. ట్రంప్‌పుతిన్ భేటీకి సన్నాహాలు
. పశ్చిమాసియాకు జెలెన్‌స్కీ
. రష్యాఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అడుగులు
వాషింగ్టన్/మాస్కో: దాదాపు మూడేళ్లుగా రష్యా`ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. భారీ మానవీయ సహాయ కార్యక్రమం నిమిత్తం తాను ఇక్కడికి వచ్చినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాగా మరికొద్ది రోజుల్లో అమెరికా-రష్యా మధ్య సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్‌కోఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్ట్జ్ కూడా సౌదీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా రియాద్‌లోని కొందరు అధికారులు- ఈ చర్చలకు వేదిక కావడం సహా మధ్యవర్తిత్వంలోను తమ దేశం కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. సౌదీ వేదికగా మంగళవారం జరగనున్న చర్చల్లో రష్యా అధికారులు, అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారని క్రెమ్లిన్ సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీకి ఏర్పాట్లు చేస్తారని తెలిపింది. ఇందుకోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉష్కోవ్ సౌదీ రాజధాని రియాద్‌కు బయల్దేరినట్లు వెల్లడిరచింది. అమెరికా, రష్యా సంబంధాలను పునరుద్ధరించడం, ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం, ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని తెలిపారు. కాగా ఉక్రెయిన్ లేకుండానే ఈ చర్చలు చేపడతున్నా రంటూ అమెరికా మిత్రదేశాల నుంచి ఇటీవల వెల్లువెత్తిన అసంతృప్తులపై ట్రంప్ స్పందించారు. యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా జెలెన్‌స్కీ భాగస్వామి అవుతారని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా అతిత్వరలోనే రష్యా అధినేతతో తాను భేటీ కానున్నట్లు తెలిపారు. ఆయన ఫ్లోరిడాలోని డెటోనా రేసులో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వెల్లడిరచారు. ‘‘కచ్చితమైన సమయం అనుకోలేదు-కానీ, తొందర్లోనే జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
ఉద్రిక్తతలకు స్వస్తి
అమెరికా-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నా రని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడిరచారు. అమెరికా- రష్యాల మధ్య సంబంధాల పునరుద్ధరణ, ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం తదితర అంశాలపై సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్న నేపథ్యంలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని లావ్రోవ్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలపై వారు మాట్లాడారని, వాటి పునరుద్ధరణ కోసం ఇరు దేశాధ్యక్షులు చర్చలు జరిపేందుకు అంగీకరించారని చెప్పారు.