Friday, February 28, 2025
Homeవిశ్లేషణశ్రీశ్రీ కవితా వారసుడు కె.రా.

శ్రీశ్రీ కవితా వారసుడు కె.రా.

గోలి సీతారామయ్య

కమ్యూనిస్టు కవి కాగితాల రాజేశ్వరరావు (కె,రా.)ను తలచుకోవటమంటే 70 దశకపు ఉద్యమాల రోజులను తలచుకోవడమేనని చెప్పాలి. యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం (అరసం), ప్రజానాట్యమండలి వేదికలపైన, అప్పుడప్పుడు పార్టీ వేదికలపైన మహోగ్రరూపంతో, ఆవేశభరితంగా ఉపన్యాసాలిస్తున్న కాలం అది. పర్వతాలు విరిగిపడుతున్న చప్పుడు, శ్రీశ్రీ హోమజ్వాలల భుగభుగలు కె.రా. ఉపన్యాసాల్లో విన్న వాళ్లు, కళ్లారా చూసి ఆనందించినవాళ్లు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటుంటారు. కె.రా. ఒక ఆశ్చర్యం, ఒక ఆవేశం, ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతం. ఇల్లూ, వాకిలీలేని దిగువ మధ్యతరగతికి చెందినవాడికి ఇంత విప్లవం (విపరీతం) తగునా అని విస్తుబోయిన వాళ్లు వున్నారు. ఏదో హితవు చెప్పబోయిన వాళ్లకి విశాలాంధ్ర నా చిరునామా, పామీదత్‌ భవన్‌లోనే (అప్పట్లో సీపీఐ జిల్లా, నగర సమితి కార్యాలయం) మా నిత్య వ్యాపకమని అనేవాడు. వైయక్తికమైన ఆస్తిపాస్తుల గురించి ఎప్పుడూ పాకులాడ లేదు. విజయవాడ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన తండ్రి కాగితాల కృష్ణమూర్తి నుంచి సంక్రమించిన కమ్యూనిస్టు ఆశయానికి, ఆవేశం మేళవించిన ఒక రసభరితమైన ఆవిష్కరణ కె.రా. విజయవాడలో ప్రత్యేకించి ఏలూరు రోడ్డుపైన పార్టీ ప్రతి ఊరేగింపులో ఎర్రజెండాగా ఎగిరి, నినాదమై మోగినవాడు. న్యూ ఇండియా హోటల్‌ సెంటర్‌లో జరిగే బహిరంగ సభల్లో నినాదాలు ఇవ్వడంలో కె.రా. ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. గొంతులో స్పష్టమైన భాష, గంభీరమైన స్వరం వల్ల రాజేశ్వరరావు ప్రజానాట్యమండలి కళా ప్రదర్శనల్లో ముందుగా ప్రేక్షకుల్ని అలర్ట్‌ చేసే వ్యాఖ్యాతగా, నటుడుగా, రచయితగా మారిపోయాడు. ఇది ఇష్టపూర్వకంగా చేసిన ఒక సాంస్కృతికోద్యమ ప్రయాణం. ఇక సాహితీలోకంలో తనకంటూ ఒక పీట వేసుకు కూర్చున్నాడు. ఎన్నో మెరుపులు మెరిపించాడు. మిత్రులంతా ఆప్యాయంగా కె.రా. అని పిలుచుకునే కాగితాల రాజేశ్వరరావు విశాలాంధ్ర దినపత్రిక కేంద్రంగా తన కవితా ప్రస్థానం ప్రారంభించాడు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు. కె.రా. అంటే ఒక నిబద్ధత. ఒక అలుపులేని ప్రయాణం. పీడిత ప్రజల పక్షాన నిలిచి అగ్నిసుమమై వికసించిన వాడీ వేడి గల ఉత్తేజం.
1971లో మంగళాపురం, తాడేపల్లిగూడెంలో పార్టీ నిర్వహించిన రాజకీయ శిక్షణా శిబిరాల్లో కె.రా. పాల్గొనడమే గాక విశాలాంధ్ర దినపత్రిక సబ్‌ ఎడిటర్‌ గంజి వీరా, మల్నీడి సమత, అరుణోదయ ప్రింటింగ్‌ ప్రెస్‌ శానం శేషగిరి రావు (శేషు) తదితర మిత్రులతో అరుణోదయం నాటిక ప్రదర్శించాడు. పార్టీ ఈ కాలంలోనే సమరశీల ప్రజోద్యమాలు చేపట్టింది. అధిక ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సాగిన పోరాటంలో కె.రా. అరెస్టయి లాఠీదెబ్బలు తిని, నెల రోజులు జైలులో వున్నాడు. అప్పుడే ‘‘ఉక్కు కటకటాల వెనుక ఒక్కడినే మెలకువలో’’ అనే ప్రసిద్ధ గేయం రాశాడు. ఈ దశలోనే పెద్ద ఎత్తున భూపోరాటాలు, అరసం, ప్రజానాట్యమండలి పునర్‌ నిర్మాణాల కోలాహలం, వెంటనే విజయవాడ (1975)లో పార్టీ 10వ మహాసభలు అద్భుతమైన రీతిలో దిగ్విజయంగా జరిగాయి.
రాష్ట్రంలో ఈ మహాసభలు ఒక చరిత్ర సృష్టించాయి. వేలాదిమంది యువతీ యువకులు సమీకృతమయ్యారు. కడలి కెరటాల మాదిరి ఉత్సాహ సంద్రాన ఉప్పొంగి పోయారు. పార్టీకి సముచితమైన యువనేతలు కూడా ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నారు. సరిగ్గా ఈ సంరంభపు కాలంలో కె.రా. నాటికలు, పాటలు, గేయాలు రాశాడు. ‘నా పార్టీ’ అనే పేరుతో గేయ కావ్యం రాయాలని అప్పుడే అనుకున్నాడు. పార్టీ స్వర్ణోత్సవాల సందర్భంగా దాన్ని సంక్షిప్తంగా రాసి శ్రీకారం చుట్టాడు. అరసం తరఫున కవితా గోష్ఠులు నిర్వహించాడు. విజయవాడ ఏలూరు రోడ్డులో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ మేడపైన అరసం తరఫున జరిగే సాహిత్య సభల్లో అమెరికన్‌ కమ్యూనిస్టు ఏంజెలా డేవిస్‌ను (ఏంజెలా డేవిస్‌ స్త్రీల హక్కుల కోసం, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు. 1980, 1997ల్లో అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేశారు.) విడుదల చేయాలని కె.రా. నిప్పులు కురిపించే వాగ్ధాటితో మాట్లాడుతుంటే తొలి ఎర్రజెండా కవి తుమ్మల వెంకటరామయ్య విస్తుపోయి అభినందించారని ఆర్టిస్ట్‌ మోహన్‌ ‘‘రాజేశ్వరరావును కన్నకాలం గురించి’’ అనే వ్యాసంలో రాశాడు. మిలిటెంట్‌ అనే పత్రికను నడిపాడు. కృష్ణా జిల్లా అరసం ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పనిచేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మహాకవి శ్రీశ్రీ ఆశించిన ముందుయుగం దూతగా కె.రా. నిలిచాడు. తన రాజకీయ చైతన్యాన్ని, కవితాశక్తిని ఉద్దీపనం చేసుకున్నాడు. ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సుకు పరితపించాడు. తన కలం, గళం ద్వారా శ్రామికజన సమరాలకు నీరాజనం పట్టాడు. 1970వ దశకంలో కొత్త గొంతులు లేచాయి. శ్రీశ్రీ వారసులు కొంతమంది వచ్చారంటూ ఒకటే సందడి. నిజమే కాలం అలాంటి వారసుల్ని తీసుకువచ్చిన మాట వాస్తవమే. కాగితాల రాజేశ్వరరావు ఆ వరసలో ముందు భాగంలో ఉన్నమాట కూడా నిజమే. మార్క్సిజాన్ని శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి దారిచూపించే టార్చిలైట్‌గా చేశాడు. మార్క్సిజం తాత్విక పునాదిగా కష్ట జీవుల కోసం ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీని, దాని త్యాగాల నెత్తుటి జాలుల్ని కవిత్వమయం చేసినవాడు కె.రా. ఆయన గురించి తెలియని కొత్త తరం కవితాలోకంలోకి వచ్చేసింది. ఇంకో విషయం ఏమంటే కె.రా. బతికి వున్నప్పుడు తన కవిత్వాన్ని పుస్తక రూపంలో చూసుకోలేక పోయాడు. దీనివల్ల కె.రా. కవిత్వం సాహితీలోకానికి ఆలస్యంగా అందింది. దీనివల్ల కె.రా. గురించి తెలియనివారికి కొంత అతిశయోక్తి అనిపించినప్పటికీ, శ్రీశ్రీకి సముచిత కవితా వారసుడు కెరా అని చెప్పటానికి ‘‘నా పార్టీ’’ కావ్యం ఒక ప్రబలమైన ఉదాహరణ.
కవిత్వారంభం నుంచి సుప్రసిద్ధ కవి గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల ప్రభావంతో ఎదిగిన కె.రా. మాత్రాబద్ధ ఛందస్సులో కవిత్వాన్ని రాయడం అలవాటుగా చేసుకున్నాడు. శబ్దం, అర్థం జమిలిగా ఉండి అంత్యప్రాసలతో అలరారడం దీని నిజమైన సొగసు. చదివినవారి హృదయంలో కె.రా. కవిత్వం తిష్ట వేసుక్కూర్చుంటుంది. అందుకే కె.రా. కంటే ఆయన కవిత్వం చాలామంది మిత్రులకు గుర్తుండిపోయింది. కాలక్రమంలో తన స్థానాన్ని, తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న ప్రతిభావంతమైన కవనశీలి కె.రా.
1925 నుంచి జాతీయోద్యమంలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానం, సంస్థానాల రద్దు కొరకు సమరశీల పోరాటాలు, ఉత్తేజభరితమైన మహత్తర సంఘటనల్ని కెరా కావ్యమయం చేశాడు. త్రికరణ శుద్ధిగా నమ్మిన ఆశయాన్ని, పార్టీపై ఉన్న ఎనలేని ప్రేమను కె.రా. ఈ విధంగా వ్యక్తీకరించాడు. కె.రా. కవితా ప్రస్థానంలో ఇది ఒక మైలురాయి.
చిలీ దేశపు మహాకవి పాబ్లో నెరుడా కవితను ‘‘శిక్షించాలంటున్నా’’ పేరుతో 1972 లోనే కె.రా. తెలుగులోకి అనువదించాడు. దాన్ని మరలా ఆర్టిస్ట్‌ మోహన్‌ చొరవతో 2003లో పునఃముద్రణ జరిగింది. మోహన్‌ ముందుమాట రాసి బొమ్మలు వేశాడు. దీన్ని చూసిన ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు కె.రా. కవితాశక్తిని గుర్తించి ‘‘ఛందోతరంగవేది రాజేశ్వరరావు’’ అనే పేరుతో రాసిన ముందుమాటలో ‘‘ఇవి ఆయన కోరితే రాసినవి కావు. నా మనస్తృప్తి కోసం రాసినవి. చివరగా ఒక మాట చెప్పనా? ఆయన కవిత్వంలో ఆత్మదర్శనం చేసుకుంటున్నాను’’ అన్నారు. ఇది కె.రా.కు లభించిన మంచి గుర్తింపు. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా కె.రా. సాహితీ వ్యాసంగంలో కవిత్వానిదే పెద్దపీట. తన నవలలకు ప్రారంభంలోను, అధ్యాయాల దగ్గర కవితా పంక్తులతో ప్రారంభించటం చేసేవాడు. కె.రా. సృష్టించిన మొత్తం కవిత్వం అంతా ఒక ఎత్తయితే ‘‘నా పార్టీ’’ గేయం ఒక ఎత్తు. ఈ దీర్ఘకావ్యం కె.రా. ప్రాణమని చెప్పాలి. నా పార్టీ కావ్యం ఒక్కమాటలో చెప్పాలంటే ఉదాత్తమైన ఆశయం, ఉన్నతమైన ఉద్యమాచరణలకు ప్రశంసనీయమైన కవితాభిషేకం. కవిత్వాన్ని లక్ష్యశుద్ధితో ప్రేమించి, ఆరాధించి, సృజించడమే గాక, జీవితమే కవిత్వంగా బతికిన కమ్యూనిస్టు కవి రాజేశ్వరరావు.
అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
సెల్‌ : 99491 45650

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు