Friday, April 4, 2025
Homeవిశ్లేషణసీపీఐ బాట పట్టిన భగత్‌ సింగ్‌ సహచరులు

సీపీఐ బాట పట్టిన భగత్‌ సింగ్‌ సహచరులు

ఆర్వీ రామారావ్‌

భగత్‌ సింగ్‌, సుఖ్‌ దేవ్‌, రాజ్‌ గురును 1931 మార్చి 23న ఉరి తీసిన తరవాత దేశంలో వామపక్ష భావాలు పుంజుకోవడం మొదలయ్యాయి. భగత్‌ సింగ్‌ను ఆయన సహచరులను ఉరి తీసిన తరవాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భగత్‌ సింగ్‌ తదితరులను ఉరి తీయడానికి ముందే ప్రాణ త్యాగం చేసిన వారు అనేక మంది ఉన్నారు. జతీంద్ర నాథ్‌ దాస్‌ బెంగాల్‌కు చెందిన విప్లవకారుడు. ఆయన హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌ సభ్యులుగా ఉండేవారు. 1904లో కలకత్తాలో జన్మించిన జతీంద్రనాథ్‌ దాస్‌ చాలా తెలివైన విద్యార్థి. ఆయనలో స్వాతంత్య్ర కాంక్ష అపారమైంది. పదిహేడవ ఏటనే గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.
1925లో ఆయన కలకత్తాలోని బంగబాసి కళాశాలలో చదువుతున్నప్పుడు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటు న్నాడన్న నెపంతో ఆయనను మైమెన్‌ సింగ్‌ జైలులో నిర్బంధిం చారు. రాజకీయ ఖైదీలను సవ్యంగా చూడనందుకు ఆయన జైలులోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. 20 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన తరవాత జైల్‌ సూపరింటెండెంట్‌ క్షమాపణ చెప్పడంతో జతిన్‌ దాస్‌ దీక్ష విరమించారు. సచీంద్ర నాథ్‌ సన్యాల్‌ ఆయనకు బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పారు. 1929 జూన్‌ 14న విప్లవ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడన్న ఆరోపణపై జతిన్‌ దాస్‌ను మళ్లీ అరెస్టు చేశారు. భగత్‌ సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌ జాతీయ అసెంబ్లీపై విసిరిన బాంబు ఇదేనంటారు. లాహోర్‌ జైలులో ఉండగా యూరప్‌ ఖైదీలతో సమానంగా చూడాలని కోరుతూ జతిన్‌ దాస్‌ మళ్లీ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ రోజుల్లో భారత ఖైదీల పరిస్థితి ఘోరంగా ఉండేది. ఖైదీల వస్త్రాలను అనేక రోజుల పాటు ఉతకకుండా ఉంచేసే వారు. వంటశాలలో ఎలకలు, బొద్దింకలు విచ్చలవిడిగా తిరిగేవి. ఆ పరిస్థితిలో ఖైదీలు తిండి తినాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఖైదీలకు వార్తా పత్రికలు ఇచ్చేవారుకాదు. రాసుకోవడానికి తెల్ల కాగితాలు కూడా ఇచ్చే వారు కాదు. బ్రిటిష్‌ ఖైదీలకు మాత్రం సకల సదుపాయాలూ ఉండేవి.
ఈ వివక్షకు నిరసనగా జతిన్‌ దాస్‌ 1929 జులై 13న నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆ నిరాహార దీక్ష 63 రోజులపాటు కొనసాగింది. జైలు అధికారులు ఆయనకు బలవంతంగా ఆహారం ఇవ్వడానికి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు ఆయనను బేషరతుగా విడుదల చేయాలని సిఫార్సు చేశారు. