డి.వి.వి.ఎస్,వర్మ
ఏప్రిల్ 22 లెనిన్ జయంతి. విప్లవం- లెనిన్ అనేవి విడదీయరాని జంట పదాలు. లెనిన్ పేరు స్ఫురణకు వస్తే రష్యాలో జరిగిన అక్టోబరు విప్లవం మన కళ్ల ముందు కదలాడుతుంది. 1917 లో రష్యాలో జరిగిన అక్టోబరు విప్లవానికి లెనిన్ సారధి. విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించి దానిని అధికారం హస్తగతం చేసుకునేందుకు నడిపించాడు. తొలి కార్మిక వర్గ రాజ్యం ఆవిర్భవించింది. సోషలిస్టు సమాజ నిర్మాణానికి రష్యాలో పునాదులు వేశాడు. ఈ విప్లవ కార్యాచరణ క్రమంలో లెనిన్ సిద్ధాంతపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అక్కడ ‘‘మార్క్సిస్టులమని’’ చెప్పుకునేవాళ్లు మార్క్స్ భావజాలానికి వక్రీకరణలు చేశారు. వారు మార్క్సిజాన్ని నియతివాదంగా పిడి వాదంగా దిగజార్చారు. ఈ పెడ ధోరణులను లెనిన్ తిప్పి కొట్టాడు. మార్క్సిజాన్ని ఒక సృజన శీల సిద్ధాంతంగా, కార్యాచరణకు కరదీపికగా మార్క్స్ భావజాలంలోని విప్లవ సారాంశాన్ని నిలబెట్టాడు. రష్యా పరిస్థితులకు అన్వయించే క్రమంలో మార్క్సిజానికి అనేక కొత్త చిగురులు తొడిగాడు. కొత్త మెరుగులు దిద్దాడు. ఎంతటి సిద్ధాంతమైనా అది ఆచరణలో రుజువు కావాలి. ఒక సిద్ధాంతాన్ని ఆచరణలోకి తేవడానికి నిర్దిష్టమైన ఉపకరణాలను పెంపొందించుకోవాలి. సరిగ్గా లెనిన్ అదే పని చేశాడు. మార్క్స్ కాలంలో కార్మిక వర్గం కూడా చాలా దేశాలలో వివిధ పార్టీలు, సంస్థలలో సంఘటితమైంది. 1848 లో, తర్వాత 1871 పారిస్ కమ్యూన్ తిరుగుబాట్లు జరిగాయి. అక్కడ కార్మికవర్గం తాత్కాలిక విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వివిధ దేశాలలో కార్మికవర్గ పార్టీలను అంతర్జాతీయంగా వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ ఏర్పాటు ద్వారా మార్క్స్ వాటికి దిశా నిర్దేశం చేసే ప్రయత్నాలు చేశాడు. లెనిన్ ఈ అనుభవాలను, గుణపాఠాలను ఆకళింపు చేసుకున్నాడు.
మార్క్స్ భావజాలాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక విప్లవకర పార్టీ అవసరాన్ని ప్రకటించాడు. కార్మిక వర్గ ‘‘అగ్రగామి దళం’’ గా ఆ పార్టీకి రూపు దిద్దాడు. ఆర్థిక పోరాటాల స్థాయి నుంచి రాజ్యాధికారాన్ని సాధించే విప్లవ పార్టీ నిర్మాణానికి దారులు వేశాడు. అలాంటి అవసరాన్ని అంతర్జాతీయంగా కార్మికోద్యమం గుర్తించేలా చేశాడు. ఈ ఆవిష్కరణ కోసం ఆయన ‘‘ఏం చెయ్యాలి’’ అన్న పుస్తకం రాశాడు. విప్లవ సిద్ధాంతాన్ని విప్లవ కార్యాచరణకు నడిపించే కొత్త తరహా పార్టీకి అంకురార్పణ చేశాడు. మార్క్స్ కాలంలో జరిగిన కార్మిక వర్గ తిరుగుబాట్లను పెట్టుబడిదారీ వర్గం అణిచివేసింది. పారిస్ కమ్యూన్‌లో కార్మికవర్గం అధికారం పొందినా కొద్ది రోజులలోనే దానిని పెట్టుబడిదారీ వర్గాలు కూలదోశాయి. ఈ అనుభవాల నేపథ్యంలో అనేక దేశాలలో కార్మికవర్గం అధికారం చేపట్టకపోతే అవి విజయం పొందలేవన్న నిర్ధారణకు రావడం సహజం. అలాగే అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే విప్లవాలు జరుగుతాయన్న నిర్ధారణ కూడా చారిత్రక పరిణామం నుంచి చేసిన సూత్రీకరణే.
మార్క్స్ తన కాలంలో అనేక దేశాలలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న దశను ‘‘ పెట్టుబడి’’ గ్రంథం లో విశ్లేషించారు. అదే సమయంలో ‘‘ఆసియా తరహా ఉత్పత్తి విధానం’’ ప్రత్యేకతలను గుర్తించాడు. మార్క్స్ రచనల్లో పిడివాదం కనిపించదు. స్థల కాలాలకు అతీతమైన చారిత్రక నియతివాదం వగైరా రూళ్లకర్ర నియమాలు వుండవు. మార్క్స్ తర్వాత 40 ఏళ్లలో జరిగిన పరిణామాలను లెనిన్ అధ్యయనం చేశాడు. పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా సామ్రాజ్యవాదంగా గుర్తించాడు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు అంతిమ దశగాను అది శ్రామిక విప్లవాలకు ప్రారంభ దశ గాను ప్రకటించాడు. ‘‘ సామ్రాజ్యవాదం – పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ’’ పుస్తకంలో సామ్రాజ్యవాదంగా అంతర్గత వైరుధ్యాలు, మార్కెట్ల విస్తరణ కోసం జరిగే యుద్ధాలు అనివార్యతను గుర్తించాడు. సామ్రాజ్యవాదం ప్రపంచ వ్యాపిత వ్యవస్థగా రూపొందినప్పటికీ ఆయా దేశాల అభివృద్ధిలో అసమానతల వల్ల వాటి మధ్య అంతర్గత వైరుధ్యాల వల్ల ఈ సామ్రాజ్యవాద దేశాల గొలుసులో బలహీనమైన లింకులు ఉంటాయని వాటిని ఛేదించడం ద్వారా కార్మిక వర్గం ఒక దేశంలో కూడా రాజ్యాధికారాన్ని పొంది నిలబెట్టుకునే అవకాశాలు వుంటాయని సూత్రీకరిం చాడు. ఆనాటి రష్యా అలాంటి బలహీనమైన లింకుగా నిర్ధారించి అక్కడ విప్లవం సాధ్యమేనని ప్రకటించాడు. సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చగలిగితే విప్లవాలు విజయవంతం అవుతాయని ప్రకటించాడు. అలాగే లెనిన్ మరో రచన ‘‘రాజ్యము -విప్లవము ‘‘అన్నది ఇది ప్రపంచ యుద్ధ కాలంలో రాసిన రచన. రెండో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో వున్న పార్టీలు రాజ్యం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్న దానిని వివరించడానికి ప్రధానంగా ఉద్దేశించింది. రెండో ఇంటర్నేషనల్‌లో పార్టీలు విప్లవాలు గురించి మాట్లాడుతూనే తీరా ప్రపంచ యుద్ధం వచ్చే సరికి అవి తమ దేశాల పెట్టుబడిదారీ పాలక వర్గాలను సమర్థించడం ప్రారంభించాయి. ఈ రాజ్యాలు చేస్తున్న యుద్ధాలకు కార్మిక వర్గం ఎందుకు సమర్థించకూడదో వివరించడానికి లెనిన్ ఈ పుస్తకాన్ని రాశారు.
మార్క్స్ ఏంగెల్స్ రాజ్యం గురించి చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ పుస్తక రచన సాగినా అది యుద్ధ సమయంలో రాజ్యం పట్ల అనుసరించాల్సిన వైఖరిని స్పష్టం చేయడం కోసం రాశాడు. ఒక లెనిన్ పార్టీ తప్ప అన్నీ తమ దేశాల ప్రభుత్వాలకు సమర్ధకులుగా నిలబడితే లెనిన్ దానికి విరుద్ధంగా రష్యాలో పాలకవర్గాన్ని కూలదోసే ప్రత్యామ్నాయాన్ని బోధించాడు. లెనిన్ వ్యూహం ఎత్తుగడలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సోషల్ డెమెక్రసీలో రెండు ఎత్తుగడలు ఎలా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలో వివరిస్తుంది. అలాగే ‘‘ఏప్రిల్ థీసిస్’’ లో లెనిన్ రూపొందించిన ఎత్తుగడ విప్లవ సాధనకు మార్గం చేసింది. వాస్తవానికి రష్యాలో ఫిబ్రవరి విప్లవం తర్వాత రెండు తరహాల అధికారాలు ఏర్పడ్డాయి. ఒకటి పై స్థాయిలో అధికారం చెలాయిస్తున్న పెట్టుబడిదారీ వర్గం, మరొకటి పట్టణాల స్థాయిలో కింద అధికారాన్ని కార్మికులు, రైతులు, సైనికుల నాయకత్వంలోని సోవియట్లు కలిగి వున్నాయి. అప్పటి సోవియట్లలో మెన్షివిక్కులే అత్యధిక ప్రాబల్యం కలిగి వున్నారు. లెనిన్ పార్టీ బోల్షివిక్‌లు మైనారిటీలో వున్నారు. అయినప్పటికీ అన్ని అధికారాలు సోవియట్లకే అన్న నినాదాన్ని లెనిన్ ప్రకటించాడు. ఎందుకంటే ఈ ‘‘సోవియట్ల’’ రూపాన్ని కార్మికవర్గ రాజ్యానికి ప్రాతిపదికగా గుర్తించాడు. లెనిన్ ఎత్తుగడ ఫలితంగా సోవియట్లు మెన్షివిక్‌లను వదిలి బోల్షివిక్ పక్షాన చేరాయి.అంతిమంగా ఈ ఎత్తుగడే విప్లవాన్ని సాధించి పెట్టింది. ఇలా సిద్ధాంత రంగంలో, ఆచరణ రంగంలో లెనిన్ ఆనాటి మార్క్సిజానికి కొత్తచూపును ఇచ్చాడు. దాని భావజాల పరిధిని విస్తరింపజేశాడు. ఈ కొత్త చిగుర్లు వేయడానికి లెనిన్ అధ్యయన పద్ధతి దోహదపడిరది. ఈ అధ్యయన పద్ధతి మీద లెనిన్ ఉద్యమ సహచరి, తర్వాత జీవిత భాగస్వామి అయిన కృపస్కయా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. ఆమె పేర్కొన్న రెండు మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించుకుందాం. లెనిన్ తన కార్యాచరణలో జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు ఆయన మార్క్స్‌ను సంప్రదించేవారు అంటే ఆయన రచనల్ని ఒకటికి రెండుసార్లు చదివేవాడు. మార్క్స్ భావజాలాన్ని సృజనాత్మకమైనదిగా ఆచరణకు కరదీపికగా భావించాడు. పిడివాదాన్ని ఆర్థిక, చారిత్రక నియతి వాదాలను ఆమోదించలేదు. ఇతర మార్క్సిస్టులలాగ మార్క్స్ నుంచి స్థల కాలాదులకు సంబంధంలేని ఉటంకింపులతో నిర్ధారణలకు రావడాన్ని నిరసించాడు.
