Friday, April 25, 2025
Homeబక్కచిక్కుతున్న చెరువులు!

బక్కచిక్కుతున్న చెరువులు!

. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు
. ప్రభుత్వ ఆదాయానికి గండి
. ప్రలోభాలకు తలొగ్గుతున్న అధికారులు
. మాఫియాకు కాసుల వర్షం
. ప్రభుత్వాలు మారుతున్నా మారనితీరు

మట్టి మాఫియా కళ్లు పడి చెరువులు చిక్కి శల్యమౌతున్నాయి. అక్రమంగా మట్టి తరలించుకుపోతుండడంతో స్వరూపాలు మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ పెద్దల అండతో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి అక్రమంగా మట్టి తరలిస్తూ రూ. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి పగలూ రాత్రి అన్న తేడా లేకుండా చెరువులు తవ్వేస్తుండడంతో వాటి మనుగడ, ఆశయం దెబ్బతింటోంది. ప్రలోభాలకు తలొగ్గిన కొందరు అధికారులు కళ్లముందే మట్టి తరలిపోతున్నా కన్నెత్తికూడా చూడడంలేదన్న విమర్శలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అడ్డగోలు తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తుండడంతో అడ్డుకునేందుకు వెళ్లిన కొందరు అధికారులపై మాఫియా ముఠా బెదిరింపులకు దిగుతోంది. దీంతో చెరువుల ఆశయం అటకెక్కి ఆయకట్టుభూములకు సాగునీరందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.

విశాలాంధ్ర- లింగపాలెం : ఏలూరు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపో తోంది. మెట్ట ప్రాంతాలలోని చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ మట్టిని అమ్మేసు కుంటున్నారు. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరం చెరువుల్లో మట్టి తరలించుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ పెద్దల అండ ఉన్న ఈ గ్యాంగ్‌… బరితెగించి చెరువు మట్టిని మింగేస్తున్నారు. మట్టి దందా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. మాఫియా ప్రలోభాలకు తలొగ్గి మట్టి అక్రమంగా తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇష్టానుసారంగా చెరువులను తవ్వేయటంవల్ల రూపురేఖలు మారిపోతున్నాయని గ్రామస్థులు లబోదిబో మంటున్నారు. మెట్ట ప్రాంతంలో చెరువుల ఉన్నా… లేనట్లుగానే ఉంది. మట్టి అక్రమ తవ్వకాలవల్ల చెరువుల మనుగడ ప్రమాదంలో పడిరది. చెరువుల స్వరూపమే మారిపోతుంది… కాపాడండి అంటూ ఫిర్యాదులు చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలను నిలువరించేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై మాఫియా ముఠా దౌర్జన్యాలకు పాల్పడటంతో చేసేదిలేక వెనుతిరిగి వస్తున్నామని ఇరిగేషన్‌ శాఖ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఏం చేయగలమంటూ తన నిస్సహాయతను వెలుబుచ్చారు. మట్టి తవ్వకాలను ఆపటానికి మీరెవరూ… ఆపితే మీ సంగతి చూస్తామంటూ మాఫియా బెదిరింపులకు దిగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో తాము ఏం చేయలేక పోతున్నామని కొందరు అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే… అక్రమాలను అడ్డుకోవడంలో ఉన్నతాధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మట్టిని తరలించుకుపోతున్న ట్రాక్టర్లు అతివేగంతో దూసుకుపోతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతం అధికంగా ఉంది. జిల్లాలో 650 చెరువులు ఉన్నాయి. దాదాపు 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇష్టానుసారంగా చెరువులను తవ్వేయటం వల్ల 30 శాతం మించి ఆయుకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పంటలు పండక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలవల్ల ఆయుకట్టు భూములకు అసలు సాగునీరే అందదనే ఆందోళన ఆయకట్టుదారులు వ్యక్తం చేస్తున్నారు. చెరువులలో మట్టి తవ్వకాలకు అధికారికంగా అనుమతులు ఇస్తే సమస్యలు తలెత్తవని రైతులు అంటున్నారు. వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చెరువులు… నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పూడిపోతున్నాయి. ఏ చెరువులోనూ సామర్థ్యానికి తగ్గట్టుగా నీటి నిల్వలు ఉండటం లేదు. దీనివల్ల ఇప్పటికే ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు అందటం లేదు. చెరువులలో నీరు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వాలు… పాలకులు మారుతున్నా చెరువులు అభివృద్ధి కి నోచుకోవటం లేదు. ఇష్టానుసారంగా చెరువులను తవ్వేయటం వల్ల గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. ఎక్కడికక్కడ గోతులు పెట్టడం వల్ల ఆయకట్టు భూములకు నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు