. మానవీయ కోణంలో ఏఐ వినియోగం
. త్వరలో భారీ డేటాలేక్ ఏర్పాటు
. ఏఐ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా స్మార్ట్ పాలన అందించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని సీఎం సూచించారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైమ్‌లో సేవలు అందించవచ్చని, ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని, త్వరలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన వర్క్‌షాప్‌ను ప్రారంభించి చంద్రబాబు ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం చేశారు. ఇంటర్నెట్ కోసం ఎదురుచూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దిన నేటి వరకు తన ప్రయాణాన్ని ముఖ్యమంత్రి ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.
భూరికార్డుల డిజిటలైజేషన్ వేగవంతం
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75 శాతం భూసంబంధితమైనవే ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్టప్‌లు రూ.30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని, దీంతో ప్రపంచం మనవైపు గర్వంగా చూస్తోందన్నారు. ఈ వర్క్‌షాప్ దేశానికి ఒక నమూనాగా నిలుస్తుందని, డిజిటల్, డైనమిక్, ప్రజల కోసం పని చేసే పాలనకు ఇది ఆరంభమని ముఖ్యమంత్రి అన్నారు.
రెండు రోజుల పాటు వర్క్‌షాప్
రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏఐ, ఎంఎల్, డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ జరుగుతాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్‌ను అధికారులు పరిశీలిస్తారు. ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై ప్రజంటేషన్ ద్వారా నిపుణులు విశ్లేషిస్తారు. వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని వివరిస్తారు. వర్క్‌షాప్‌లో మొదటిరోజు కార్యదర్శులు హాజరుకాగా, రెండోరోజు విభాగాధిపతులు పాల్గొంటారు. ఈ వర్క్‌షాప్‌కు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్ హజరయ్యారు.