Friday, February 28, 2025
Homeసంపాదకీయంలెక్కలేని లెక్కలు!

లెక్కలేని లెక్కలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 202526 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ఎనకటికి ఒకడు ‘కాణీ లేకుండా కాశీ యాత్రకు బయలుదేరి నట్లుంది’. ఊహలకందని లెక్కలు, కనులు కానని ఖర్చులు, అంచనాలకు మించిన అప్పులు... వెరసి వచ్చే ఐదేళ్లలో ఆంధ్రాకు అమరావతి తప్ప ఇంకేమీ మిగిలేటట్లు లేదు. ‘అభివృద్ధిసంక్షేమం సమతూకం’ అనే పేరుతో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూస్తే సమతూకమేమోగాని ఈ రెండిరటి మధ్య అంతులేని అంతరం అనివార్యంలా కన్పిస్తోంది. రూ.3,22,359 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూలోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు. ఈ తరహా అంచనా వ్యయంతో అడుగులేస్తే, పూర్తిస్థాయి అభివృద్ధీ సాధ్యం కాదు, అలాగని అందరికీ సంక్షేమమూ అసాధ్యమే. రెండిరటిలోనూ కోత తప్పదని ఈ బడ్జెట్‌తో తేలిపోయింది. దీన్ని అతీగతీలేని బడ్జెట్‌ అని అనలేం. ఎందుకంటే ఈ బడ్జెట్‌కు ‘అతి’ కాస్త అధికంగానే ఉంది. ‘గతి’ మాత్రం ఎక్కడో తప్పినట్లుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 4 లక్షల 21 వేల 201 కోట్ల రూపాయలు అప్పు చేశారని బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. ఇప్పుడు మరి కూటమి సర్కారు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసినట్లుగా అంచనా. ఇంకోవైపు పూడ్చలేని లోటు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ నిర్వహణ ఎలా సాధ్యం? ఇంత లోటును ఎలా పూడుస్తారు? అప్పులు చేస్తారా? ఆస్తులు అమ్ముతారా? లేక ప్రజలపై భారం మోపుతారా? దీనిపై స్పష్టత ఎక్కడుంది? అప్పుచేసి పప్పుకూడు తింటే జగన్‌ ప్రభుత్వానికీ, చంద్రబాబు ప్రభుత్వానికీ తేడా ఏముంది? ఏతావాతా గత ప్రభుత్వ బాటలోనే కూటమి కూడా నడుస్తోందని చెప్పక తప్పదు. అందరూ ఆ తాను ముక్కలేనని దానర్థం.
2024 ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీఏ కూటమి (టీడీపీGజనసేనGబీజేపీ) విపరీతంగా వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చింది. ‘సంతకాడ సరుకులు కొనుడు కన్నా చాకిరేవులో ఉతుకుడు మేలన్నట్లు’గా జగన్‌ పెట్టిన హింసను భరించలేక ప్రజలు తప్పని పరిస్థితుల్లో కూటమిని కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే అధికారంలోకి వచ్చిననాటి నుంచీ ‘బాబు అండ్‌ కో’ మోదీని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని పదే పదే ప్రగల్బాలు పోతున్నారు. బడ్జెట్‌ ప్రసంగంలోనూ మంత్రివర్యులు పదిమార్లు ‘మోదీ స్ఫూర్తి’ని ప్రస్తావించారు. ఇదో రకమైన విడ్డూరం. అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో దేశాన్ని దరిద్రావస్థలోకి నెట్టేసిన మోదీని స్ఫూర్తిగా తీసుకుంటే…ఇంకేమైనా ఉందా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని? అదెటు పోవాలని? అర్థంలేని కథతో అట్టర్‌ఫ్లాప్‌ హీరోను పట్టుకొని వందరోజుల సినిమా ఆడిరచాలంటే ఎలా? అందుకే తాజా బడ్జెట్‌కు దిశానిర్దేశం లేకుండా పోయింది. సూపర్‌సిక్స్‌ పేరుతో చేసిన ఎన్నికల వాగ్ధానాలకు బడ్జెట్‌లో పరిపూర్ణంగా స్థానమిచ్చినట్లు గోచరించడం లేదు. సూపర్‌సిక్స్‌ను పూర్తిగా గాలికొదిలేశారా అన్న అనుమానమూ రాకమానదు. ఉచిత బస్సును అటకెక్కించారు. మహాశక్తి పేరుతో ప్రతినెలా మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. బడ్జెట్‌లో ప్రస్తావించనేలేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తామన్నారు. దీనికి దిక్కులేదు. జాబ్‌ క్యాలెండర్‌ జాడలేదు. బీసీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్‌, చంద్రన్న బీమా పథకాలనూ పక్కనపెట్టేశారు. ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు ఏటా రూ.15,000 ఇస్తామని ప్రకటించారు. అదీలేదు. లాయర్లకు నెలకు రూ.10 వేలు, కాపు సంక్షేమానికి రూ.15,000 కోట్లు, పెళ్లికానుక లక్ష రూపాయలు ఇస్తామని డాంబికాలు పలికారు. వాటిని పూర్తిగా మర్చిపోయారు. ఇక తల్లికి వందనం, దీపం పథకాల్లోనూ భారీ కోత విధించారు. రెండేళ్ల తల్లికి వందనానికి రూ.25 వేల కోట్లు కావాలి. కేవలం రూ.9,400 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. కోటీ 55 లక్షల మంది దీపం లబ్దిదారులను 90 లక్షలకు కుదించడమే గాక, బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లను కాస్త రూ.2,601 కోట్లకు తగ్గించేశారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకూ సున్నావడ్డీకి రుణమిస్తామని ప్రకటించిన కూటమి ఈ బడ్జెట్‌లో దానిపై ఒక్క మాటా చెప్పలేదు. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ 2025`26 బడ్జెట్‌లో కానరాలేదంటే, దానర్థం నాటి వాగ్ధానాలను పూర్తిగా విస్మరించినట్లేనా? ఒట్టుని తీసి గట్టుమీద పెట్టి నాలుగు సంచికల్లో బడ్జెట్‌ లెక్కలు చెపితే, జనం నమ్ముతారా? అరచేతిలో అద్భుత రాజధాని పెరుమాళ్లకెరుక! కళ్లముందు కన్పించే అప్పులకుప్ప ఆందోళనకరం. వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. సాగునీటి రంగానికి కనీసం 10% కేటాయింపులు ఉండాలి. అంటే లెక్క ప్రకారం బడ్జెట్‌లో రూ.32 వేల కోట్లు కేటాయించాలి. కానీ ఈరోజున సాగునీటికి కేటాయించింది కేవలం రూ.11,314 కోట్లు మాత్రమే. 3.5% కూడా లేదు. పోలవరం కాకుండా రాష్ట్రంలో సాగునీటికి రూ.77,845 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క రాయలసీమకే రూ.40,480 కోట్లు అవసరం. ఉత్తరాంధ్రకూ అంతే. ఈ అరకొర కేటాయింపులతో కచ్చితంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రంలోని ఎన్‌డీఏ పుణ్యమా అని ద్రవ్యోల్బణం దెబ్బకు, ధరల దరువుకు సామాన్యుడు ఏభై కిలోల గోనెసంచిలో అరకిలో వంకాయలేసుకొని ఇంతే ప్రాప్తమన్నట్లు జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ధరల స్థిరీకరణకు మన రాష్ట్రంలో కనీసం రూ.4,500 కోట్లు అవసరం. కానీ రూ.300 కోట్లే కేటాయించారు. గిట్టుబాటుధరల్లేక రైతులు ఓపక్క అల్లాడుతుండగా, సరసమైన ధరలకు సరుకులు సగటుజీవికి అందక కళ్లు బైర్లుకమ్ముతుంటే, ఈ నిధులు సరిపోతాయా? అదే విధంగా అన్నదాత సుఖీభవకు రూ.10,400 కోట్లు అవసరం కాగా రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. మ్యాచింగ్‌ గ్రాంట్ల కోసం నిరీక్షిస్తూ రైతన్న పొట్టకొట్టడం ఎంతవరకు సబబు. కడుపునింపని కొటేషన్లు మాత్రం బడ్జెట్‌ పుస్తకంలో బోలెడన్ని ఉన్నాయి. గారిడీలెక్కలూ గాదెకింద పందికొక్కుల్లా బలిసికొట్టుకుంటున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఎటు మోసుకుపోవడానికో అర్థం కావడం లేదు. ఈ బడ్జెట్‌తో ‘భవిష్యత్‌ చిత్రమొకటి’ స్పష్టంగా కన్పిస్తోంది. కూటమి పాలనలో ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయి అప్పులకు రంగం సిద్ధమైందని నూటికి నూరుపాళ్లు బడ్జెట్‌ కుండబద్దలుకొట్టి విపులీకరిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు