. నైపుణ్య హబ్‌గా తెలంగాణ
. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణా కేంద్రం
. డిసెంబరు 9న ‘స్కిల్ వర్సిటీ’ క్యాంపస్ ప్రారంభం: మంత్రి శ్రీధర్ బాబు
విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను నైపుణ్య హబ్‌గా తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేట్ లో ‘‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’’ నిర్మాణ పనుల పురోగతిని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘‘యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ’’ని ఏర్పాటు చేశామని వివరించారు. యువతలో ప్రతిభకు కొదవలేదని, సానబెడితే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. తొలిదశలో మీరాఖాన్‌పేట్ లోని స్కిల్స్ వర్సిటీ శాశ్వత క్యాంపస్ లో అకడమిక్ బ్లాక్, ప్రయోగశాలలు, వసతి గృహాలు, వైస్ ఛాన్సలర్ కార్యాలయాలను డిసెంబరు తొమ్మిదిన లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఫార్మా, రిటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నామన్నారు. ఏడాది వ్యవధిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. భావితరాల అవసరాల కోసం… సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగో నగరంగా ‘‘ఫ్యూచర్ సిటీ’’ని అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.