Saturday, February 22, 2025
Homeరూ.3 లక్షల కోట్లపైనే!

రూ.3 లక్షల కోట్లపైనే!

. తుది దశకు బడ్జెట్‌ కూర్పు
. శాఖల ప్రతిపాదనలపై సీఎం పరిశీలన
. దిల్లీ నుంచి వచ్చాక కసరత్తు కొలిక్కి

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ భారీగా ఉండబోతోంది. సూపర్‌సిక్స్‌ హామీల అమలుతో పాటు, సాగునీటి ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన జరుగుతోంది. దీనిపై ఆర్థిక శాఖాధికారులు నెలరోజులుగా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారం భం కానున్నాయి. ఈమేరకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. పక్షం రోజులపాటు జరగనున్న సమావేశాల్లో ఈనెల 28వ తేదీన 202526 వార్షిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత బడ్జెట్‌ రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. ఈసారి 3లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. గడువు దగ్గర పడుతుండడంతో అధికారులు బడ్జెట్‌ కూర్పు కసరత్తు మరింత వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆర్థికశాఖాధికారులతో రెండు సార్లు భేటీ అయ్యారు. బడ్జెట్‌ కేటాయింపులపై మార్గనిర్దేశనం చేశారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వశాఖలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం, వాటిలో కొన్ని సవరణలకు సూచనలు చేసినట్లు తెల్సింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఇరిగేషన్‌, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులను మూడేళ్లలో ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికనుగుణంగా కేంద్రం నుంచి అందే ఆర్థిక సహకారం ఆలస్యమైనా వీటి డెడ్‌లైన్‌లో మాత్రం పొడిగింపు ఉండకూడ దన్న నిర్ణయంతో సీఎం ఉన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతకనుగుణంగానే అధికారులు కేటాయింపులు చేసినప్పటికీ, ముఖ్యమంత్రి మరోసారి పరిశీలన చేసిన తర్వాతే బడ్జెట్‌ కూర్పు కొలిక్కిరానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు