. అమెరికా-చైనా మధ్య ఒప్పందం
. 3 నెలల పాటు సుంకాల తగ్గింపునకు అంగీకారం
వాషింగ్టన్: అమెరికా`చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు అంగీకరించాయి. 90 రోజులపాటు టారిఫ్‌లకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాలు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకుంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఫలితంగా అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30 శాతానికి తగ్గించింది. రెండు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా నిర్ణయం ఈ తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా తొలుత 90రోజుల పాటు సుంకాల తగ్గింపు అమలులో ఉంటుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
మంచి పురోగతి: ట్రంప్
మరోవైపు దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. చైనాతో మంచి భేటీ జరిగిందని, చాలా విషయాలు చర్చకు వచ్చాయని చెప్పారు. కొన్నింటిపై ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరిందని, రెండు దేశాలకు ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలనే మేం కోరుకుంటున్నామని మంచి పురోగతి లభించిందని తెలిపారు.
ఇతర దేశాలతోనూ త్వరలో ఒప్పందం
అంతకుముందు ఇరు దేశాలు పరస్పర ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలకు, స్టాక్ మార్కెట్లకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా సుంకాలు విధించారు. ప్రతిగా ఆ దేశం కూడా అమెరికాపై టారిఫ్ వార్‌కు దిగింది. ఫలితంగా ట్రంప్ చైనా ఉత్పత్తులపై అమెరికా తన టారిఫ్‌లను 145 శాతానికి పెంచగా, చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలను విధించింది. దీంతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలై ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తాయి. తాజా నిర్ణయంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భారత్ సహా ఇతర దేశాలతోనూ త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధం ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెత్ అభిప్రాయపడ్డారు.