విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా): పండ్ల తోటలపై అందించే రాయితీని పండ్ల తోట రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానాధికారిణి ఉమాదేవి రైతులకు సూచించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి గాను ప్రభుత్వం
పండ్ల తోటల విస్తరణ పథకం ద్వారా రైతులకు చీని, దానిమ్మ, బొప్పాయి, అల్లనేరేడు, డ్రాగన్ ఫ్రూట్ తదితర పండ్ల తోటలు, పూల తోటల పెంపకానికి 40 శాతం రాయితీని అందిస్తోందన్నారు. నీటి కుంటల తవ్వకం పండ్ల తోటలకు రక్షక తడులు అందించేందుకు ఒక్క యూనిట్ 1200 క్యూబిక్ మీటర్లు చొప్పున తవ్వుకోవాలన్నారు. దీంతో నీటి కుంటలకు 50% రాయితీ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. యాంత్రీకరణలో భాగంగా పండ్ల తోటలలో మందు పిచికారి చేయడానికి అవసరమయ్యే తైవాన్స్ స్పేయర్లు, ట్రాక్టర్ మౌంటెడ్ స్పెయర్లకు 40% రాయితీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే దానిమ్మ తోటలకు పక్షుల బెడద నుంచి రక్షించుకోవడం కోసం యాంటీ బర్డ్ నెట్ పథకం ద్వారా 40% రాయితీని ప్రభుత్వం అందిస్తున్నది. కావున ఆయా పథకాలకు సంబంధించి రాయితీల కోసం మీ రైతు సేవ కేంద్రంలో రైతు ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, భూమి పట్టాదారు పాస్ పుస్తకం తదితర అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నేరుగా అన్నదాతల ఖాతాలోకి రాయితీ సొమ్ము జమ చేస్తుందని రైతులు రాయితీ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.