న్యూఢిల్లీ: వంటగ్యాస్ బుకింగ్ గడువు విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రీఫిల్ బుకింగ్ గడువు 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించింది. ఈ మేరకు కేంద్రమంత్రి సురేశ్ గోపి సోమవారం వెల్లడించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్మూజ్‌లో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ సమయంలో గ్యాస్ అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు, బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టే లక్ష్యంతో కేంద్రం పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్ గడువును 25 రోజులుగా, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా ఉంచింది. ‘ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా మెరుగుపడటం, రీఫిల్ బకాయిలు తగ్గడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని… గడువు విషయంలో సడలింపులు చేసింది. ఇప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎల్‌పీజీ గృహ వినియోగదారులంతా 25 రోజుల వ్యవధిలో రీఫిల్ బుక్ చేసుకోవచ్చు’ అని మంత్రి తెలిపారు. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.


