పహల్గామ్ ఉగ్రదాడి లో 26 మంది సందర్శకులు మృతి
అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడి
ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటన
భారత్‌లోని అంతర్గత అశాంతి ఫలితంగానే ఈ దాడి జరిగిందని ఆరోపణజమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది సందర్శకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దాయది పాకిస్థాన్ బుధవారం స్పందించింది. ఈ ఉగ్రవాద దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా ఆ దేశం పేర్కొంది. ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే తాము అన్ని రకాల ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌లోని అంతర్గత అశాంతి ఫలితంగా ఈ దాడి జరిగిందని పాక్ రక్షణ మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు వ్యతిరేకత ఉందని, మణిపూర్‌లో కూడా అల్లర్లు జరుగుతున్నాయని, అక్కడ దేశీయ పరిస్థితులే పెహల్గామ్ దాడికి కారణమై ఉంటుందని ఆయన తెలిపారు. నాగాలాండ్, మణిపూర్, కశ్మీర్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని, చాలా మందిని ప్రభుత్వం వేధించడం వల్లే ఇలా జరిగిందన్నారు.
ఉగ్రవాదాన్ని సపోర్టు చేయబోమని, ఉగ్రవాదులు స్థానికుల్ని టార్గెట్ చేయరాదు అని మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మేము ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వము. దాని గురించి మాకు ఎటువంటి సందేహం లేదు” అని ఆయన నొక్కి చెప్పారు. అయితే, దేశీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఆసిఫ్ ఆరోపించారు.