. దీనిని ఎదుర్కొనే సైద్ధాంతిక శక్తి వామపక్షాలదే
. సీపీఎం జాతీయమహాసభల్లో నేతల ఉద్ఘాటన
. వామపక్ష, లౌకికశక్తులు ఐక్యం కావాలని పిలుపు
మధురై : భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలోని అన్ని వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యం కావాలని నేతలు పిలుపునిచ్చారు. సీపీఎం 24వ జాతీయ మహాసభలు తమిళనాడులోని సీతారాం ఏచూరి నగర్ (మధురై)లో బుధవారం ప్రారంభమయ్యాయి. కామ్రేడ్ కొడియేరి బాలకృష్ణన్ ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రారంభ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ… జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో చేతులు కలిపి పనిచేయడానికి సీపీఎం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్టు కరత్ ప్రకటించారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల మధ్య నెలకొనే ఇటువంటి విస్తృత ఐక్యతే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటాలకు దోహదం చేస్తుందని చెప్పారు. వామపక్ష ఐక్యతను బలోపేతం చేయడానికి, వామపక్ష రాజకీయ జోక్యాన్ని విస్తృతం చేయడానికి ఇది సరైన సమయమని ఆయన చెప్పారు. ‘నయా ఉదారావాద, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా, శ్రామిక ప్రజల ప్రయోజనాలను వామపక్షాలు మాత్రమే దృఢంగా కాపాడతాయన్నారు. దేశానికి ప్రమాదకరంగా మారిన హిందూత్వ నయా ఫాసిజాన్ని ఎదుర్కొనే సైద్ధాంతిక శక్తి ఒక్క వామపక్షాలకు మాత్రమే ఉందని కరత్ చెప్పారు. మన దేశంపై సామ్రాజ్యవాద దాడులను వామపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదంతో సన్నిహిత స్నేహం ఉన్న హిందూత్వ-కార్పొరేట్ కూటమికి ప్రతినిధులని ప్రకాశ్ కారత్ వివరించారు. డొనాల్డ్ ట్రంప్‌కు స్నేహితుడినని ఎవరు చెప్పుకుంటున్నారు? గౌతమ్ అదానీ మరియు ముఖేష్ అంబానీలకు సన్నిహిత స్నేహితుడు ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తిగా విధేయులు ఎవరు? అను మూడు ప్రశ్నలకు ‘నరేంద్ర మోదీ,బీజేపీ’ అనే ఒకే సమాధానం వస్తుందని కరత్ అన్నారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ ఎజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకువెళుతోందని, తీవ్రమైన నయా-ఉదారవాద విధానాలను అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అదే సమయంలో ఇది నయా-ఫాసిస్ట్ ధోరణులను కూడా ప్రదర్శిస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్ట్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ముస్లిం సమాజాన్ని నిరంతరం వేటాడుతోందని మండిపడ్డారు. మైనారిటీలే లక్ష్యంగా హిందూత్వ సంస్థలు మత అల్లర్లను సృష్టిస్తున్నారని, వీరికి బీజేపీ పాలిత రాష్ట్రాలలో అధికారుల నుండి మద్దతు, సహాయం అందుతున్నాయన్నారు.
సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా సౌహార్ధ్ర సందేశాన్ని ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యతతో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ విధానాలను బలంగా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వామపక్షలపై ఉందన్నారు. ‘జై భీమ్, లాల్ సలామ్, ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్నవి ఇక ఏమాత్రం నినాదాలు కావని, అవి జాతి జీవనవిధానం కావాల్సిఉందని చెప్పారు. ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్న మోదీ పాలనపై సంఘటిత పోరాటానికి ఇదే కీలక సమయమని, రాబోయే రోజుల్లోఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌లు కూడా పాల్గొని సౌహార్ద సందేశాలను ఇచ్చారు. వెణ్మణి అమరవీరుల స్మారక పతాకాన్ని కేంద్ర కమిటీ సభ్యులు యు.వాసుకి స్వీకరించి, పార్టీ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ ఎకె. పద్మనాభన్‌కు అందజేశారు. ఆ తరువాత మహాసభ ప్రారంభ సూచికగా సీనియర్ నేత బిమన్‌బసు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె.బాలకృష్ణన్ స్వాగతోపన్యాసం చేశారు.సభకు అధ్యక్షత వహించిన మాణిక్ సర్కార్, ప్రారంభోపన్యాసం చేసిన ప్రకాశ్ కరత్ లతో పాటు సౌహార్ద సందేశాలు ఇచ్చిన నేతలకు ఆహ్వాన సంఘం చిరు సత్కారం చేసింది. అనంతరం వేదికపై నేతలందరూ చేతులు కలిపి అభివాదం తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.