Sunday, April 20, 2025
Homeవిశ్లేషణసీపీఐ ` క్విట్‌ ఇండియా ఉద్యమం

సీపీఐ ` క్విట్‌ ఇండియా ఉద్యమం

ఆర్వీ రామారావ్‌
మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగింది మాత్రమే జాతీయోద్యమం కాదు. అది ప్రధాన స్రవంతి అన్నది వాస్తవం. అనేక ఇతర పోరాటాలూ ఉన్నాయి. వలసవాద పోరాటంలో గాంధీ-నెహ్రూ వారసత్వం నిస్సందేహంగా బలమైందే. సుభాశ్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటం, రాయల్‌ ఇండియన్‌ నేవీ ఉద్యమమూ గణనీయమైనవే. రెండవ ప్రపంచ యుద్ధం తరవాత మన దేశంలో వలసవాద పాలన కొనసాగించడం అసాధ్యమై పోయింది. కమ్యూనిస్టు పార్టీ, ఇతర కమ్యూనిస్టు బృందాలు సాగించిన పోరాటమూ ప్రబలమైందే. కమ్యూనిస్టు పార్టీ పత్రాలలో సీపీఐ పాత్ర నిక్షిప్తమై ఉంది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ పాల్గొనలేదని వాదించే వారూ ఉన్నారు. ఈ మాట చెప్పే వారు కమ్యూనిస్టు పార్టీ పాత్రను, స్వాతంత్య్రోద్యమంలో ఏ పాత్ర లేని ఆర్‌.ఎస్‌.ఎస్‌, హిందూ మహాసభను, సీపీఐని ఒకే గాటన కట్టేవారికీ కొదవలేదు.
క్విట్‌ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ పాల్గొనక పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ముందు కమ్యూనిస్టు పార్టీ వలసవాద వ్యతిరేక ఉద్యమాన్ని చాలా బలంగానే నిర్వహించింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌., హిందూ మహాసభకు ఇలాంటి చరిత్ర లేదు. 1920ల నుంచే అంటే సీపీఐ ఏర్పడక ముందే కమ్యూనిస్టులు స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. 1922-1927 మధ్య మోపిన పెషావర్‌ కుట్ర కేసు, 1924-1925 నాటి కాన్పూర్‌ కుట్రకేసు, 1929-1933 మధ్య సాగిన మీరట్‌ కుట్రకేసులో నిందితులందరూ కమ్యూనిస్టులే. వ్యవస్థాపరంగా సీపీఐ ఏర్పడడానికి ముందు కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్న వారు సమరశీలంగా పోరాడారు. ఈ పోరాటాల్లో షౌకత్‌ ఉస్మానీ, ఎస్‌.ఎ.డాంగే, ముజఫ్ఫర్‌ అహమద్‌, సోహాన్‌ సింగ్‌ జోష్‌, పి.సి.జోషి, ఫిలిప్‌ స్ప్రాట్‌ లాంటి వారి పాత్ర అద్వితీయమైంది. వీరి మీద భారత శిక్షాస్మృతిలోని 121 ఎ ప్రకారం దేశ ద్రోహం కేసులు కూడా మోపారు.
స్వయం నిర్ణయాధికారంతో కాంగ్రెస్‌ సంతృప్తి పడ్తున్న రోజుల్లోనే కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం ఇచ్చారు. 1921లో అహమదాబాద్‌ లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో మౌలానా హస్రత్‌ మోహానీ సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం ఇచ్చారు. ఒక తీర్మానం కూడా ప్రతిపాదించారు. 1925లో సీపీఐ వ్యవస్థా రూపం సంతరించుకున్నప్పటి నుంచీ సంపూర్ణ స్వాతంత్య్రం కోసమే నినదిస్తూ వచ్చింది. అందుకే సీపీఐ మీద నిషేధం విధించారు. 1927లో బొంబాయిలో ఆమోదించిన నూతన నిబంధనావళిలో కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ స్వాతంత్య్రం కోసమే పిలుపు ఇచ్చింది. దానితో పాటు వయోజనులందరికీ ఓటు హక్కు, భూస్వామ్య వ్వవస్థ రద్దు, ప్రజా వ్యవస్థల జాతీయకరణ లాంటి అంశాలను సీపీఐ లేవనెత్తింది. 1931లో సీపీఐ బ్రిటిష్‌ కర్మాగారాలను, బ్యాంకులను, జల మార్గాలను, రైల్వే, సముద్ర మార్గాలను జాతీయం చేయాలని గట్టిగా కోరింది. రైతుల రుణాలన్నింటినీ రద్దు చేయాలన్నదీ సీపీఐ ప్రధాన నినాదంగానే ఉంది. కార్మికుల వేతనాలు పెంచాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, సమాన పనికి స్త్రీ పురుషులకు సమాన వేతనం ఉండాలని కూడా సీపీఐ పోరాడిరది. ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగానే సీపీఐ కార్మిక సంఘాలను, రైతు సంఘాలను, మహిళా సంఘాలను, విద్యార్థి సంఘాలను, కళాకారుల-రచయితల సంఘాలను నెలకొల్పి ఉద్యమ పరిధిని విస్తృతం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలు కాగానే యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహించింది కూడా కమ్యూనిస్ట్‌ పార్టీయే. ఈ ప్రదర్శనల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలకు సుభాశ్‌ చంద్ర బోస్‌ మద్దతు ఇచ్చారు.
జర్మనీ సోవియట్‌ యూనియన్‌ మీద దాడి చేసిన తరవాత రెండో ప్రపంచ యుద్ధంపై సీపీఐ వైఖరి మారింది. ఫాసిస్టు వ్యతిరేక శక్తులను సమైక్య పరిచి పోరాడాలని నిర్ణయించింది. ఈ కారణంగానే సీపీఐ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదన్న అభిప్రాయం బలపడిరది. కానీ సత్వరం స్వాతంత్య్రం ప్రకటించాలని కోరుతూ సీపీఐ రైతులను, కార్మికులను సంఘటితం చేసింది. సీపీఐ ఆవిర్భవించిన నాటి నుంచే సంపుర్ణ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ వచ్చింది. ఇదే తమ అంతిమ లక్ష్యం అని భావించింది. కాంగ్రెస్‌ సంపూర్ణ స్వాత్య్రం అడగడానికి దాదాపు దశాబ్దం ముందు నుంచే సీపీఐ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం నినదిస్తూనే ఉంది. బ్రిటిష్‌ వారిని ప్రథమ శత్రువుగా భావించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం కొనసాగుతున్న సమయంలో సీపీఐ దేశ వ్యాప్తంగా రైతులను, కార్మికులను సమీకరించడంలో నిమగ్నమైంది. సీపీఐ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి కారణాలను ఈ నేపథ్యంలో చూస్తే భిన్న వైఖరి అనుసరించడానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగం కావాలని సీపీఐ భావించింది. దీనిలో భాగంగా రాజీ లేని పోరాటం చేసింది. అందుకే ఒక వైపు ప్రపంచ యుద్ధం సాగుతున్నా సీపీఐ వివిధ వర్గాల వారిని సమీకరించగలిగింది. మొదట్లో సీపీఐ క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగమైనా తరవాత ఆ ఉద్యమం హింసా మార్గం పట్టినందువల్ల ఆ ఉద్యమానికి దూరంగా ఉండిపోయింది. నాజీ శక్తులు సోవియట్‌ మీద దాడి చేస్తున్న సమయంలో క్విట్‌ ఇండియా ఉద్యమం అనడం అదును కానప్పుడు ఉద్యమించడం అని సీపీఐ భావించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో సీపీఐ పాల్గొన లేదని నిందించే వారు జపాన్‌ సేనలు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న వాస్తవాన్ని గుర్తించలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు