Wednesday, March 5, 2025
Home‘రాజధాని’పై రసాభాస

‘రాజధాని’పై రసాభాస

. ఎమ్మెల్సీ పండుగుల వ్యాఖ్యల దుమారం
. అమరావతిపై విషం చిమ్ముతారా?
. మండలిలో వైసీపీపై మంత్రుల ధ్వజం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలిలో రాజధాని అమరావతి అంశం రసాభాసగా మారింది. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు బడ్జెట్‌పై ప్రసంగాలకు అనుమతించారు. బడ్జెట్‌ కేటాయింపులపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజధానిగా అమరావతి నిర్ణయం, అభివృద్ధిపై ఆయన తీవ్ర అభ్యంతరకర వాఖ్యలు చేశారు. కాగా రాజధానిని ఘోస్ట్‌ సిటీతో పోల్చడాన్ని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మధ్యలో రాజధాని అమరావతి నగరం ఉంటుందని కొందరు చెబుతున్నారని, ఆస్ట్రిచ్‌ పక్షిలాగా ఎందుకు లేనిపోనివన్నీ పెట్టుకుంటారని, అమరావతి నగరాన్ని కట్టలేరని, అది సాధ్యం కాదని, నగరాలను నిర్మించలేం… వాటంతట అవే అభివృద్ధి చెందాలని పండుగల రవీంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేయగా… దానికి మంత్రులు ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాజధానిపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. దీంతో ఒక్కసారిగా మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత పండుగల రవీంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి అనేది ఇటుకలు, సిమెంట్‌తో కట్టేది కాదని, కొత్తగా నగరాలను కట్టడం అనేది సాధ్యం కాదన్నారు. ఒకప్పుడు బర్మా దేశం క్యాపిటల్‌ను కట్టుకుందని, ఇప్పుడు అక్కడ బిల్డింగులే తప్ప మనుషులు లేరన్నారు. బర్మా దేశం రాజధానిని ఘోస్ట్‌ సిటీ అంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి అమరావతి రాజధానిగా అంగీకారం కాదని, అమరావతికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తారా? అని ప్రశ్నించారు.
రాజధానిపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు: అచ్చెన్నాయుడు, కొల్లు, పార్థసారథి
పండుగుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సభలో ఉన్న మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదంటూ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రజలు రాజధానిపై ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారని, మూడు రాజధానులన్న వైసీపీకి ఏ తీర్పునిచ్చారో తెలుసంటూ ఎద్దేవా చేశారు. అమరావతే ఏకైక రాజధాని అని, ఎన్నికలకు వెళ్తే ప్రజలు కూటమికే పట్టం కట్టారని గుర్తుచేశారు. రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతంగా నిర్మిస్తారని, సీఎం విజన్‌ ఏంటో తాము చేసి చూపిస్తామని గట్టిగా సమాధానం ఇచ్చారు. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతున్నారని, ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో అధికారులు ఉండేందుకుగాను రాజధానిలో వసతులు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలంతా మనుషుల మధ్య నుంచే అమరావతికి వస్తున్నారనే విషయం తెలుసుకోవాలంటూ మంత్రి చురకలు అంటించారు. వైసీపీ నేతలు అమరావతి వద్దు..మూడు రాజధానులే ముద్దంటూ ఎన్నికలకు వెళ్లారని, అప్పుడు ఏం జరిగింతో అందరికీ తెలుసంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఇది ప్రణాళికా బద్ధ బడ్జెట్‌: కూటమి ఎమ్మెల్సీలు
ఎమ్మెల్సీ రేపాక చిరంజీవి మాట్లాడుతూ 2025-26బడ్జెట్‌లో అసమర్థ వనరుల వినియోగం నుంచి సమర్థవంతమైన వనరుల వినియోగంవైపు సాగుతున్నామన్నారని చెప్పారు. ఐదేళ్లుగా తలసరి ఆదాయ వృద్ధి రేటు క్షీణించిందని, గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు అందించకుండా వాటిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాగ్‌ నివేదికల ప్రకారం గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్లు రాలేదన్నారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ మాట్లాడుతూ, 2025-26 బడ్జెట్‌ మాటల బడ్జెట్‌ కాదు..ప్రణాళికాబద్ధంగా భవిష్యత్‌ కు బాటలు వేసిన బడ్జెట్‌ అని, ఇది ఎన్నికల హామీలను నేరవేర్చనున్న బడ్జెట్‌అని చెప్పారు.
వాస్తవాలకు దూరంగా కేటాయింపులు: వైసీపీ
ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ, బడ్జెట్‌ కేటాయింపులు వాస్తవాలకు దూరంగా ఉందని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, విద్యా రంగానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు జరగలేదని, నాడు-నేడు ద్వారా 90శాతం పూర్తయిన పాఠశాల భవనాలను పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ, కరోనా అనంతరం ధనికులే మరింత ధనికులుగా మారుతున్నారని, కాని పేదవారిని పట్టించుకునే వారే లేరన్నారు. విజన్‌-2047 డాక్యూమెంట్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. గత ప్రభుత్వం రైతులకు, చేనేత కార్మికులకు, బడుగు, బలహీనవర్గాల వారికి అండగా నిలిచిందని, కూటమి ప్రభుత్వం వారందరి సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వానికి ఆద్యుడైన దివంగత ఎన్టీఆర్‌తోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితర సినీ రంగానికి చెందిన వారున్నప్పటికీ..రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వచ్చే సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం స్పెషల్‌ మెన్షన్‌లో భాగంగా ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, వంకా రవీంద్రనాథ్‌, పి.చంద్రశేఖర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌, ఎంవీ రామచంద్రారెడ్డి, బొర్రా గోపీమూర్తి, ఐ.వెంకటేశ్వర్లు, ఇందుకూరి రఘురాజు, నర్తు రామారావు తదితరులు వివిధ సమస్యల పరిష్కరించాలని మండలి దృష్టికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు మండలిని వాయిదా వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు