బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. నాటి అమరుల త్యాగాలను నేటి తరానికి చాటిచెప్పేందుకు జిల్లా కేంద్రాల్లో తమ ప్రభుత్వం ముక్తి జోధా కాంప్లెక్స్ నిర్మించినట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రం అమరుల జ్ఞాపకాలను తుడిచివేస్తున్నారని మండిపడ్డారు. అల్లరి మూకలను రెచ్చగొట్టి ముక్తి జోధా కాంప్లెక్స్ లను నాశనం చేయిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రం సమరయోధుల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని, చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి హసీనా ఓ వీడియోను విడుదల చేశారు. బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా హసీనా దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ అల్లర్లు పూర్తిగా సద్దుమణగకపోవడం, హసీనాపై పలు నేరారోపణలు, అరెస్టు వారెంట్ లు జారీ కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై హసీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశాలు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో యూనస్ పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార దాహంతో యూనస్ చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడితే అది నిన్నే కాల్చేస్తుందని యూనస్ ను హెచ్చరించారు. త్వరలోనే తాను తిరిగి వస్తానని, అందుకోసమే తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని హసీనా చెప్పారు.