రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, ధర్నాలు
గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి
నిర్మాణ సామాగ్రి ధరలు దృష్ట్యా రూ.5 లక్షలకు పెంచాలి
సీపీఐ, వ్య.కా.సం అధ్వర్యాన సామూహిక అర్జీలు సమర్పించిన పేదలు
జనంతో పోటెత్తిన గ్రామ… వార్డు సచివాలయాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అర్జీల సమర్పణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాజకీయపార్టీల కతీతంగా పేదలు, బడుగు బలహీన, మధ్యతరగతి వర్గాలు పెద్దసంఖ్యలో కదలివచ్చారు. గ్రామ/వార్డు సచివాలయాలు వేలాదిమంది అర్జీదారులతో పోటెత్తాయి. ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లు ధర్నాలతో దద్దరిల్లాయి. భారీ ప్రదర్శనలతో రహదారులు కిక్కిరిశాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలం నివాసానికి ఏమాత్రం సరిపోదని, ఆ లబ్ధిదారులందరికీ కూటమి ప్రభుత్వం గతంలో వేసిన లే ఔట్లను మార్పు చేసి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇవ్వాలని సీపీఐ, వ్యవయసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుము, ఇటుక, కంకర, ఇసుక తదితర ముడిసామాగ్రి ధరలు పెరిగినందున కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షలకు అదనంగా మరో లక్ష కలిపి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు.
నివాసయోగ్యమైన భూములివ్వాలి: ముప్పాళ్ల
అర్హులైన పేదలందరికీ నివాసయోగ్య మైన ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ద్వారకా నగర పరిసర ప్రాంతాల్లోని పేదలందరూ స్థానిక సచివాలయంలో అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముప్పాళ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. జగన్ కొండల్లో, వాగుల్లో, పల్లపు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రయత్నించారని, అక్కడ నీరు, రోడ్డు తదితర సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం పొరపాట్లు చేయవద్దని ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు. సీపీఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్‌బాబు, పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పేదల నివాసకల్పనకు ఎందాకైనా పోరాడతాం: జల్లి విల్సన్
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ నివాస సౌకర్యం కల్పించేందుకు ఎందాకైనా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జల్లి విల్సన్ స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గంలోని ఓడరేవు, దేవాంగపూరి కాలనీల్లో జల్లి విల్సన్ స్థానిక నాయకులతో కలిసి సచివాలయూల వద్ద లబ్ధిదారులతో అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం శుభపరిణామ మన్నారు. అర్హులకు నివాసయోగ్యంగా ఉండే స్థలాలు గుర్తించి గృహనిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బత్తుల శామ్యూల్, చీరాల నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి చిరమల ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలో సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగనకొండ అధ్వర్యంలో గ్రామసచివాలయాల్లో అర్జీలు సమర్పించారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి: అక్కినేని వనజ
ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరిగినందున ప్రభుత్వం ఇస్తానన్న రూ.4 లక్షలను రూ.5 లక్షలకు పెంపు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి సచివాలయంలో ఇళ్ల స్థలాల అర్జీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని వనజ కోరారు. అర్జీల సమర్పణ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సహాయ కార్యదర్శి పుల్లూరి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో పేదలు అర్జీలు సమర్పించారు.
కర్నూలు కలెక్టరేట్ కిటకిట…
ఎన్నికల సమయంలో పేదలకు నివాసస్థలం ఇస్తానన్న హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి .గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత సీఆర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది పేదలు, సీపీఐ ప్రజాసంఘాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కర్నూలు రహదారులు కిలోమీటర్ల పొడవునా అర్జీదారులతో కిటకిటలాడాయి. మహిళలు, చంటిపిల్లలతో పెద్దఎత్తున తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు, ఎస్.మునెప్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 200కు పైగా సచివాలయాల్లో అర్జీలు అందజేశారు.
పేదలందరికీ ఇళ్లస్థలాలు:
సీహెచ్ కోటేశ్వరరావు
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామ సచివాలయం వద్ద అర్జీలు అందజేశారు. ఇళ్ల స్థలాల కోసం అర్జీలతో పేదలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పే నరసింహారావు, మండల, జిల్లా నాయకులు ముఖ్య దేశాయ, లావూరు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల సాకారం
చేయాలి: జంగాల
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు పేదల సొంతింటి కల సాకారం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో చేపట్టిన అర్జీలు అందజేసే కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో అర్జీలు అందజేసేందుకు లబ్ధిదారులు కదిలివచ్చారు. గుంటూరు నగరంలోని 8వ డివిజన్ సచివాలయం వద్ద జంగాల అజయ్‌కుమార్, ఇతర సచివాలయాలలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలలోని 36 సచివాలయాల్లో మొదటి రోజు అర్జీలు అందజేశారు.
ఎన్నికల హామీ వెంటనే
అమలు చేయాలి: కేవీవీ ప్రసాద్
కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీ వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామ సచివాలయం కార్యదర్శికి ఇళ్లస్థలాల అర్జీలు అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కట్టవరపు విజయరావు, సీపీఐ సహాయ కార్యదర్శి చాగంటిపాటి వెంకటేశ్వరవు, గొంది శోభనా చలపతిరావు, వెంగళ్ల శివయ్య, తాటి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రచార ఆర్భాటంగా
మార్చవద్దు: డేగా ప్రభాకర్
పేదలకు ఇస్తానన్న ఇంటిస్థలం హామీ గత ప్రభుత్వం వలే ప్రచార ఆర్భాటంగా మార్చవద్దని, తక్షణమే అమలుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సీపీఐ16వ డివిజన్ అరుంధతి పేట సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలసి డివిజన్ కార్యదర్శి కొల్లూరి సుధారాణి అధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.రామాంజనేయులు, కోడుమూరులో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, విశాఖలో ఎం.పైడిరాజు, సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల మేమయ్య యాదవ్, అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామ సచివాలయం వద్ద జిల్లా సీపీఐ కార్యదర్శి సి.జాఫర్ తదితరులు పాల్గొన్నారు.