లెనిన్ తనకు ఎదురైన సమస్య కోసం మార్క్స్ అలాంటి సందర్భంలో చేసిన విశ్లేషణను ఎత్తిరాసుకునేవాడు. మార్క్స్ కాలానికి, తన కాలానికి జరిగిన మార్పులను పరిశీలించే వాడు. దేశం కాలం పరిస్థితులకు వున్న వ్యత్యాసాలను వేరుచేసి తనకు ఎదురైన ప్రత్యేకతలకు మార్క్స్ భావజాలాన్ని అన్వయించడానికి పూనుకునేవాడు. అందుకే ఆయన కొత్త ఆవిష్కరణలు చేయగలిగాడు. స్థల కాలాల ప్రత్యేకతలు పరిగణనలో తీసుకోకుండా చేస్తే విశ్లేషణ ‘‘అనుకరణగానే’’ మిగిలిపోతుంది. మార్క్స్ రచనలతో నిరంతర సంభాషణ ద్వారా లెనిన్ తన దేశ కాలపరిస్థితులకు దానిని అన్వయించడంతో సరికొత్త నిర్ధారణలకు రాగలిగాడు. మార్క్సిజాన్ని ఆచరణకు సాధనంగా చేసుకుని విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించగలిగాడు. ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు రష్యా మార్గం, చైనా మార్గం వంటి అనుకరణలతో విప్లవాలను సాధించలేరు. లెనిన్ తరహాలో తమ తమ దేశ, కాల పరిస్థితులకు తగిన స్వతంత్ర మార్గాన్ని రూపొందించుకోవాలి. వారు తమ దేశంలోని ప్రత్యేకతలను, అభివృద్ధి దశను గుర్తిస్తేనే సరిపోదు.
ఆ ప్రత్యేకతలకు కొత్త తరహా పరిష్కారాలు అవసరం అవుతాయి. వాటిని ఆవిష్కరించడం నాయకత్వం నిర్వహించాల్సిన ప్రత్యేక విధి. అప్పుడు ప్రజలను సమీకరించే కొత్త లక్ష్యాలు, కొత్త నినాదాలు పుట్టుకొస్తాయి. ప్రజలను ప్రభావితం చేసి విజయాలను సాధించి పెట్టే కొత్త తరహా ఉద్యమాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. దానికి కొత్తగా వచ్చిన మార్పులకు, ప్రత్యేకతలకు మార్క్సిజాన్ని అన్వయించే కళను అవగాహన చేసుకోవాలి. లెనిన్ అధ్యయన పద్ధతి అందరికీ అలాంటి కొత్త చూపు ఇస్తుంది. లెనిన్ 155 వ జయంతిని అర్థవంతంగా నిర్వహించుకుందాం.
(లెనిన్ 155వ జయంతి సందర్భంగా)
దారి దీపం సంపాదకులు
సెల్: 8500678977
సిద్ధాంత రంగంలో, ఆచరణ రంగంలో లెనిన్ ఆనాటి మార్క్సిజానికి కొత్తచూపును ఇచ్చాడు. దాని భావజాల పరిధిని విస్తరింపజేశాడు. ఈ కొత్త చిగుర్లు వేయడానికి లెనిన్ అధ్యయన పద్ధతి దోహదపడిరది. ఈ అధ్యయన పద్ధతి మీద లెనిన్ ఉద్యమ సహచరి, తర్వాత జీవిత భాగస్వామి అయిన కృపస్కయా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. లెనిన్ తన కార్యాచరణలో జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు ఆయన మార్క్స్‌ను సంప్రదించేవారు.