Thursday, April 3, 2025
Homeవిశ్లేషణరైతు వ్యతిరేకత వదలని కేంద్రం

రైతు వ్యతిరేకత వదలని కేంద్రం

కాగితాల రాజశేఖర్‌

రైతు వ్యతిరేకత, కార్పొరేట్లకు దాసోహం అనే విధానాలను కేంద్ర ప్రభుత్వం వదులుకోలేదు. గతంలో ప్రధాని మోదీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా 383 రోజులు సాగిన ఆందోళనకు తలొగ్గి వాటిని ఉపసంహరించుకున్నారు. కేంద్రప్రభుత్వం 2024 లో (1) నేషనల్‌ పాలసీ ఫ్రేమ్‌ వర్క్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ (2) నేషనల్‌ కో ఆపరేటివ్‌ పాలసీ (3) డిజిటల్‌ అగ్రికల్చరల్‌ మిషన్ల పేర్లతో మూడు పథకాలను తెచ్చింది. నాటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు ప్రతి రూపమే ఈ పథకాలు. గతంలో ఉపసంహరించుకున్న మూడు నల్ల వ్యవసాయ చట్టాల స్థానంలో మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే ప్రయత్నాలలో భాగమే ఈ పథకాలు. భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు, మార్కెట్‌ సదుపాయాలను విస్తరించేందుకు, డిజిటలైజేషన్‌ ద్వారా వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చాలనే అందమైన మాటలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఇవి రైతుల బతుకు చిన్నాభిన్నం చేస్తాయనే విమర్శలున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ 2024 జూన్‌ 25 న జాతీయ వ్యవసాయ మార్కెట్‌ పాలసీ ముసాయిదాను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి ఫైజ్‌అహ్మద్‌ కిద్వాయ్‌ నియమితులయ్యారు. 2024 నవంబరు 25 న ముసాయిదా మార్కెటింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ను ప్రతిపాదిస్తూ వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తులపై సార్వత్రిక పన్ను విధించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కమిటీ చెబుతున్నది. ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల స్థానంలో వ్యవసాయ మార్కెటింగ్‌ కొత్త ఫ్రేమ్‌ వర్కును కమిటీ సూచించింది. రైతాంగ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో నిల్వ చేయడం, కార్పోరేట్‌ సంస్థల ద్వారా నేరుగా కొనుగోలు చేయడంపై చట్టాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు చేసేందుకు జి.యస్‌.టి. తరహాలో రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ యార్డులను రద్దు చేసే ప్రయత్నాలకు కొత్త ప్రతిపాదనల ద్వారా చేయపూనుకున్నది. ప్రైవేట్‌ సంస్థలకు మరింత అవకాశాలు కల్పించడంతో, చిన్న రైతులు పోటీ చేయలేక తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల వ్యవస్థను బలహీనపరచడం రైతులకు నష్టకరం. పెద్ద కంపెనీల గుత్త ఆధిపత్యానికి అవకాశం ఏర్పడి రైతుల చెల్లింపులపై అధిక నియంత్రణ సాధించే అవకాశం ఉంది.
నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఫాలసీలో భాగంగా రాష్ట్రాల జాబితాలో ఉన్న సహకార రంగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకునే దుష్టపన్నాగానికి పూనుకుంటున్నది. జాతీయ సహకార పాలసీని ప్రకటించి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలను బహుళ ప్రయోజన ప్రాధమిక సహకార సంఘాలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. స్వతంత్ర సహకార సంఘాలుగా పనిచేస్తున్న పాల సహకార సంఘాలు, మత్స్యకార సహకార సంఘాలను వాటితో అనుసంధానం చేస్తున్నది. ఈ సంఘాలలో రైతులు, పాల ఉత్పత్తిదారులు, చేపలు పెంచేవారు సభ్యులుగా ఉంటారు. సంఘంలో ఎంత షేర్‌ ధనం ఉన్నా ఒకొక్కరికి ఒకొక్క ఓటు ఉంటుంది. నూతన చట్టం ప్రకారం పై మూడు రంగాలలో వ్యాపారం చేసేవారు, పుడ్‌ ప్రాసిసెంగ్‌ యూనిట్లు నడిపేవారు, పెట్టుబడులు పెట్టేవారు ‘‘ ఏ’ తరగతి వారు సభ్యులుగా చేరవచ్చు. వీరు 20 శాతం వరకు షేర్‌ ధనం కట్టవచ్చు. ఒకొక్కరికి 20 శాతం ఓటింగ్‌ హక్కు కూడా ఉంటుంది. అంటే సదరు సొసైటీలన్నీ కార్పోరేట్లు, పెట్టుబడిదారుల వశం అవుతాయి. ఇది అత్యంత అప్రజాస్వామిక దుర్మార్గపూరిత విధానం. కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల నియంత్రణను పెంచడం వల్ల స్థానికంగా ఏర్పడే సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి పోతుంది. సహకార బ్యాంకులు, సంఘాలు నిధుల కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో, కొత్త విధానం ఆర్థిక స్థిరతను ఏ రకంగా అందించగలదో అర్థం కావడంలేదని నిపుణులు అంటున్నారు.
డిజిటిల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ ద్వారా సాంప్రదాయ వ్యవసాయాన్ని సాంకేతిక వ్యవసాయంగా మార్చడమే లక్ష్యంగా ప్రకటించింది. మన ఉత్పత్తులు పాలు, జూట్‌, పప్పుధాన్యాలు ప్రపంచంలో ప్రధమ స్థాయిలోను, గోదుమ, వరి, వేరుశనగ, కూరగాయలు, పండ్లు, పత్తి, చెరకు ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నా అత్యధిక శాతంగా ఉన్న చిన్న కమతాల వ్యవసాయం వల్ల రైతులకు సరైన ఆదాయం రావడంలేదని ముసాయిదా పేర్కొన్నది. రైతులందరినీ గ్రూపులుగా ఏర్పరచి కార్పోరేట్‌ వ్యవసాయంలోకి తేవాలని తద్వారా కార్పోరేట్‌ కంపెనీల అజమాయిషిలోకి పేద, మధ్య తరగతి రైతాంగాన్ని బందీలుగా చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. డిజిటల్‌ అగ్రికల్చరల్‌ మిషన్‌ వలన రైతుల వ్యక్తిగత డేటా ప్రైవేట్‌ కంపెనీల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు కొత్త వ్యవస్థలో వెనుకబడి పోవటంతో పాటు, గ్రామాల్లో సరైన ఇంటర్నెట్‌ లేకపోవటం, రైతులకు వీటిని వాడే నైపుణ్యం లేకపోవడం రైతులకు తీవ్ర హాని చేసే అవకాశం ఉంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా కార్పోరేట్‌ సంస్థలకు మాత్రం 16 లక్షల కోట్లకు పైగా బకాయిలు రద్దు చేసింది. మరో పక్క రద్దు చేసిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చే పథకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఇవి చట్ట రూపం దాల్చకముందే రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని అన్ని రైతు సంఘాలు కలిసి వున్న సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలో భాగస్వాములౌతున్నాయి. అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ మహాసభలు ఏప్రిల్‌ 15, 16, 17 తేదీలలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రైతులను ఈ ప్రమాదకర చట్టాల పట్ల చైతన్యపరిచేందుకు విజయవాడలో ఏప్రిల్‌ 3 , 4న కర్నూల్లోనూ, 8న అనంతపురంలోనూ సదస్సులు జరపనుంది. ఈ విధానాలు కేంద్రం రైతుల కోసం తెచ్చినవే అయినా, అమలులో అవి కార్పొరేట్‌ కంపెనీలకు, రాజకీయాలకు మేలు చేసేలా వున్నాయి. సరైన భద్రత, న్యాయమైన ధరలు, స్వేచ్ఛ లేకుండా రైతులు వ్యవసాయ రంగంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ చట్టాలు రైతులకు నిజమైన మేలు కలిగించేలా మారాలంటే, ప్రభుత్వం నేరుగా రైతులను పరిరక్షించే, వాటిపై సమర్థమైన నియంత్రణ కలిగించే చర్యలు తీసుకోవాలి. లేకపోతే, రైతులు వ్యవసాయ మార్కెట్లో అస్థిరతను ఎదుర్కొంటూ, తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉంది.
సెల్‌: 9948317270
(నేడు విజయవాడ హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతున్న రైతు సదస్సు సందర్భంగా)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు