10 నుంచి అమెరికాపై అదనపు సుంకాలు
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కవ్వింపులతో వాణిజ్య యుద్ధానికి చైనా సై అంటోంది. ఇప్పటికే అమెరికా తమ దేశంపై భారీగా సుంకాలు విధించడానికి దీటుగా అగ్ర రాజ్యంపై ఈనెల 10వ తేదీ నుంచి అదనంగా సుంకాలు విధిస్తూ ఉత్తర్వులను జారీచేసింది. అమెరికా నుంచి తమ దేశం దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లపై 15 శాతంÑ చమురు, వ్యవసాయ పరికరాలపై 10 శాతం చొప్పున సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. అలాగే టంగ్‌స్టన్ సంబంధిత వస్తువుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, కల్విన్ కెలిన్, ఇల్యుమినా ఇంక్ వంటి అమెరికా సంస్థల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ వాటిని విశ్వసనీయత లేని సంస్థల జాబితాలోకి చేర్చింది. టెక్ దిగ్గజం గూగుల్‌పై విచారణకు జిన్‌పింగ్ ప్రభుత్వం ఆదేశించింది. అమెరికా దూకుడుకు కళ్లెం వేస్తామని హెచ్చరించింది.
ట్రంప్ వెనక్కి…
కెనడా, మెక్సికోపై సుంకాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. రెండు దేశాల నుంచి ప్రతిఘటన ఎదురు కావడమే కాకుండా తమకు అనుకూలంగా కొన్ని హామీలు లభించడంతో శాంతించిన ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ ట్రంప్ తాజాగా ఉత్తర్వు లు జారీచేశారు. అమెరికా సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేస్తాయన్న హామీ లభించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే 10,000 మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంచి మత్తు పదార్థాలు, మానవుల అక్రమ రవాణాను కట్టడి చేస్తామని కెనడా, మెక్సికో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ట్రంప్‌తో మాట్లాడా: ట్రూడో
తమ దేశంపై సుంకాల విధింపు ఆదేశాలను ట్రంప్ 30 రోజుల పాటు నిలుపుదల చేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎక్స్‌లో వెల్లడిరచారు. ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణ మేరకు ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు చెప్పారు. వలసదారులు, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోడానికి కట్టుబడి ఉన్నామని ట్రంప్‌కు స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. సరిహద్దుల భద్రత కోసం కెనడా తొమ్మిది మిలియన్ డాలర్ల ఖర్చునకు… 10వేల మంది సైనికుల మోహరింపునకు అంగీకరించిందని అన్నారు. వ్యవస్థీకృత నేరాలపై నిఘూ పెట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ నిరోధానికి కెనడా-అమెరికా సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ట్రూడో వెల్లడిరచారు. మాదక ద్రవ్యాల స్మగ్లర్లను ఉగ్ర జాబితాలో చేర్చాలన్న ట్రంప్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసినట్లు కెనడా ప్రధాని చెప్పారు.