ప్రశ్న రావణ్‌పై ఉపా కేసు ఎత్తివేయాలి
ఉపా రద్దు కోసం ఐక్య ఉద్యమాలు
- సీపీఐ రౌండ్టేబుల్లో అఖిలపక్ష నేతలు
- ప్రశ్నించే గొంతుకల అణచివేత కుట్రలు తిప్పికొట్టాలి
- పవన్తోపాటు సనాతన ధర్మంపై మాట్లాడేవారిపై కేసులు
- నారాయణ, మధు, ఈశ్వరయ్య, అంబటి
- సమాజ రక్షణ కోసం ఏకమవుదాం
- ఏబీవీ, పీవీ సునీల్కుమార్, శ్రీనివాసులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రశ్న యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్‌పై ఉపా కింద మోపిన రాజద్రోహం కేసును తక్షణం ఉపసంహరించాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి అధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. ఈ నెల 17వ తేదీలోపు రావణ్‌పై ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే…ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సమావేశం హెచ్చరించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రశ్నించేవారిపైన, విమర్శించేవారిపైన కేసులు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విభాగం కలిగించేలా అనేక పరిణామాలు జరగడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే ప్రశ్న రావణ్‌పై అక్రమ కేసులు బనాయించి… జైలుకు పంపారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రశ్న రావణ్‌పై నమోదు చేసిన కేసు ఉపసంహరించడంతోపాటు ఉపా చట్టాన్నే రద్దు చేయాలని, లేకుంటే ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రౌండ్టేబుల్ సమావేశానికి వామపక్షాలతోపాటు వైసీపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ప్రజాసంఘాలు, పౌర హక్కుల నేతలు, జర్నలిస్టులు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వందలాదిగా ఉన్న యూట్యూబర్ల వాక్ స్వాతంత్రాయూనికి, భావజాలానికి భంగం కలిగేలా పాలకులు వ్యవహరించడం దుర్మార్గమని తప్పపట్టారు. ప్రశ్న రావణ్ వీడియోలు చూసి ఎవరైనా నొచ్చుకుంటే చట్టాల ద్వారానే ఎదుర్కోవాలని, అలా కాకుండా ఉపా చట్టం ప్రయోగించడం దారుణమన్నారు. ఇదే విధానం కొనసాగితే మనమంతా ఉపా చట్టానికి అర్హులమవుతామని, దీన్ని ప్రజాసంఘాలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాల్సిన అవసరముందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి కేసులు మరిన్ని నమోదయ్యే ప్రమాదముందని, ప్రజలకు భద్రత ఉండబోదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ రక్షణ కోసం మనమంతా ఐక్యం కావాలని కోరారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ మాట్లాడుతూ ప్రశ్న రావణ్‌పై బనాయించిన ఉపా చట్టం కేసు ఎఫ్‌ఐఆర్‌ను తాను సమగ్రంగా పరిశీలించానని, అందులో ఎక్కడా ఆ కేసుకు సంబంధించిన అంశాలు స్పష్టంగా లేవని చెప్పారు.
సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ ప్రసంగిస్తూ ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ప్రశ్న రావణ్‌పై రాజకీయ కుట్రకు పాల్పడ్డారని, తక్షణమే ఆయనపై ఉపా కేసు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. త్రేతాయుగంలో రావణుడిని విలన్గా చూపించారుగానీ, ఈ కలియుగ యుగంలో రావణ్‌ను హీరో చేశారన్నారు. రాజకీయ పదవుల్లో ఉంటూ సనాతన ధర్మాన్ని ప్రకటించుకునేది పవన్ కల్యాణ్ ఒక్కడేనని మండిపడ్డారు. ఇప్పుడు లోక్‌సభలో బీజేపీకి మరింత బలం పెరిగిందని, దీంతో చంద్రబాబు మద్దతు లేకపోయినా మోదీకి ఒరిగేదేమీ లేదని చెప్పారు. మోదీ మెపð కోసం పవన్ అతిగా వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలేనన్నారు. పవన్ కల్యాణ్ ప్రసంగాన్నే ప్రశ్న రావణ్ అనుకరించారనీ, కానీ పవన్లా ప్రశ్న రావణ్ చెప్ప చూపించలేదన్నారు. ముందుగా పవన్పైనే కేసు పెట్టాలన్నారు. దేశంలో రాజ్యాంగ విధ్వంసం ప్రధాని మోదీతోనే ప్రారంభమైందని మండిపడ్డారు. ప్రశ్న రావణ్‌కు నాలుగు స్టేషన్‌లలో బెయిల్ రావడంతో ఇక లాభం లేదంటూ ఉపా చట్టం ప్రయోగించారని మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అధికారదాహంతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు లక్ష్మణరేఖ ఎందుకు దాటుతున్నారు?, రాజకీయ నేతలు చెప్పిన పనులు చేయనని చెప్పవచ్చు కదా? అని సూచించారు. రాజకీయ నాయకుల తప్పుడు నిర్ణయాలు వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. రాజకీయ నాయకులు చెడిపోయి…వ్యవస్థను, ప్రజలనూ చెడగొట్టేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ ఉపా చట్టం కింద ప్రశ్న రావణ్‌ను జైలుకు పంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సనాతన ధర్మం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని, అది దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తోందని చెప్పారు. అలాంటి సనాతన ధర్మంపై పదేపదే మాట్లాడే పవన్ కల్యాణ్తోపాటు సనాతన ధర్మం గురించి మాట్లాడే వారిపై ఏకోన్ముఖంగా కేసులు పెట్టాలని మధు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ దాసోహమయ్యారని, అలాంటి మోదీతో పవన్ అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ కేసు ముగిసేవరకు వైసీపీ తరపున ప్రశ్న రావణ్‌కు అండగా నిలుస్తామని, ప్రతిపక్షాల ఉద్యమంలో భాగస్వాములమవుతామని స్పష్టంచేశారు. రావణ్ సిద్ధాంతాలతో తాము ఏకీభవించమని పేర్కొంటూ ఆయన గతంలో వైసీపీని విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్యాయంగా ఎవరినైనా అణచివేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు బలం చేకూర్చడానికి రావణ్ ఇంట్లో సోదాలు చేశారని, ఆయన సెల్‌ఫోన్‌లో భయంకర విషయాలు బయటపడ్డాయని, నకస్లైట్లతో సంబంధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తప్పపట్టారు.
గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రశ్న రావణ్‌పై కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రతిపక్షాలతో కలిసి భారీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారిని అణచివేయడానికి ఉపా వంటి నిర్బంధ చట్టాలు దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యంపై కొనసాగుతున్న దాడికి నిదర్శనమన్నారు. బెయిల్ వచ్చిన వెంటనే పదేపదే అరెస్టులకు పాల్పడుతూ రావణ్‌ను పోలీస్‌స్టేషన్‌లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పారన్నారు. ఆ సమయంలో జనసేన, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ల గోడలు దూకి, పోలీసులను తోసేసి రావణ్‌పై దాడికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఈ నెల 17వ తేదీలోపు రావణ్‌పై ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే… భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
రావణ్‌పై ఉపా కేసు ఉపసంహరించాలన్న తీర్మానాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ ప్రతిపాదించగా… సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ ఉపా చట్టం పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ఉద్యమించాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల కోసం ఉద్యమించే వారిపైన, ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించడం తగదన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు డి.హరినాథ్ ప్రసంగిస్తూ నిరసన అంటేనే కూటమి ప్రభుత్వానికి వణుకుపుడుతోందన్నారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి బీఎస్ అమర్నాథ్ మాట్లాడుతూ రావణ్‌పై అక్రమంగా ఉపా చట్టం మోపారని, దీనిపై తిరగబడకుంటే రేపు అందరిపైనా ఇవే కేసులు నమోదవుతాయని అన్నారు. ఎంసీపీఐ(యూ) నాయకులు ఖాదర్ భాషా ప్రసంగిస్తూ తమిళనాడులో సినీ హీరో విజయ్ సీఎంగా ఎన్నికవడంతో పవన్ కల్యాణ్కు పార్టీలోను, అభిమానుల్లోను ఆదరణ తగ్గిపోయిందనీ, ఉనికి కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సామాజిక వేత్త వసుంధర ప్రసంగిస్తూ ఇవాళ ప్రశ్న రావణ్‌పై పెట్టిన ఉపా కేసు… రేపు తమ లాంటి సామాజిక కార్యకర్తలకు ఒక హెచ్చరిక లాంటిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలతో రాష్ట్రం అట్టుడికి పోతోందని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రావణ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. జర్నలిస్టులు డానీ, అమరయ్య మాట్లాడుతూ రావణ్ వ్యాఖ్యలు ఉపా చట్టం పరిధిలోకి రాబోవని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ ఉపా చట్టం రద్దు కోసం ఉద్యమించాలన్నారు. వైసీపీ లీగల్సెల్ రాష్ట్ర కన్వీనర్ మనోహర్రెడ్డి ప్రసంగిస్తూ రెండేళ్ల కూటమి పాలనలో 1700 మందికిపైగా సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేశారని, ప్రజాస్వామ్యం మనుగడ కోసం ఐక్య ఉద్యమాలు కొనసాగించాలని కోరారు. రిటైర్డ్ సీఐ సాల్మన్రాజు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నొక్కడం కోసమే రావణ్‌పై ఉపా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. తొలుత వక్తలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రనాయక్, రాష్ట్ర నాయకులు ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గేయాలు ఆలపించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ వందన సమర్పణ చేశారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్, తాటిపాక మధు, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు పోలారి, వీసీకే పార్టీ నాయకులు వెంకట్రాముడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవీంద్రనాథ్, ఎస్.వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి వి.జాన్సన్బాబు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్జీ, ఉపాధ్యక్షులు సాయి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుభానీ, నాయకులు లంకా గోవిందరాజులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు మల్నీడు యలమందారావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, నాయకులు ఓర్సు భారతీ, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, నాయకులు బి.రాయప్ప, ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ అఫ్సర్ తదితరులు హాజరయ్యారు.


