Sunday, February 23, 2025
Homeవిశ్లేషణసాయుధ పోరాట సేనానులు -12

సాయుధ పోరాట సేనానులు -12

ఆర్వీ రామారావ్‌

గొప్ప పోరాట స్ఫూర్తి, సమకాలీన సామాజిక పరిస్థితులపై అవగాహనఉంటే కొద్ది మంది అయినా తమ వర్గ స్వభావాన్ని విడనాడగలుగుతారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో భూస్వాముల కుటుంబాల్లో పుట్టిన చాలా మంది తమ భూములను పేదలకు పంచేసి తుపాకీ పట్టుకుని సాయుధ రైతాంగ పోరులో భాగస్వాములయ్యారు. మల్లు స్వరాజ్యం అలాంటి వారే. దాదాపు ఆమె కుటుంబం అంతా సాయుధ పోరాటంలో పాల్గొన్న వారే. ఆమె తండ్రి ఆమెకు సామ్రాజ్యం అని పేరు పెట్టాలనుకుంటే తల్లి చొక్కమ్మ స్వరాజ్యం అని పేరు పెట్టారు. నిజంగానే నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కల్పించిన వారిలో భాగస్వామి అయి స్వరాజ్యం తన తల్లి పెట్టిన పేరును సార్థకం చేశారు.
ప్రజలను సమీకరించడం, గడీలోని దొరల మీద తిరుగుబాటు చేయడం, పేదలకు ధాన్యం పంచి పెట్టడంతో ఆమె ఇంటిని పోలీసులు తగులబెట్టారు. సాయుధ పోరాట కాలంలో ఆమెను పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆమెపేరు చెప్తేనే పోలీసులకు హడల్‌. ఆమె వడిశెలతిప్పి రాయి విసిరితే పోలీసులు పరారయ్యేవారు. మల్లు స్వరాజ్యం పుట్టింది 500 ఎకరాలున్న మోతుబరుల ఇంట్లోనే. కానీ తన అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి అడుగు జాడల్లో ఆమె 16వ ఏటనే సాయుధ పొరాటంలో భాగస్వామి అయ్యారు. ఆమె భర్త మల్లు వెంకట నరసింహారెడ్డి కూడా సాయుధ పోరాటంలో భాగస్వామే. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రజలను చైతన్య పరచడానికి స్వరాజ్యం చేసిన కృషి అపారమైంది. ఆమె గేయాలు పాడి ప్రజలను ఆకట్టుకున ేవారు. ఆమె తల్లి చొక్కమ్మ స్వయంగా పోరాటంలోకి దిగినా తన పిల్లలను ప్రోత్సహించారు. మహిళలను చైతన్యవంతం చేయడానికి స్వరాజ్యం చేసిన కృషి స్ఫూర్తి దాయకం అయింది. ముదిమి వయసులో కూడా ఆమె యువతను మీకు పోరాడే శక్తి ఉందా అని ప్రశ్నించేవారు. సాంస్కృతిక రంగంలోనూ ఆమె కృషి ఎన్నదగింది. స్వయంగా పాడేవారు. పాటలు కట్టేవారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఆమె 1978లో శాసనసభకు ఎన్నికయ్యారు. మళ్లీ ఆమె 1983లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మల్లు స్వరాజ్యం పేల్చిన తూటాలు నిజాం బలగాలను, రజాకార్లను భయకంపితం చేస్తే ఆమె మాటలు, ప్రసంగాలు ప్రజలను కదిలించేవి. భూమికోసం పోరాటం, మద్యపాన నిషేధ ఉద్యమం, మహిళా విముక్తి పోరాటం- వెరసి సకల పోరాటాల్లోనూ స్వరాజ్యం చూపిన ధైర్య సాహసాలు నిరుపమాన మైనవి. సాయుధ రైతు ఉద్యమ సమయంలో తాను పేల్చిన బుల్లెట్ల మాదిరిగానే పాలక వర్గాన్ని తీవ్రంగా, కచ్చితంగా తాకిన శక్తిమంతమైన వక్త అయిన కామ్రేడ్‌ స్వరాజ్యం ప్రజల హృదయాలను కూడా కదిలించి, వారి హక్కుల కోసం పోరాడటానికి వారిని సమీకరించగలదు. భూమి కోసం పోరాటం, మద్యపాన నిషేధం లేదా మహిళా విముక్తి కోసం పోరాటం ఏదైనా, ఆమె ప్రజలను కార్యాచరణకు ప్రేరేపించింది. ఆమె బోధించిన విలువలకు సజీవ ఉదాహరణగా నిలిచారు.
మంచం పట్టినప్పుడు కూడా, ఆమె సీపీఐ(ఎం) మహిళా సంఘం కార్యాలయంలోనే ఉండడానికి ఇష్టపడ్డారు. మహిళా కార్యకర్తలతో తన చివరి రోజులను గడిపారు. తన తల్లి నుంచి అలవడిన మానవతా విలువలతో పెరిగిన స్వరాజ్యం చిన్నప్పటి నుంచీ పేదలతో కలిసిపోయి బాల్య వివాహాలు, కుల వివక్ష వంటి భూస్వామ్య, తిరోగమన సంప్రదా యాలను వ్యతిరేకించారు. కమ్యూనిస్ట్టుపార్టీ ఇచ్చిన పిలుపుమేరకు స్వరాజ్యం పోరాటంలోచేరి పోలీసులకు దొరకకుండా మారుపేర్లతో ప్రజల మధ్యకు వెళ్లి ఉద్యమాన్ని నిర్వహించారు. ఆమె సమ్మక్కగా గిరిజనుల మధ్యకు వెళ్లారు. రాజక్క ఆమె మరో పేరు. ‘రాజక్క దళం’ అనే మహిళా విప్లవకారుల బృందానికి నాయకత్వం వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు