శనం. 1980 దశకంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్గాన్‌ ముజాహిద్దీన్‌ లను ప్రోత్సహించి ఉగ్రవాదాన్ని బలోపేతం చేసింది. నేడు ఆఫ్గానిస్థాన్‌ లో తాలిబాన్లు అధికారంలో ఉండడానికి కారకులు అమెరికన్‌ సామ్రాజ్యవాదులే. తమపై దాడి చేయడంతో బిన్‌ లాడెన్‌ను పాకిస్థాన్‌ గడ్డపైనే అంతమొందించింది. భారత దేశం – సోవియట్‌ యూనియన్‌ మధ్య మైత్రి బంధాన్ని జీర్ణించుకోలేక పాకిస్థాన్‌ కు మద్దతుగా నిలిచి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశం అమెరికానే. నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పాక్‌ మధ్య మధ్యవర్తిత్వం చేసి తానే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరింపచేశానన్న ఖ్యాతిని మూటకట్టుకున్నారు. నాడు, నేడు అమెరికన్‌ సామ్రాజ్యవాదం అనుసరించిన, అనుసరిస్తున్న వినాశకర విధానాల పర్యవసానాలను ప్రపంచం మొత్తం అనుభవిస్తున్నది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక మద్దతు ఎంతో కీలకమైనది. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పెద్దనోట్ల రద్దు లక్ష్యాలలో ఒకటి ఉగ్రవాదుల ఆర్థిక మూలలపై గొడ్డలి పెట్టు వేయడమని నాడు ప్రకటించారు. నిబద్దతతో ఆర్థిక నియమాలను అమలు చేయడానికి, ఆర్థిక ప్రవాహాలకు అడ్డుకట్ట వేయడానికి - పర్యవేక్షించడానికి, నిధుల నెట్‌వర్క్‌లను కూల్చడానికి అంతర్జాతీయ సహకారం అనివార్యం. సరిహద్దుల నియంత్రణను పటిష్టం చేయడం ద్వారా ఉగ్రవాదుల చొరబాటును, ఆయుధాల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలి. మన దేశంలో తీవ్రవాదంతో ప్రభావితమై ఉగ్రవాదుల్లో కొత్త చేరికలు లేకుండా చేయడానికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలి. ప్రజలను, మతాల నాయకులను, రాజకీయ పార్టీలను, పౌర సంస్థలను ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం - సహనం - సహకారం - శాంతియుత సహజీవనాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విమర్శనాత్మక - హేతుబద్ధమైన ఆలోచన రేకెత్తించే, మానవ హక్కులను ప్రేమించే, లౌకిక - ప్రజాస్వామిక భావాలను బలంగా నాటే శాస్త్రీయ విద్యను భావితరాలకు అందించాలి. ఉగ్రవాదంపై సమగ్ర దృష్టి అవసరం: పాకిస్థాన్‌ తో యుద్ధం చేసి, ఓడిస్తిే ఉగ్రవాదం అంతమైపోతుందనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే అది అత్యంత లోపభూయిష్టమైనది. సమగ్ర దృష్టి కొరవడిన వారే అలా ఆలోచిస్తారు. ప్రభుత్వాలు ఉగ్రవాదానికి మద్దతిస్తే, ఆర్థిక సహాయం చేస్తే, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రపంచ శాంతి, భద్రతకు తీవ్ర ప్రమాదం తెచ్చిపెట్టినట్లే. దీన్ని అడ్డుకోవడానికి వివిధ వ్యూహాలతో పాటు సమ్మిళిత అంతర్జాతీయ కృషి అవసరం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలపై ఆర్థిక, వాణిజ్యపరమైన, విదేశీ ప్రయాణాలపైన, ఆయుధ కొనుగోళ్లపైన నిషేధాలు విధించాలి. రుణ సదుపాయాలపై ఆంక్షలు విధించాలి. దౌత్య సంబంధాలు పెట్టుకోకూడదు. అంతర్జాతీయ సమాజం వెలివేయాలి. పాకిస్థాన్‌ను - కశ్మీర్‌ను సర్వనాశనం చేస్తున్నది ఉగ్రవాదమే: ఉగ్రవాద కార్యకలాపాలు పాకిస్థాన్‌ ఎదుగుదల, అభివృద్ధికి అవరోధంగా నిలిచాయి. పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.5శాతం పెరుగుదల మాత్రమే ఉంటుందని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిరచాయి. పాకిస్థాన్‌ ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధికి ఉగ్రవాదం ప్రధాన అడ్డంకిగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరు నిజంగా అత్యవసరమైనది పాకిస్థాన్‌ దేశానికే. ప్రపంచంలోని ఏ భాగంలోనైనా ఉగ్రవాదుల దాడులు ఆర్థిక అస్థిరతను కలిగిస్తాయి. రవాణా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆర్థిక మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగించే పోరాటం కేవలం మన దేశం కోసమే కాదు, అంతర్జాతీయ సమాజం కోసమని గుర్తించాలి. ఆర్థిక సంపదను రక్షించడం, సామాజిక స్థిరత్వాన్ని, మానవ జీవితాలను కాపాడడం, ప్రపంచ శాంతి - భద్రతను కాపాడటం అత్యవసరం. అందుకే జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలపై సమిష్టి సమరం అవసరం. 2015 నుంచి 2025 వరకు పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల దాడుల్లో పౌరుల మరణాల గణాంకాలను పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. మహిళలు, పిల్లలతో సహా పౌరులు ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలో జమ్మూ కశ్మీర్‌తో మొదలుపెట్టి వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడుల్లో అసంఖ్యాకులు మరణించారు. ఏ ప్రభుత్వానికైనా పౌరుల ప్రాణాలను కాపాడడం ప్రథమ బాధ్యత. కాశ్మీర్‌కు పర్యాటక రంగం జీవనాధారం. ఉగ్రవాదులు జమ్మూ`కశ్మీర్‌ను విధ్వంసం చేశారు. చివరలో ఒక్క మాట. ఫాసిజంపై విజయం 80వ వార్షికోత్సవాలు ప్రపంచ వ్యాపితంగా మే 9న నిర్వహించారు. రెండు ప్రపంచ యుద్ధాలు, భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య మూడు యుద్ధాలు, ఇతర దేశాల మధ్య జరిగిన, జరుగుతున్న యుద్ధాలన్నీ వినాశకరమైనవే. ఫాసిజం వ్యతిరేక పోరాటంలో కోట్ల మంది మరణించారు, అపారమైన నష్టం జరిగింది. నేడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే సమరంలో దేశ ప్రజలను, అంతర్జాతీయ సమాజాన్ని భాగస్వాములను చేయాలి. పాకిస్థాన్‌ ఉగ్రవాదుల సంకెళ్ల నుంచి విముక్తి చెందితేనే అభివృద్ధి చెందుతుంది. ఆ దేశం ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కలిసిరావాలి. సాంకేతిక యుగంలో అన్ని రంగాలతో పాటు సైనిక రంగంలోను భారీమార్పులు వచ్చాయి. అణ్వస్త్రాల సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం అత్యంత ప్రమాదకరమైనది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు