విదేశీ దౌత్యవేత్తలతో భారత్ భేటీ
న్యూదిల్లీ:పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జర్మనీ, జపాన్, పోలెండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఖతర్ సహా అనేక దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో గురువారం కీలక సమావేశం నిర్వహించింది. పహల్గాం దాడి ఘటన ఆయా దేశాల రాయబారులకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వివరించారు. పాక్ అండతో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డ తీరును ఆయా దేశాలకు వివరించి… దాయాది దేశాన్ని ఏకాకిని చేసేదిశగా కేంద్రం రాయబారులతో సమావేశం ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు… ఉగ్రదాదుల దాడిని ప్రపంచదేశాలకు వివరించే ప్రయత్నం చేసింది. చైనా, కెనడా సహా జీ20 దేశాలు, ఎంపిక చేసిన దేశాల రాయబారులకు పహల్గాం ఉగ్రవాద దాడి గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది. సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగింది. పహల్గాంలో ఉగ్రవాదులు ఎలా మారణకాండ సృష్టించారో వివరించి… అంతర్జాతీయంగా ఆయా దేశాల మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా.. బుధవారం అర్ధరాత్రి విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ అత్యున్నత దౌత్యవేత్త సాద్ అహ్మద్‌ను సైతం పిలిపించింది. భారత ప్రభుత్వం ఆయనకు ‘పర్సన నాన్ గ్రాటా’ నోట్ జారీ చేసింది. పర్సన్ నాన్ గ్రాటా అంటే ఒక దౌత్యవేత్త లేదా ఓ విదేశీ వ్యక్తికి ఒక నిర్దిష్ట దేశంలో ప్రవేశం లేదంటే.. బస నిరాకరించినట్లుగా అర్థం. భారతదేశం ఈ నోట్‌ను పాకిస్థాన్ దౌత్యవేత్తలకు అందజేసింది.