వాషింగ్టన్: ఆగ్నేయాసియాపై ట్రంప్ సర్కారు కన్నెర్ర చేసింది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చైనా కంపెనీలు చాలా వరకు ఆగ్నేయాసియాకు తరలిపోయాయి. దీంతో ట్రంప్ ఇప్పుడు ప్రతీకార సుంకాల నెపంతో అక్కడి దేశాలపై విరుచుకుపడ్డారు. కంబోడియా, వియ త్నాం, మలేసియా, థాయిలాండ్ నుంచి ‘సోలార్’ పరికరాల దిగుమతులపై సుంకాలను అమాంతం పెంచేశారు. అత్యధికంగా 3,521 శాతం సుంకాన్ని అమెరికా విధించింది. ఈ దేశాల్లోని సోలార్ తయారీదారులు చైనా సబ్సిడీలతో అక్రమ పద్ధతుల్లో లాభపడ్డారని, అమెరికా మార్కెట్‌ను చౌకబారు సరుకుతో నింపారని తమ దర్యాప్తులో తేలడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు ట్రంప్ ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. ఇప్పటికే అంతర్జాతీయ సరఫరా గొలుసులు, విపణులపై విధించే 10 శాతం సుంకాలకు అదనంగా కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. దీంతో కంబోడియా నుంచి సోలార్ దిగుమతులపై అత్యధికంగా 3,521 శాతం సుంకాలు అమలు కాగా, వియత్నాంలోని కంపెనీలపై 395.9 శాతం, థాయిలాండ్‌పై 375.2 శాతం, మలేసియాపై 34.4 శాతం చొప్పున సుంకాలు అమల్లోకి వచ్చాయి. గతేడాది వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, మలేసియా నుంచి 12.9 బిలియన్ డాలర్ల విలువ చేసే సౌర పరికరాలను అమెరికా దిగుమతి చేసుకుంది. ఈ కొత్త సుంకాలతో అమెరికా పునరుత్పాదక శక్తి విపణికి దేశీయ తయారీదారులు కైవసం చేసుకునే వీలు కలుగుతుందని పరిశీలకుల అంచనా.