Monday, May 12, 2025
Homeతెలంగాణరైతు మృతికి రేవంత్‌ సర్కార్‌దే బాధ్యత

రైతు మృతికి రేవంత్‌ సర్కార్‌దే బాధ్యత

. అందాల పోటీలపై కాదు… ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలి
. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి: కేటీఆర్‌ డిమాండ్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌: ‘‘ఓవైపు ముఖ్యమంత్రి అందాల పోటీల్లో మునిగితేలుతుంటే, మరోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు రాశులపైనే ప్రాణాలు విడిచిన దురదృష్టకర పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందని… ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబా బాద్‌ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు కిషన్‌ (51) అనే రైతు పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై తీవ్రంగా స్పందించారు. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట మోసం చేసి, చివరికి పండిన పంటను కొనక వదిలేయడం వల్లే రైతన్న అనాథలా మారాడన్నారు. ఇది కేవలం నిర్వాకం కాదు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని కేటీఆర్‌ అన్నారు. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాల్లో కళ్లముందే నాశనమవుతోందని, మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ పరిస్థితులకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌ సర్కారుదే అని ధ్వజమె త్తారు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి రైతులు పడిగాపులు పడుతున్న పట్టించుకునే నాథుడే లేడని విమర్శిం చారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన గుగులోతు కిషన్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ఇప్పటికైనా సీఎంకు సోయి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. లేకపోతే రైతుల ఆగ్రహానికి సర్కారు తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది’’ అని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు