డాక్టర్ జీకేడీ ప్రసాదరావు
ఆంధ్ర విశ్వకళాపరిషత్ అవతరణలో మొదటి విభాగం తెలుగు భాషా, సాహిత్యాలు. ఆ తర్వాతే తత్త్వశాస్త్రం, అర్థశాస్త్రం మిగతా శాఖల ఏర్పాటు జరిగింది. అందుకే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వ్యవహారిక భాషోద్యమం గురించి ప్రస్తావన తీసుకురావలసి వచ్చింది. వ్యవస్థాపక ఉపకులపతి ‘కవిత్వతత్త్వవిచారం’ ఆధునిక శాస్త్రవిమర్శ పద్ధతిలో గ్రంథం రాశారు. తెలుగు భాషకు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వ్యవస్థాపనకు అవినాభావ సంబంధం వుంది. తెలుగు వ్యవహారిక భాషోద్యమం ఇక్కడ ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యాల నుంచి పుట్టుకొచ్చింది. ఈ ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు ప్రాచీన, ఆధునిక తెలుగు భాషల మీద పట్టుగల భాషాశాస్త్రవేత్త. ఈయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు. పుట్టుక శ్రీకాకుళం జిల్లా. తన భాషా ఉద్యమ కార్యక్రమాలన్నీ విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి నుంచి నిర్వహించారు. ప్రభుత్వ, న్యాయ వ్యవహారాల కోసం మద్రాసుకి ఎక్కువగా రాకపోకలు నిర్వహించేవారు. సవర జాతిని విద్యావంతుల్ని చేయడం కోసం ఆయన ఆ భాష నేర్చుకొని నిఘంటువు కూడా రాశారు. విద్యకు దూరంగా వున్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే గిడుగు రామ్మూర్తి పంతులు కాకినాడ సభలో వ్యవహారిక భాష లౌకిక భాష వంటిదని ప్రకటించారు. తెలుగు కావ్యాన్ని కూడా సంస్కృత పండితుల మెప్పుకోసం రాసే కవులను ఆయన నిరసించారు. ‘‘ఇక్కడి సామాన్య ప్రజానీకం మాట్లాడే భాషను పండితులు మాకు చెప్పడం లేదు.’’ అనే సి.పి.బ్రౌన్ మాటలను గిడుగు రామ్మూర్తి పదేపదే చెప్పారు. ‘‘ఊరి బయట చిన్నచిన్న గుడిసెలే కడజాతివాళ్ళ బడులు, అక్కడే వాళ్ళు అక్షరాలు నేర్చుకోవాలి. వారికి గ్రాంథిక రూపాలు నేర్పడంలో ఎంత కాలం వ్యర్థం చేస్తున్నారో నేను గమనించాను’’ అని 1906లో పరీక్షల పరిశీలన ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన యేట్స్ అన్నారు. ఆయన పరిశీలనలో అట్టడుగు ప్రజానీకానికి చదువును దూరం చేస్తున్న కుట్ర బయటపడిరది.
గురజాడ అప్పారావు 1892 లో రాసిన ‘కన్యాశుల్కం’ నాటకంతో తెలుగు సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. దీనితో పాటు తెలుగు భాషా, సాహిత్యాలను సంస్కరించారు. 1910 లో రాసిన ‘ముత్యాల సరాలు’ గేయకావ్యం, 1912 లో రాసిన ‘లవణరాజు కల’ కావ్యం తెలుగు సమాజానికి సంస్కరణ దృష్టి అలవాటు చేసింది. ఈ రచనలన్నీ ప్రజల భాషలోనే సాగాయి. ప్రజల్ని ఆధునికత వైపు ప్రభావితం చేశాయి. ఈ సాహిత్యం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలకు మద్దతుగా నిలిచాయి. దీనికి ఒక దశాబ్దం ముందే డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘‘ముసలమ్మ మరణం’’ 1900 లో అచ్చయింది. ఈ చంపూ కావ్యం తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది. సీపీ బ్రౌన్ రాసిన ‘అనంతపురం చరితము’ నుంచి ముసలమ్మ అనే ఒక గ్రామ మహిళ త్యాగమయ గాథను మూలంగా తీసుకున్నారు. ఈ కావ్యంలో ఆధునిక భావజాలంతో సంఘసంస్కరణ వస్తువుగా వుంది. ఆ తర్వాత పాతికేళ్లకు సి.ఆర్. రెడ్డిని మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌కు ఉపకులపతిగా నియమించింది. భాషా, సాహిత్య ఉద్యమాలకు ఆంధ్ర విశ్వద్యాలయం విజ్ఞాన వేదికగా అవతరించింది.
ఎ.వి.ఎన్. కళాశాల ప్రిన్సిపాల్ పి.టి. శ్రీనివాస అయ్యంగార్ సలహా మేరకు యేట్స్ గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులుతో చర్చించిన తర్వాత శిష్ట వ్యవహారికం అమల్లోకి వచ్చింది. యేట్సు అధ్యక్షతన పి.టి. శ్రీనివాస అయ్యంగార్ తెలుగు రిఫార్మ్ సొసైటీని స్థాపించారు. మద్రాసు స్కూల్ ఫైనల్ బోర్డు కార్యదర్శి 1912 సెప్టెంబర్ 21 న తొలిసారిగా వ్యవహారిక తెలుగులో పరీక్షలు రాసుకోవచ్చని ఆదేశించారు. గ్రాంథికవాదుల కుట్రతో ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. 1936లో సాహిత్య పరిషత్తు, తాపీ ధర్మారావు ‘జనవాణి’ పత్రికల్లోనూ వ్యవహారిక భాషను సమర్ధిస్తూ వ్యాసాలు ప్రచురించారు. భాషాపరంగా సమాజంలో వచ్చిన మార్పును, స్పృహను, సామాజిక చైతన్యాన్ని గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీగ్విన్ సంఘాన్ని నియమించింది. ఈ సంఘం శిష్ట వ్యవహారికంలో రచనలు సాగించడానికి ఒక ప్రభుత్వ అధీనసంస్థ అవసరమని భావించింది. పరిపాలన భాషగా వాడుకభాష వుండాలని ఆంధ్రప్రదేశ్ అధికార భాషాకమిషన్ పేర్కొంది.
భాషా ఉద్యమాలు సంఘసంస్కరణకు ఊతమిచ్చాయి. గిడుగు రామ్మూర్తి పంతులు నిర్వహించిన వ్యవహారిక భాషోద్యమాన్ని గురజాడ అప్పారావు సమర్ధించారు. ఆయన సాహిత్యంలో వాడిన భాష వ్యవహారిక భాషోద్యమ విజయానికి అండగా నిలబడిరది. అంటరానితనం నిషేధం, బాల్య వివాహాల నిర్మూలన, వితంతు పునర్వివాహాలు, వరకట్నం, కన్యాశుల్కం మొదలయిన సామాజిక దురాచారాలను నిర్మూలించే కార్యక్రమాలకు వ్యవహారిక భాషే సరైంది. అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు దోహదం చేసింది. సరిగ్గా వ్యవహారిక భాషోద్యమం వేడిగా సాగుతున్న సమయంలోనే ఇది జరిగింది. ఆ తర్వాత గిడుగు వేంకటరామ్మూర్తి పంతులకు 1938 లో కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేటును సైతం ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో 1955 లో తెలుగును అధికార భాషగా అమలు చేయాలని శాసనసభ తీర్మానించింది. వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పడిరది. తర్వాత ఈ సంఘం తెలుగు అకాడమి ఏర్పాటుకు సిఫార్సు చేసింది. దీనికి మొదటి అధ్యక్షునిగా పీవీ నరసింహారావు నియమితులయ్యారు. శాసన నిర్మాణంలో శిష్ట వ్యవహారిక భాష అవసరమని నిర్ణయించారు. విశ్వవిద్యాలయాల్లో దీనిపై శిక్షణ కార్యక్రమాలు జరగాలన్నారు.
పురిపండా అప్పలస్వామి వాడుక భాష అమలు గురించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అకడమిక్ కౌన్సిల్‌లో 11 జనవరి 1971 లో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలుగులో పిహెచ్.డి. కోసం సమర్పించే పరిశోధన వ్యాసాలు శిష్ట వ్యవహారికంలో రాసుకోవచ్చని తీర్మానించారు. అన్ని స్థాయిల్లో తెలుగు పరీక్ష పత్రాలకు సమాధానాలు వ్యవహారిక భాషలో రాయవచ్చని, అన్ని తరగతులకు పాఠ్య పుస్తకాలుగా వ్యవహారిక భాషలో వున్న గ్రంథాలు కూడా నిర్ణయించవచ్చని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు నాటి ప్రభుత్వం ఉపకులపతి ఎమ్మార్ అప్పారావు అధ్యక్షతన ఒక అధ్యయన సంఘాన్ని నియమించింది. ఈ సంఘం 1973 జూలై 5 న నివేదిక సమర్పిస్తూ, శిష్ట వ్యవహారిక భాష అమలుకు సిఫార్సు చేసింది. అటు శ్రీగ్విన్ కమిటీ, ఎమ్మార్ అప్పారావు కమిటీ రెండిరటి సిఫార్సుల ఫలితంగా తెలుగుభాషకు సంబంధించి ప్రామాణిక భాష శిష్ట వ్యవహారికం అన్నారు. దీనిని పురిపండా అప్పలస్వామి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అకడమిక్ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. నాటి విద్యా విషయక వ్యవహారాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్ణయాలు, అభిప్రాయాల కోసం ప్రభుత్వాలు ఎదురు చూసిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇతర సబ్జెక్టులకు సంబంధించి అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఉపాధి దృష్ట్యా పోస్ట్ గ్రాడ్యూయేట్ విద్యలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఇంగ్లీషు మాధ్యమాన్ని నిర్దేశిస్తూ నియమావళి విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేశాయి.
1975 లో అప్పటి ఉప కులపతి డాక్టర్ ఎం.ఆర్. అప్పారావు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ శిష్ట వ్యవహారిక భాష వాడకం మీద గల నిషేధాన్ని ఎత్తేశారు. ఎవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకోవచ్చని అనుమతించారు. సజీవ భాషతోనే విజ్ఞానం సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఇటువంటి నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయాలే శాసనాలుగా అవతరించి తెలుగు భాషా వికాసానికి తోడ్పాటు అందించాయి. మొదటి నుంచి భాషా, సాహిత్యాలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం పెనవేసుకుని పయనిస్తూనే వుంది. ఈలోపల తెలుగు అకాడమీ మూడు సంపుటాలుగా పరిపాలన పదకోశం విడుదల చేసింది. వీటి తయారీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా వెంట నడిచింది. యుజిసి సతీష్‌చందర్ కమిటీ సిఫార్సు మేరకు 1980 లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధన విధానాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దీనిలో వ్యవహారిక భాషలో సిద్ధాంత వ్యాసాల్ని సమర్పించుకోవచ్చని తీర్మానించారు. దీంతో తెలుగు భాష, సాహిత్యం, జానపద కళలను అధ్యయనం చేసి ఎంతోమంది పరిశోధక విద్యార్థులు వ్యవహారిక భాషలో సిద్ధాంత వాస్యాలు రాసి పిహెచ్.డి. డిగ్రీలు పొందారు. తెలుగు వాఙ్మయాన్ని సుసంపన్నం చేశారు. వ్యవహారిక భాష అమల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది.
తెలుగు వ్యవహారిక భాష ప్రజల భాషగా రాజ్యమేలుతుంది. అధికార భాషగా ప్రజలతోనే మమేకమై పోయింది. వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సినిమా, టీవీ మాధ్యమాలు వ్యవహారికంలో, మాండలికంలో వాడుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని భాషను జీర్ణం చేసుకుంది. నాడు వ్యవహారిక భాష అధికార భాషగా అమలు జరగడం కోసం గిడుగు రామ్మూర్తి పంతులు తన జీవితాన్ని అంకితం చేశారు. అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొదటిగా వ్యవహారిక భాష అమలు జరగాలని ఆయన పరితపించారు. కాని అది జరగలేదు. గిడుగు మరణం తర్వాత ఆయన ఉద్యమ త్యాగాన్ని గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవహారిక భాషను అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన త్యాగాన్ని భాషా, సాహిత్యవేత్తలు కూడా గుర్తించారు. అందుకే ఆయన పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు ప్రతి అడుగును విజయపథంవైపు ప్రోత్సహించి ఆంధ్ర విశ్వవిద్యాలయం కీర్తి వహించింది. నాడు భాషా, కవితా ఉద్యమాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయమే వేదికగా కొనసాగింది. విశాఖపట్నం సాహితీవేత్తల వేదికగా పేరొందింది. అభ్యుదయ కవిత్వోద్యమం, విప్లవ కవిత్వోద్యమం ఇక్కడే పుట్టాయి. ప్రజల భాషను గెలిపించడంలో, గిడుగువారి ఆశయాన్నే కాదు, గురజాడ ఆకాంక్షల్ని నెరవేర్చడంలోనూ ఆంధ్రవిశ్వవిద్యాలయం విశేషమైన కృషి చేసింది.
ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కాలంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఇక్కడ దేశీయ విద్యార్థులే గాక, 59 దేశాల విదేశీ విద్యార్థులు వేలల్లో చదువుతున్నారు. అరబ్బులు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు, పశ్చిమాసియా, ఇంకా చుట్టుపక్కల దేశాల విదేశీ విద్యార్థులు అందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఒక నమూనా ప్రపంచంగా వర్థిల్లుతోంది. నాటి వందల్లో విద్యార్థులు నేడు వేలల్లోకి పెరిగిపోయారు. నాటి మేధావుల కృషి ఈ రోజు ఎందరో మేధావుల్ని ప్రపంచమంతా విస్తరింపజేసింది. తెలుగు భాష విభాగంతో మొదలయిన ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు విదేశీ భాషలు, అన్ని సామాజికశాస్త్రాలు, అడ్వాన్డ్ సైన్స్‌స్, ఇంజనీరింగ్, డిజిటల్, కృత్రిమ మేధలతో పాటు సకల శాస్త్రాల్లో బోధన, పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా కీర్త పతాక ఎగురవేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు వందేళ్ల పండుగకు సిద్ధం కావడం ఎంతో ఆనందదాయకం.
ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్,
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
మొబైల్ : 9393111740