రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో తన సమాధి ఉండాలన్న దివంగత పోప్
క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన అంత్యక్రియలకు సంబంధించి ఆయన కీలకమైన విషయాన్ని వెల్లడించారు. శతాబ్దాలుగా వస్తున్న వాటికన్ సంప్రదాయానికి భిన్నంగా, తన మరణానంతరం భౌతికకాయాన్ని వాటికన్ నగరం వెలుపల రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక బాసిలికాతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా, మరణించిన పోప్‌ల భౌతికకాయాలను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పోప్ ఫ్రాన్సిస్ ఈ సంప్రదాయాన్ని అనుసరించకూడదని నిర్ణయించుకున్నారు. 2023 డిసెంబర్ 12న మెక్సికన్ టెలివిజన్ వార్తా సంస్థ ఎన్ంకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన అంత్యక్రియల ఏర్పాట్లను సరళతరం చేయాలనే ఉద్దేశ్యంతో, వాటికి సంబంధించిన విషయాలను ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో ఇప్పటికే చర్చించినట్లు పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో పోప్ ఫ్రాన్సిస్‌కు గాఢమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా, ఆ చర్చిలో కొలువైన సేలస్ పోపులి రోమనిగా ప్రసిద్ధి చెందిన మేరీమాత, బాల ఏసు చిత్రాన్ని ఆయన ఎంతగానో ఆరాధిస్తారు. పోప్ హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన తప్పకుండా ఈ చిత్రం ముందు ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక బంధమే తన చివరి విశ్రాంతి స్థలంగా బాసిలికాను ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది.
చారిత్రకంగా చూస్తే, పోప్‌లను వాటికన్ వెలుపల ఖననం చేయడం చాలా అరుదు. 1903లో మరణించిన పోప్ లియో-13 భౌతికకాయాన్ని మాత్రం ఆయన కోరిక మేరకు రోమ్‌లోని సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో ఖననం చేశారు. ఇక సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఇప్పటివరకు ఆరుగురు పోప్‌ల అంత్యక్రియలు జరిగాయి. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9ను అక్కడ ఖననం చేశారు. సుమారు మూడున్నర శతాబ్దాల తర్వాత, పోప్ ఫ్రాన్సిస్ తన చివరి కోరిక ద్వారా మళ్లీ బాసిలికాకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.