విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అవినాశ్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంను ఆశ్రయించారు. అప్రూవర్‌ను శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు తమపై నమోదు చేసిన కేసులు క్వాష్ చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. వివేకా హత్య కేసు పరిణామాలను లూథ్రా కోర్టుకు వివరించారు. ప్రతివాదులకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీతా రెడ్డి మంగళవారం సచివాలయానికి వచ్చారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు. వివేకా హత్య కేసుపై చర్చించారు. సీఎంవో అధికారులతోనూ ఆమె సమావేశమయ్యారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. సుప్రీంకోర్టులో వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు కేసు దర్యాప్తులో పురోగతి గురించి తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సునీత విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
వైఎస్ అవినాశ్‌రెడ్డికి సుప్రీం నోటీసులు
RELATED ARTICLES