ఇష్టమైన కోర్సులు ఎంచుకోండి – మీ విద్యాభివృద్ధికి మంత్రిగా అండగా ఉంటా..
- ఇంటర్ విద్యార్థులతో ఫోన్లో మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
- విశాలాంధ్ర ధర్మవరం :ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(ఫోన్ ద్వారా) పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ధర్మవరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాయి కృప జూనియర్ కళాశాల, వాసవి జూనియర్ కళాశాల, పలు కళాశాల విద్యార్థులను స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఫోన్ లో విద్యార్థులను ఉద్దేశించి పలు విషయాలను పంచుకున్నారు. ఇంటర్ పరీక్షలో మంచి మార్కులు సాధించినందుకు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలను సాధించాలన్నారు. విద్యార్థుల విజయంలో కీలకపాత్ర పోషించిన అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థుల కోసం ప్రభుత్వం మంచి సదుపాయాలను కల్పిస్తోందని విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలంటే విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుందని , ప్రతి విద్యార్థి తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు తాము చదవదలచుకొనే కళాశాలల్లో చేరడానికి తాను సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, సాయి కృప జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం రెడ్డి, వాసవి జూనియర్ కళాశాల ఇంచార్జ్ శివ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.