వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు అత్యంత భక్తిశ్రద్ధలతో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి చీఫ్, యూరోపియన్ యూనియన్ నేతలు, బ్రిటన్ యువరాజు విలియం, స్పెయిన్ రాజకుటుంబ సభ్యులు సహా పలువురు ప్రపంచ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు తమ ప్రియతమ పోప్‌కు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రజల పోప్ గా కార్డినల్ గియోవన్నీ బటిస్టా రే అభివర్ణించారు. సామాన్యులతో సైతం మమేకమయ్యే అద్భుతమైన శైలి ఆయన సొంతమని కొనియాడారు.
తన 12 ఏళ్ల పదవీకాలంలో చర్చిలో సంస్కరణలకు, పేదల సేవకు పోప్ ఫ్రాన్సిస్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియల కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించారు. వాటికన్ సంప్రదాయాలకు భిన్నంగా, రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు.
భారత్ తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలోని ప్రతినిధి బృందం పోప్ అంత్యక్రియలకు హాజరైంది. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ మాట్లాడుతూ.. పోప్ ఫ్రాన్సిస్ అన్ని మతాలు, జాతులను గౌరవించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పోప్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ, సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు.
గతంలో వలసలు, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ట్రంప్ విధానాలతో పోప్ ఫ్రాన్సిస్ విభేదించినప్పటికీ, ఆయనపై గౌరవంతోనే అంత్యక్రియలకు హాజరైనట్లు ట్రంప్ విలేకరులకు తెలిపారు. కాగా, పోప్ అంత్యక్రియలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ రోమ్‌లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కొద్దిసేపు ప్రైవేట్‌గా భేటీ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత వీరిద్దరూ ముఖాముఖిగా భేటీ కావడం ఇదే తొలిసారి.