. అధికారప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు
. రాజ్యాంగానికి విరుద్ధం ముస్లింల హక్కులకు విఘాతం: ‘ఇండియా’
. అవినీతిని అరికట్టేందుకు కఠిన చట్టాలుండాలి: అమిత్‌షా
న్యూదిల్లీ : కేంద్రంలోని నియంతృత్వ మోదీ సర్కారు పంతం నెగ్గించుకుంది. పార్లమెంటు లోపల, వెలుపలా సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు తెచ్చింది. ఇండియా ఐక్యసంఘటన ఎంపీల తీవ్ర నిరసనల నడుమ బుధవారం మధ్యాహ్నం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని, ఈ బిల్లును తీసుకురాకపోతే… పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే స్థాయి దీటుగా స్పందించిన ‘ఇండియా’ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లు దేశ లౌకిక వ్యవస్థను దెబ్బతీసే చర్య అంటూ విమర్శించారు. ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించగా… చివరిలో రాత్రి పది గంటల వరకు పొడిగించారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కారు పట్టుదలతో ఉండగా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో రెండు పక్షాల మధ్య మాటలయుద్ధమే సాగింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఎంఐఎం సహా ఇండియా ఐక్య సంఘటన పార్టీలన్నీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాయి. ‘ప్రజాస్వామిక విలువలను మంటగలుపుతూ మేము వ్యతిరేకిస్తున్నాగానీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిపక్షాలు, లౌకిక పార్టీలు ఐక్యంగా అడ్డుకోవాలి’ అని ముస్లిం నేతలు కోరారు. ఈ బిల్లు ముస్లింల సాధికారతను హరించేందుకు, మైనారిటీలను విభజించే యత్నమని దుయ్యబట్టారు. వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు కేంద్రం పంపింది. కొన్ని ప్రతిపాదనలతో ఈ బిల్లును జేపీసీ ఆమోదించింది. ఇప్పుడు మళ్లీ ఇది లోక్‌సభ ముందుకు వచ్చింది. ముస్లింల హక్కులను హరించే విధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ (సవరణ) బిల్లును తెచ్చారని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. మతానికి సంబంధించిన న్యాయ సిద్ధాంతాలపై దాడిగా ఈ బిల్లును అభివర్ణించారు. ఓ వర్గానికి కాదు తమ కార్పొరేట్ మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది నిరంకుశ చట్టమని, రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శించారు. వక్ఫ్ భూములను స్వాహా చేయాలనే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టారు. బీజేపీ ఓ జుమ్లా పార్టీ అని, ఈ చట్టం ద్వారా మతం పేరిట దేశాన్ని విభజించాలని చూస్తోందని ఎంపీలు మండిపడ్డారు. భారత్‌లో సంఫ్‌ు పరివార్ గోప్య అజెండా అమలే వక్ఫ్ బిల్లు వెనుక ఉద్దేశమని విమర్శించారు. భవిష్యత్‌లో ఆలయాల భూములను కేంద్రం హరిస్తుందని హెచ్చరించారు. ‘ప్రభుత్వ సంఘాల ద్వారా వక్ఫ్ ఆస్తుల కబ్జా కోసమే వక్ఫ్ బిల్లు. ప్రతిపాదిత మార్పుల అవసరం లేదు. వక్ఫ్ ఆస్తులు ముస్లింలకు వెన్నుదన్ను’ అని ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ విధానాలు, ఉద్దేశాలు ఎప్పుడూ సరిగ్గా ఉండవని, కోట్లాది మంది దేశ ప్రజల ఇళ్లు, దుకాణాలను హరించేందుకు కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. ఇదిలావుంటే, వక్ఫ్ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమర్థించారు. దేశానికి చెందిన చట్టాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును రక్షించుకోవాలని చూస్తోందని, ఈ బిల్లు ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చని అన్నారు. మతాల మధ్య ఘర్షణ సృష్టించే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
దేశానికి కఠిన చట్టాల అవసరమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో చెప్పడాన్ని అమిత్‌షా గుర్తుచేశారు. ఈ బిల్లు అవినీతికి తప్ప ఏ మతానికీ వ్యతిరేకం కాదని అన్నారు. వక్ఫ్ బిల్లు అతిపెద్ద సంస్కరణ… రాజ్యాంగ బద్ధమైనదని అమిత్‌షా తెలిపారు. దీనిపై విపక్షాలు ఉద్దేశపూర్వకంగా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తూ ముస్లింలను భయపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డులో ముస్లింయేతురులు ఎవరూ ఉండరన్నారు.