పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులను, స్థానిక సంస్థల సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ముఖ్యమంత్రులను అధికారంలో ఉన్న పార్టీ అధిష్ఠానం ఎంపిక చేస్తుంది. ఎన్నికైన శాసనసభ్యులే ముఖ్యమంత్రిని ఎన్నుకునే సంప్రదాయానికి ఇందిరా గాంధీ హయాంలోనే గండి పడిరది. అధిష్టానం అభీష్టం మేరకే ఎవరైనా ముఖ్యమంత్రి కావడం చాలా కాలంగా నడుస్తున్న సంప్రాదాయం. ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ఈ సంప్రదాయాన్ని బీజేపీ కూడా కొనసాగిస్తోంది. దిల్లీ శాసనసభకు ఫిబ్రవరి అయిదున పోలింగ్ జరిగితే ఫలితాలు వెల్లడిరచడానికి ఎన్నికల కమిషన్‌కు మరో మూడు రోజులు పట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 12 రోజులకు గానీ దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను చేయడానికి బీజేపీ అధిష్ఠానానికి కుదరలేదు. ఎక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో అంతిమ నిర్ణయం ప్రధానమంత్రి మోదీ తీసుకోవలసిందే. ఆయన విదేశీ పర్యటనలు ముగించుకు వచ్చాక గానీ రేఖా గుప్తా దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించడానికి వీలు లేకుండా పోయింది. రేఖా గుప్తా తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ముఖ్య మంత్రులను ఎంపిక చేయడంలో మోదీ, అమిత్ షా వినూత్న పద్ధతి అనుసరిస్తున్నారు. అంతకు ముందు మరుగునపడిఉన్న వారిని ముఖ్యమంత్రులను చేసేస్తున్నారు. దిల్లి లో అధికారం చెలాయించడానికి దాదాపు రెండు దశాబ్దాలు బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. రేఖా గుప్తా దిల్లీకి తొమ్మిదవ ముఖ్యమంత్రి. మహిళా ముఖ్యమంత్రుల్లో నాల్గవవారు. ఆమె శాసనసభ్యురాలైంది ఇప్పుడే కానీ దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మొదటి నుంచీ ఆమె క్రియా శీలంగా ఉండడంతో పాటు ఉగ్ర రూపాన్ని ప్రదర్శించిన సంఘటనలూ ఉన్నాయి. ఆమె దిల్లీ ముఖ్యమంత్రి అవుతారన్న వార్త వెలికి వచ్చినప్పటి నుంచీ ఆమె గత రాజకీయ చరిత్రను తవ్వి తీయడం మీదే ఎక్కువ దృష్టి ఉంది. ఆమె గతంలో చేసిన ట్వీట్లు, ప్రకటనలు వెలికి వస్తున్నాయి. ఆమె మాటల్లో ఎంత విద్వేషం నిండి ఉందో లెక్కలు తీస్తున్నారు. ‘‘గోలీ మారో ….. అన్న వారికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన బీజేపీ పీఠాధిపతులు రేఖా గుప్తాను ముఖ్యమంత్రిని చేయడంలో ఆశ్చర్యం ఏముంటుందిగనక! ఆమె మాటల్లో కులతత్వం మాత్రమే కాకుండా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని మూసివేసే దుస్సాహసిక ప్రకటన్లూ ఉన్నాయి. ఏ మాటకు ఆ మాట జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని మూసేయాలని బీజేపీ నాయకులు అనేకమంది ప్రకటనల జడి వాన కురిపించారు. ఇవన్నీ మోదీకి తెలియనవి కావు. ఆయన ఈ విద్వేషపూరిత దుస్సాహసిక ప్రకటనలను ఖండిరచరు. ఖండిస్తే ఆయన విద్వేష ప్రసంగాల గురించీ మాట్లాడవలసి వస్తుందిగా! జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో విద్యార్థులకు పది రూపాయలకే భోజనం పెడ్తారని, హాస్టల్‌లో గదికి వసూలుచేెసేది కూడా పది రూపాయలేనని, ఇన్ని వసతులు ఉన్న జె.ఎన్.యు. విద్యార్థులు దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని అందువల్ల ఆ విశ్వవిద్యాలయాన్ని మూసేయాలి అని రేఖా గుప్తా ఇంతకు ముందే సెలవిచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆమె దిల్లీ ముఖ్యమంత్రి కనక ఆ విశ్వవిద్యాలయాన్ని మూసేయిస్తారా! ఆ నిర్ణయం దిల్లీ ముఖ్యమంతి తీసుకునేది కాదన్నది వేరే అంశం. తమకు అనుకూలురైనవారిని ఆ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్లు, అధ్యాపక బృందాన్ని నియమించడానికి, వారికి విలాసవంతమైన సదుపాయాలు కల్పించే బీజేపీ మూసెయ్యదు గాక మూసెయ్యదు. గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జె.ఎన్.యు.లాంటి ఒక్క విశ్వవిద్యాలయాన్నైనా దేశంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. బీజేపీకి కావలసింది ఉత్తమ సదుపాయాలు తప్ప విద్యా ప్రమాణాలను పెంచడం కాదు. కేజ్రీవాల్ మీద రేఖా గుప్తా చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వీటిని ఆమె ఇప్పుడు అంగీకరించనైనా అంగీకరించాలి లేదా వాటిని ఉపసంహరించుకోవాలి. కానీ విద్వేషం నింపే వారికి క్షమాపణలు చెప్పే నైతిక శక్తి ఉండదు. బీజేపీలో రేఖా గుప్తా లాంటి వారు కొల్లలుగా ఉన్నారు. ఆమె విద్వేష పూరిత ప్రకటనలు, ప్రసంగాలు పాపం ఆమె సొంతం కాదు. అవి సంఫ్‌ు పరివార్ నుంచి అందినవే.
మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత మహిళను ముఖ్యమంత్రిని చేయడం ఇదే మొదటిసారి. వసుంధర రాజే సింధియాను మోదీ ముఖ్యమంత్రిని కానివ్వలేదన్న అంశం విస్మరించదగింది కాదు. సంఫ్‌ు పరివార్ సైద్ధాంతికత నరనరాన జీర్ణించుకున్నందువల్ల, విద్వేష ప్రసంగాల్లో యోగీ ఆదిత్యనాథ్‌ను మించిపోవాలని ఉబలాటపడ్తున్న రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంలో మోదీ ఆలోచనా ధోరణి ప్రస్ఫుటం అవుతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి దాని అమలును కనీసం 2029 దాకా వాయిదా వేసిన ఘనత మోదీదే. అంతకు ముందు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలు మరింత జాప్యం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోదీ మహిళను ముఖ్యమంత్రిని చేసి గొప్ప పని చేశానని చెప్పుకోవచ్చు. కానీ దిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన రేఖా గుప్తాకు మహిళల మీద ఏమాత్రం గౌరవం లేదు. రాముడిని చంపడానికి రావణుడు తన సోదరి శూర్పణకను పంపారు. కంసుడు తన సోదరి పూతనను కృష్ణుడిని చంపడానికి పంపించారు. హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని కడతేర్చడానికి హోలికను పంపారు. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకను మోదీ మీదకు ఉసిగొల్పారు అని రేఖా గుప్తా అన్నారు. చరిత్ర పునరావృతం అవుతుందని ఆమె నీతిబోధ కూడా చేశారు. ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు కాగలిగిన ఇద్దరు పిల్లల తల్లి అని కూడా అన్నారు. రేఖా గుప్తా చారిత్రక జ్ఞానం అంతా దోష ప్రకరణకు పనికొచ్చే విషయాలకే సంబంధించిందైందని అనుకోవాలి. రేఖా గుప్తాకు ఏ లక్ష్మణ రేఖా లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నందుననే మోదీ ఆమెను ముఖ్యమంత్రిని చేసి ఉంటారు. దిల్లీ పురపాలక సంఘ సమావేశంలో రేఖా గుప్తా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘన చరిత్ర కలిగిన మహిళ. అయితే ఈ దృశ్యాలను చూసి అవసరమైతే టేబుళ్ల్లు, కుర్చీలను ధ్వంసం చేయగలిగిన తమ ముఖ్యమంత్రి అని దిల్లీ వాసులు గ్రహించడానికి రేఖా గుప్తా గత కార్యకలాపాలన్ని ఉపకరిస్తాయేమో! దిల్లీవాసులకు విషపూరిత వాయువునే సహిస్తున్న ఓపిక ఉంది. అలాంటప్పుడు రేఖా గుప్తా లాంటి ముఖ్యమంత్రులను భరించడం కష్టం అవుతుందనుకోలేం. మాటల తూటాలే కాదు నిజమైన తూటాలు పేల్చగలిగేవారు, ఆగడాలకు పాల్పడేవారు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అయిపోతున్నప్పుడు రేఖా గుప్తా ఎంపికపై కూడా అభ్యంతరం ఉంటుందనుకోలేం.