కెనడా ప్రధాని ట్రూడో పశ్చాత్తాపం
అట్టావా: కెనడా వలసల నియంత్రణ విధానంలో సహేతుకతను ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడిరచారు. ఈ మేరకు ఏడు నిమిషాల వీడియో విడుదల చేశారు. కొందరు దుర్మార్గులు వ్యవస్థలోని లోపాలను వాడుకొని ప్రజలను దోచుకుంటున్నారని ట్రూడో ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా అమాయకులైన వలసదారులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, డిప్లొమాలు పూర్తిచేయిస్తామని, పౌరసత్వం తేలిగ్గా లభిస్తుందని ఆశలు చూపి మోసం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడానికే సరికొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. దీనిలో భాగంగా రానున్న మూడేళ్లలో తాత్కాలిక, శాశ్వత నివాసాల కోసం వచ్చే వారి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. కోవిడ్ తర్వాత ఉద్యోగుల కొరత తగ్గించేందుకు వలస విధానంలో చేసిన మార్పులను ఫేక్ కాలేజీలు, భారీ కార్పొరేషన్లు తమ లాభాల కోసం దానిని దుర్వినియోగం చేశాయన్నారు. ‘తాత్కాలిక ఉద్యోగులు కూడా మా శ్రామికశక్తిలో భాగమయ్యారు. దీంతో మేము ఇమ్మిగ్రేషన్ను ప్లాన్ చేసేవేళ వారిని చేర్చకపోవడం తప్పవుతుంది. డిమాండ్ ఆధారంగానే మా వలస విధానం ఉంటుంది. ప్రస్తుత మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని దీనిని సమతౌల్యంగా ఉండేట్లు చూసుకోవాలి. చాలా సంస్థలు, పరిశ్రమలు వలస కార్మికులను ఆహ్వానిస్తున్నాయి. కానీ, ఇక్కడి హౌసింగ్, ఆరోగ్య సౌకర్యాలు, సోషల్ సర్వీస్ అంతే వేగంగా విస్తరించడం లేదు. వలస విధానంలో తాజా మార్పులతో ఇక్కడి కమ్యూనిటీలు లక్షల కొద్దీ ఇళ్లు నిర్మించి సిద్ధమయ్యేందుకు సమయం లభిస్తుంది’ అని ట్రూడో వివరించారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడంతో టొరెంటో, వాంకోవర్ వంటి నగరాల్లో అద్దెల ధరలు దిగి వస్తున్నాయని ట్రూడో చెప్పారు.