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు జతిన్‌ దాస్‌ 1929 సెప్టెంబర్‌ 13న ప్రాణాలు విడిచాడు. ఆయన మృతదేహాన్ని లాహోర్‌ నుంచి కలకత్తా దాకా రైలులో తీసుకెళ్లారు. వేలాది మంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. కలకత్తాలో ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న జనం రెండు కిలోమీటర్ల పొడవున కనిపించారు. హౌరా రైల్వే స్టేషన్‌లో సుభాస్‌ చంద్రబోస్‌ ఆయన మృత దేహాన్ని స్వీకరించారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర సాగింది. జతిన్‌ దాస్‌ మరణించిన నాటికి భగత్‌ సింగ్‌, బటుకేశ్వర దత్‌ జైలులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. జతిన్‌ దాస్‌కు నివాళులు అర్పించని నాయకుడు లేడంటే ఆశ్చర్యం లేదు. జతిన్‌ విషయంలో బ్రిటిష్‌ వారి క్రూర వ్యవహారానికి నిరసనగా మహమ్మద్‌ ఆలం, గోపీ చంద్‌ భార్గవ పంజాబ్‌ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జాతీయ అసెంబ్లీ సమావేశా లను వాయిదా వేయాలని మోతీ లాల్‌ నెహ్రూ పట్టుబట్టారు. ఆయన ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానం ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో నెగ్గింది. మోతీ లాల్‌ నెహ్రూ తీర్మానానికి అనుకూలంగా 55 మంది ఓటు వేస్తే 47 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ‘‘సుదీర్ఘమైన మృతవీరుల జాబితాలో మరో పేరు చేరింది. శిరసు వంచి మృత వీరులకు శ్రద్ధాంజలి ఘటించి పోరాటం కొనసాగిద్దాం. ఎంత కాలమైనా పోరాడదాం. అంతిమంగా విజయం మనదే’’ అని జవహర్‌ లాల్‌ నెహ్రూ వ్యాఖ్యానించారు. ‘‘జతిన్‌ దాస్‌ దధీచి లాంటి వాడు అని సుభాస్‌ చంద్ర బోస్‌ అన్నారు. పౌరాణిక గాథ ప్రకారం ఒక రాక్షసుడిని వధించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.అదే సమయంలో బెంగాల్‌లో సూర్యసేన్‌ నాయకత్వంలో మరో ఘటన జరిగింది. ఆయన ఉపాధ్యాయుడు. చిట్టగాంగ్‌ ఆయుధాగారం మీద దాడిచేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వారిలో సూర్య సేన్‌ ప్రముఖులు. కొన్నాళ్ల పాటు ఆయన ‘‘స్వతంత్ర రాజ్యం’’ కూడా స్థాపించారు. బ్రిటిష్‌ పాలన డొల్లతనాన్ని ఎండగట్టడానికి ఈ పని చేశామని సూర్య సేన్‌ చెప్పారు.
1930 ఏప్రిల్‌ 18న గణేశ్‌ ఘోష్‌ నేతృత్వంలో యువ విప్లవకారులు చిట్టగాంగ్‌ పోలీసు స్థేషన్‌లోని ఆయుధాగారం మీద దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
జలాలాబాద్‌ అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ విప్లవకారులు పని చేశారు. స్థానిక ప్రజలు వీరిని మూడేళ్లు కాపాడారు. వందలాది మంది బ్రిటిష్‌ సైనికులు చిట్టగాంగ్‌ ప్రాంతాన్ని చుట్టు ముట్టి తిరుగుబాటును అణచివేశారు. వీరిలో చాలా మందిని బ్రిటిష్‌ ప్రభుత్వం 1933 ఫిబ్రవరి 16 న అరెస్టు చేసి 1934 జనవరి 12న ఉరి తీసింది. అనేక మందికి ద్వీపాంతరవాస శిక్ష వేసింది. ఆ తిరుగుబాటులో పాల్గొన్న చాలా మంది తరవాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. భగత్‌ సింగ్‌ అనుచరులు కూడా ఆ తరవాత కాలంలో సీపీఐలో చేరారు. అజయ్‌ కుమార్‌ ఘోష్‌, కల్పనా దత్‌, హరే కృష్ణ కోనార్‌, విజయకుమార్‌ సిన్హా, గణేష్‌ ఘోష్‌ లాంటి వారు ఎందరో కమ్యూనిస్టు పార్టీలో చేరిన వారే. ఇలాంటి ప్రాణ త్యాగాలు దేశంలో వామపక్ష భావజాలం విస్తరించడానికి ఉపకరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు