సోవియట్ విప్లవం తర్వాత మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు చాలా వచ్చాయి. కాని, రష్యన్ విప్లవానికి ముందే 1912లో ఉత్తర భారతదేశానికి చెందిన హరదయాళ్, కేరళకు చెందిన రామకృష్ణ పిళ్ళై మార్క్స్ జీవిత చరిత్రలు రాశారు. ఆ రెండు పుస్తకాలను ఇందులో ప్రచురించారు.
మార్క్సిస్టు మహామహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14న మరణించారు. మార్చి 17న లండన్‌లోని హైగేట్‌లో మార్క్స్ సమాధి దగ్గర ఆయన జీవన సహచరుడు ఏంగెల్స్ ప్రసంగిస్తూ ‘‘డార్విన్ ఏ విధంగా జీవ ప్రకృతి అభివృద్ధి నియమాన్ని కనుగొన్నారో సరిగ్గా అదే విధంగా మార్క్స్ మానవ చరిత్ర అభివృద్ధి నియమాన్ని కనుగొన్నారు. కారల్ మార్క్స్ పేరు యుగయుగాల వరకు సజీవంగా వుంటుంది. ఆయన కృషి చిరస్థాయిగా వుంటుంది ‘‘ అని చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మార్క్స్ 142వ వర్థంతికి ఒక వ్యాసం రాయాలని కార్ల్ మార్క్స్ పేరును బింగ్ సెర్చ్‌లో చూస్తే 1 కోటి 55 లక్షల ఫలితాలు వచ్చాయి. ఇతర ప్రముఖులకు అందనంత ఎత్తులో మార్క్స్ ఉన్నాడు. 141 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం అంతా చర్చిస్తున్న అత్యంత ప్రభావశీలిగా మార్క్స్ కొనసాగుతున్నాడు. ఈ వెతుకులాటలో మరో పుస్తకం కనిపించింది. ‘‘మార్క్స్ ఇండియాకు వచ్చారు’’ (వీaతీఞ షశీఎవం ్‌శీ Iఅసఱa ) అన్న పేరు ఆకర్షించింది. ఈ పుస్తకాన్ని 1975లో మనోహర్ బుక్ సర్వీసెస్ వారు ప్రచురించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పీసీ జోషి, కె దామోదరన్ సంయుక్తంగా సుదీర్ఘమైన ముందుమాట రాశారు. ఈ ముందుమాటలో రెండు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
మొదటిది: మార్క్స్ జీవించి వున్న కాలంలోనే ఆయనతో కలకత్తాకు చెందిన తొలి సోషలిస్టు భావజాలికులు నెలకొల్పుతున్న సంబంధాల ప్రస్తావన ఆశ్చర్య పరిచింది. మార్క్స్ సారథ్యంలో 1866లో ప్రారంభమైన ఇంటర్‌నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్‌లో భారతదేశపు విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించమని కోరుతూ ఈ కలకత్తా మిత్రులలో ఒకరు లేఖ పంపించారు. 1871 ఆగస్టు 15న జరిగిన ఇంటర్నేషనల్ జనరల్ కౌన్సిల్‌లో ఆ లేఖను చర్చించినట్లు మినిట్స్‌లో పేర్కొన్నారు. ఈ విభాగం ఏర్పాటుకు అనుమతిస్తూ, స్వయం పోషకంగా వుండాలని, స్థానికులను సభ్యులుగా చేసుకోవాలని సలహా ఇచ్చినట్లు మినిట్స్‌లో వున్న దానిని ముందుమాటలో ఉటంకించారు. అంతేకాదు 1871 ఆగస్టు 19న ‘ది ఈస్ట్రన్ పోస్టు నంబరు 151’లో ఇంటర్నేషనల్ జనరల్ కౌన్సిల్ సమావేశంపై ప్రచురించిన వార్తలో కలకత్తా నుంచి అందిన ఉత్తరంలోని కొన్ని భాగాలను ఉటంకిస్తూ వచ్చిన వార్తను యథాతథంగా మన ముందుంచారు. అధికారయుతంగా ఇంత సమాచారం దొరికినప్పటికీ కలకత్తా బృందం పేర్లు మాత్రం రికార్డులలో కనిపించలేదని ముందుమాటలో రాశారు.
రెండో అంశం : సోవియట్ విప్లవం తర్వాత మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు చాలా వచ్చాయి. కాని, రష్యన్ విప్లవానికి ముందే 1912లో ఉత్తర భారతదేశానికి చెందిన హరదయాళ్, కేరళకు చెందిన రామకృష్ణ పిళ్ళై మార్క్స్ జీవిత చరిత్రలు రాశారు. ఆ రెండు పుస్తకాలను ఇందులో ప్రచురించారు. మార్క్స్ జీవించి వున్న కాలంలో, రష్యన్ విప్లవం జరగడానికి ముందుగానే ఇలా మార్క్స్ భారతదేశానికి వచ్చిన అపురూపమైన విషయాలను ఈ పుస్తకం వెల్లడిస్తుంది. రష్యన్ విప్లవ ప్రభావం మన దేశంలో జరుగుతున్న జాతీయోద్యమం మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. మార్క్స్ భావజాలం, రష్యన్ విప్లవ ప్రభావంతో జాతీయోద్యమంలో భాగంగా 1920 లో కార్మిక వర్గాన్ని సంఘటిత పరిచే అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఏర్పడిరది. 1923 లోనే తొలి మేడేను మద్రాసులో సింగారవేలు చెట్టియార్ నిర్వహించి, ఎర్ర జెండాను మొదటిసారి ఎగురవేశారు. వివిధ ప్రాంతాల్లో వున్న కమ్యూనిస్టులు 1925 లో కమ్యూనిస్టు పార్టీగా సంఘటితం అయ్యారు. కార్మిక సంఘాలతోపాటు వివిధ ప్రజా సంఘాలను నిర్మించి జాతీయోద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని విస్తరింపజేశారు. గాంధీజీ స్వాతంత్య్రోద్యమానికి సారధిగా గుర్తింపు పొందినా ఈ ప్రజా సంఘాల ఉద్యమాల ఒత్తిడితోనే గాంధీజీ సహాయ నిరాకరణ నుంచి పూర్ణ స్వరాజ్యానికి, ఉప్పు సత్యాగ్రహం పేరుతో శాసనోల్లంఘనకీ అంతిమంగా ‘‘సాధించడం లేదా మరణించడం ‘‘ నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి పూనుకున్నారు. ఈ ప్రజా ఉద్యమాల వెనుక మార్క్స్ భావజాలం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే మార్క్స్ భారతదేశం మీద న్యూయార్క్ టైమ్స్‌కి అపురూపమైన వ్యాసాలు రాశారు. 1857 తిరుగుబాటును తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు దోచుకున్న సంపదను అణాపైసలతో లెక్కలు గట్టి ప్రకటించారు. స్వదేశీ ఉత్పత్తులను, చేతి వృత్తులను ఎలా నాశనం చేసింది బైట పెట్టారు. భారతీయ గ్రామీణ వ్యవస్థ ప్రత్యేకతలను, కులవ్యవస్థ పాత్రను విశ్లేషించే వ్యాసాలు రాశారు. అవి నేటికీ అపురూపమైన రచనలుగానే ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన క్రమంలో మార్క్స్ భావజాలం దేశ ప్రజలలో పొందిన విశేష ఆదరణకి తార్కాణంగా నిలుస్తుంది.
తెలుగు రాష్ట్రాలలో మార్క్స్ భావజాలం రాజకీయరంగాన్నే కాదు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక పరిణామాలను తెచ్చింది. 1990 వ దశకంలో మార్క్స్‌కు గ్రహణం పట్టినట్లు అనిపించింది. సోవియట్ యూనియన్, సోషలిస్టు దేశాలు కనుమరుగు కావడంతో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు మార్క్స్ భావజాలానికి కాలం చెల్లిందని ప్రకటించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ చిరస్థాయిగా వుంటుందని ప్రచారం చేశారు. ఈ ప్రచారం మూణ్ణాల ముచ్చటే అయింది. 2008 నుంచి పెట్టుబడిదారీ దేశాలు ఒక దాని తర్వాత మరొకటి చివరికి అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఉద్దీపనల చిట్కాలు వాటిని గట్టెక్కించలేకపోతున్నాయి. దాంతో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు బుర్రలు గోక్కుంటున్నారు. పెట్టుబడి చలన సూత్రాల కోసం మార్క్స్ రచనలే శరణ్యం అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా మార్క్స్ రచనల అధ్యయనం విస్తారంగా పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద కేంద్రీకరణ అనివార్యం అని అదే స్థాయిలో పేదరికం, దారిద్య్రం మరొక చోట పేరుకుపోతుందని మార్క్స్ చేసిన విశ్లేషణ నేటి అంతరాల ప్రపంచం తిరుగులేని వాస్తవంగా నిరూపిస్తున్నది. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాలు పైబడిన మోదీ పాలనను పరిశీలన చేసుకోవాలి.
మోదీ పాలనలో ప్రపంచంలోనే అత్యధికంగా అంతరాలు పెరిగిన దేశంగా భారత్ మారింది. 2013 నాటికి 50 మంది బిలియనీర్లు అంటే 100 కోట్లకు పైబడిన డాలర్ల సంపద గల వారు లేదా 8000 కోట్ల రూపాయలకు పైబడిన సంపదగల వారు వుంటే 2024 నాటికి 169 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ప్రపంచ బిలియనీర్లలో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి దూసుకు పోయింది. ఈ 169 మంది బిలియనీర్ల దగ్గరే 78 లక్షల కోట్ల సంపద పోగుపడిరది. ఆక్స్ ఫామ్ నివేదికల ప్రకారం దేశంలో 1 శాతం మంది దగ్గర 46 శాతం దేశ సంపద పోగుపడగా 10 శాతంగా వున్న బిలియనీర్లు, కార్పొరేట్లు, కుబేరుల దగ్గర మొత్తం దేశ సంపదలో 77 శాతం గుట్టపడిరది. ఒక దశాబ్ద కాలంలోనే విపరీతంగా దేశంలో సంపద కేంద్రీకరణ జరిగింది. స్థూలంగా 10 ఏళ్ల మోదీ పాలన ప్రధానంగా కార్పొరేట్ల కోసం సాగిన పాలన. దాని పర్యవసానంగానే దేశ సంపద వారి పంచకు చేరింది. ఈ 10 ఏళ్లలో 35 శాతం గావున్న కార్పొరేట్ పన్నును అంచెలంచెలుగా 22 శాతానికి తగ్గించారు. వారికే దాదాపు 20 లక్షల కోట్ల అప్పులను రద్దు చేశారు. గతంలో 10 శాతం వున్న వారసత్వ పన్నును పూర్తిగా తొలగించారు. ఇది మోదీ పాలన సంగ్రహ చిత్రం.
దేశ సంపదను కార్పొరేట్లు స్వంతం చేసుకుంటూ పోతున్నారు. మరో పక్క రైతులు , సామాన్యులు , పేదలు కార్పొరేట్ల అనుకూల పాలనలో నలిగి పోతున్నారు. 10 శాతంగా వున్న కార్పొరేట్ల దోపిడీకి- 75 శాతం నలిగి పోతున్న దేశ ప్రజలకీ మధ్య నెలకొన్న వైరుధ్యమే ప్రస్తుత ప్రధాన వైరుధ్యంగా గుర్తించాలి. మార్క్స్ ఏనాడో చెప్పిన సంపద కేంద్రీకరణ దాని పర్యవసానాలు ఇప్పుడు మోదీ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కార్పొరేట్ల దోపిడీని కట్టడి చెయ్యడానికి, శ్రమజీవుల సంక్షేమ విస్తరణకి పోగుపడ్డ సంపద పునఃపంపిణీ తక్షణ అవసరం అయ్యింది. ఈ దిశగా అన్ని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రజలను సమీకరించే ఉద్యమాలకు సన్నద్ధం కావాలి. మోదీ పాలనాపరంగా బలహీనుడే, ప్రజల మీద భారాలు మోపే సాధారణ రాజకీయ నాయకుడే, కార్పొరేట్ దోపిడీకి ద్వారాలు తెరిచేవాడే. ఆయన ప్రజాకర్షణ ఆయన అనుసరిస్తున్న రాజకీయవిధానాలలో లేదు. విభజన రాజకీయంలో విద్వేష భావజాలం లో వుంది. దానిని తన ఆకర్షణగా మార్చుకునే పరిభాషలో వుంది. అందువల్ల మోదీ రాజకీయం మీదచేసే పోరాటం కేవలం ఆర్థిక అంశాల మీద చేస్తేసరిపోదు. మోదీ రాజకీయం మీద పోరు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటా జరగాలి. ఇందులో సాంస్కృతిక రంగంలో జరిగే పోరాటం కీలకం అవుతుంది. అలాంటి బహుముఖ పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు మార్క్స్ భావజాలమే మనకు దారి చూపిస్తుంది. సమ సమాజ సాధనకు ఆయనే దిక్సూచి.
దారి దీపం సంపాదకులు, 8500678977