తల్లి మృతి, కుమార్తె పరిస్థితి విషమం
విశాలాంధ్ర-పీఎం పాలెం (విశాఖపట్నం) : తన ప్రేమను తిరస్కరించిందన్న ఆగ్రహంతో మధురవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్వయంకృషి నగర్‌లో ఓ యువతిని, అడ్డొచ్చిన ఆమె తల్లిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా… కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామానికి చెందిన నక్కా దీపిక (20) విశాఖపట్నంలో డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా నవీన్ అనే ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే దీపిక అతడి ప్రేమను తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న యువకుడు బుధవారం ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో దీపిక తల్లి నక్కా లక్ష్మి (43) ఘటనాస్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీపిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగర పోలీస్ కమిషనర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తులో భాగంగా బృందాలుగా ఏర్పడిన పోలీసులు నవీన్ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకొని విశాఖ తరలిస్తున్నట్టు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించండి: చంద్రబాబు
ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో యువతి తల్లి లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు.
బాధితురాలికి మెరుగైన వైద్యం: అనిత
ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీ శంఖబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడి… దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.