. మూడుకు చేరిన జీబీఎస్ మృతులు
. అదుపులోకి రాని బర్డ్ ఫ్లూ
. అంబేద్కర్ జిల్లాలో నాటుకోళ్లకూ వైరస్
. పెంపకం దారుల్లో ఆందోళన
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్), మరోవైపు బర్డ్ ఫ్లూ కేసుల విస్తరణ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ల నియంత్రణకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినప్పటికీ… ఇంకా పూర్తి స్థాయి అదుపులోకి రాలేదు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే కోడి మాంసం, కోడి గుడ్లను తినడాన్ని ప్రజలు ఆపేశారు. ఇవి తింటే ప్రజలకు ఎలాంటి వైరస్ రాదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసినప్పటికీ, ఎవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో మార్కెట్లో కోడి మాంసం ధర తగ్గుముఖం పట్టింది. బర్డ్ ఫ్లూ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఫారం కోళ్లకే పరిమితమైన బర్డ్ ఫ్లూ… నాటు కోళ్లకూ విస్తరించడంతో కోళ్ల యజమానులు కలవరం చెందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. ఈ రెండు వైరస్‌లను అదుపులోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. బర్డ్‌ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇక ఇటీవల వరకు మహారాష్ట్ర, తెలంగాణల్లో కలకలం రేపిన జీబీఎస్…ప్రస్తుతం రాష్ట్రంలోను చాపకింద నీరులా వ్యాపించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు జీబీఎస్ కేసులతో ముగ్గురు మృతి చెందారు. తాజాగా కర్నూలులో మరో కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు రాష్ట్రంలో విస్తరిస్తోంది. కేసులు క్రమక్రమంగా పెరగడంతో ప్రజలు కలవరం చెందుతున్నారు. ఈ వైరస్ బారిన పడి గుంటూరు జీజీహెచ్‌లో నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జీజీహెచ్‌లో ఇద్దరు మృతి చెందారు. అంతకుముందు ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్‌తో గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో జీబీఎస్ కేసుల మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నప్పటికీ కేసుల నమోదు..మరణాలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. జీబీఎస్ లక్షణాలతో 44 ఏళ్ల మహిళ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆరు రోజుల క్రితం తీవ్ర జ్వరం, కాళ్ల నొప్పులతో ఆమె ఆస్పత్రికి రాగా, వైద్య పరీక్షల అనంతరం జీబీఎస్ వ్యాధి నిర్ధారణైంది. దీంతో ఆమెను ప్రత్యేక వార్డులు ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ వ్యాధి కలుషిత ఆహారం వల్ల సోకుతుందని, పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ అరుదైన నరాల వ్యాధి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ, నరాలపై ఈ వైరస్ దాడి చేస్తుందని, ఫలితంగా కండరాల బలహీనత, గొంతునొప్పి, నడవలేని స్థితి, అలిసిపోయినట్లుగా అనిపిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. మొదటి దశలో చికాకు, నడుమునొప్పి ఉంటుందని, పక్షవాతం మాదిరిగా పాదాలు, చేతులు, ముఖం నిశ్చేష్టంగా ఉంటుందని, చర్మంలో సూదిగుచ్చినట్లుగా అనిపిస్తుందని తెలుపుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై… వెంటిలేటర్ అవసరం అవుతుందని, ముఖం, కంటి కండరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ కేసులు ఇంకా అదుపులోకి రాలేదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకింది. దాదాపు 95 గ్రామాల్లో బర్డ్ ఫ్లూతో నాటు కోళ్లు మృత్యువాతకు గురయ్యాయి. 15 రోజుల నుంచి నాటుకోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోతుండటంతో తమకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోందని యజమానులు లబోదిబో మంటున్నారు. ఇటీవల వరకు ఫారం, బ్రాయిలర్ కోళ్లకు వైరస్ సోకి మృతి చెందాయని ఆందోళన పడుతుంటే, ఇప్పుడు బర్డ్ ప్లూ వైరస్ నాటు కోళ్లకు సోకుతోంది. బర్డ్‌ప్లూ వైరస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కలకలం రేపుతోంది. గతంలో ఫారమ్, బ్రాయిలర్ కోళ్లకు వైరస్ సోకడంతో వాటిని తినేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. నాటు కోళ్ల కొనుగోలుకు ఎగబడ్డారు.
ఇదే అదునుగా నాటుకోళ్ల వ్యాపారులు ధరలను అమాంతం పెంచారు. ఇప్పుడు నాటు కోళ్లకూ వైరస్ సోకి మృత్యువాత పడటంతో వ్యాపారస్తులు లబోదిబో మంటున్నారు. ఒక్కో కోడిని పిల్ల దశ నుంచి ఏడాదికాలంపాటు బాదం, పిస్తా, జీడి పప్పు, కిస్మిస్, మేతలు వేసి పెంచుతామని, వైరస్ సోకడంతో దాదాపు 40 కోళ్లు చనిపోయాయని… దాదాపు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని ఓ వ్యాపారి ఆందోళన వ్యక్తం చేశారు. కోళ్లకు వైరస్ సోకకుండా ప్రభుత్వం వాక్సిన్లు పంపిణీ చేయాలని పెంపకందారులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వైరస్‌ల నివారణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సి ఉంది.