తక్షణం విడుదల చేయాలని డిమాండ్
జంతర్‌మంతర్ భారత ప్రజలది: రాహుల్
ప్రజాగ్రహానికి భయపడే నిరసనలపై ఆంక్షలు: డి.రాజా
న్యూఢిల్లీ: దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోశ్ రాంకాలను ఐదు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. జాతీయ జెండాను ప్రదర్శించినందుకు యువతను జైలుకు పంపడమేంటని… వారిని తక్షణమే విడుదల చేయాలని ప్రతిపక్షనాయకులు డిమాండ్ చేశారు. నిరసన తెలిపే హక్కును హరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. జంతర్‌మంతర్ దేశ ప్రజలదని, దాన్ని తిరిగి సాధించుకుం టామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతూ త్రివర’ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘ఇలా చేసినందుకు యువతను జైలుకు పంపడం పిరికిపంద చర్యగా అభి వర్ణించారు. విద్యార్థులు, యువత, జర్నలి స్టులు, ఇండియా కూటమి వేర్వేరు వేదిక లపై ఉన్నప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటే. రాజ్యాంగం కల్పించిన హక్కులను కోరుతూ పౌరులు చేస్తున్న ఆందోళనలన్నీ ఒకే పోరాటంలో భాగం. జంతర్‌మంతర్ భారత ప్రజలకు చెందినది. దాన్ని తిరిగి సాధించుకుంటాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్ గాంధీ తెలిపారు. నిరసనలకు కేటాయించిన ప్రాంతంగా జం తర్మంతర్కు ఉన్న గుర్తింపును తొలగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న అనంతరం ఈ అరెస్టులు జరిగాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ… సీజేపీ నేతలు దాస్, రాంకాను అక్రమంగా నిర్బంధించడమే కాక న్యాయ కస్టడీకి పంపడాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ఇటీవలి వరకు నిరసనలకు అధికారికంగా కేటాయించిన ప్రదేశంలోకి ప్రవేశించారనే ఆరోపణతో వారిని జైలుకు పంపడం వేధింపులకు పాల్పడటమేనని పేర్కొన్నారు. ప్రజాగ్రహానికి భయపడి ప్రభుత్వం నిరసనలను అణచివేయాలని, భిన్నాభిప్రాయాలను వినిపించేవారి గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. అప్రజాస్వామిక ఆదేశాన్ని వ్యతిరేకించడం ఎప్పటి నుంచి నేరమైందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్ గుర్తింపు తొలగింపు నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని రాజా స్పష్టం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఇప్పటికే నిరసన స్థలాన్ని తిరిగి సాధించేందుకు ప్రదర్శన నిర్వహించాయని తెలిపారు. అక్కడ ఆందోళనలు చేపట్టే హక్కును పునరుద్ధరించే వరకు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందా? భట్టాచార్య
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ… జంతర్‌మంతర్‌ను నిరసన స్థలంగా గుర్తింపు నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ దాస్, రాంకా, వారి సహచరుడు అజింక్య షిండే అక్కడికి వెళ్లారని తెలిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… అక్రమంగా ప్రవేశించడం, ఆదేశాలను ధిక్కరించడం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసి న్యాయ నిర్బంధానికి తరలించారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే వారిని శిక్షిస్తున్నారని విమర్శించారు. ఆందోళనలను చూసి ప్రభుత్వం భయపడుతోందని, రాజ్యాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘జంతర్‌మంతర్ ప్రజలది. దిల్లీలో నిరసనలు తెలిపేందుకు అత్యంత సుపరిచితమైన ప్రదేశంగా అది ప్రపంచమంతటికీ తెలుసు’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. నిరసన స్థలానికి గుర్తింపు తొలగించడం, ఆ తర్వాత కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం వెనుక ఆందోళనల పట్ల ప్రభుత్వ భయమే కారణమని విమర్శించారు.
మన జెండా ఎగరేయడం నేరమా: కేజ్రీవాల్, ఆదిత్య ఠాక్రే
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సీజేపీ కార్యకర్తలపై చర్యలను తప్పుబట్టారు. సొంత దేశంలో జాతీయ జెండాను ప్రదర్శించడం నేరమా? అని ప్రశ్నించారు. పోలీసుల చర్య పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కూడా సీజేపీ కార్యకర్తల అరెస్టును ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. జంతర్‌మంతర్ వద్ద త్రివర’ పతాకాన్ని ప్రదర్శించిన యువతను జైలుకు పంపడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని తిరిగి సాధించుకునే వరకు ప్రభుత్వానికి, దేశభక్తులైన యువతకు మధ్య పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.
జంతర్‌మంతర్‌లోకి వెళ్లడమే నేరమా: మనోజ్ ఝ²
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝ² కూడా పోలీసుల చర్యను ఖండించారు. కార్యకర్తలపై మోపిన అభియోగాలపై ప్రశ్నించారు. ‘అసలు నేరం ఏమిటి? జంతర్‌మంతర్‌కు వెళ్లడమేనా? సీజేపీ నేతల అరెస్టు తీవ్ర విచారకరం’ అని పీటీఐకి వెల్లడించారు. జంతర్‌మంతర్ భారత ప్రజలకు చెందినదని, నిరసన తెలిపే హక్కును అధికారులు గౌరవించాలని కోరారు.
రాజ్యాంగ హక్కుల హననం: మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా సీజేపీ నేతల అరెస్టులను తప్పుబట్టారు. జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపేందుకు వెళ్లడాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. “ఇది నేరపూరిత చర్య కాబోదు. సుప్రీంకోర్టు ఇంకా మౌనంగా ఉంటే.. రాజ్యాంగ హత్యలో అది కూడా భాగస్వామి అయినట్లే. అంతే” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.


