జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించి, దౌత్యపరమైన చర్యలు చేపట్టిన మరుసటి రోజే పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. తమ కరాచీ తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షను నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 25 మధ్య కాలంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. కరాచీ తీరానికి సమీపంలో, తమ దేశపు ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈ తేదీలలో నిర్దేశిత ప్రాంతం ప్రమాదకరంగా ఉంటుందని, ఆ వైపుగా రావద్దని ఎయిర్ ఫోర్స్, నేవీ అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది.పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సున్నితమైన తరుణంలో పాకిస్థాన్ ఈ క్షిపణి పరీక్షను ప్రకటించడం గమనార్హం. పహల్గామ్ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఈ దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది.
మరోవైపు, పాకిస్థాన్ క్షిపణి పరీక్ష ప్రకటన నేపథ్యంలో తాజా పరిణామాలను భారత భద్రతా సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సరిహద్దుల్లో, సముద్ర తీరంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.