Monday, April 28, 2025
Homeజాతీయంగడువు దాటినా ఇక్కడే ఉంటే మూడేళ్లు జైలు, 3 లక్షల జరిమానా.. పాక్ పౌరులకు కేంద్రం...

గడువు దాటినా ఇక్కడే ఉంటే మూడేళ్లు జైలు, 3 లక్షల జరిమానా.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక

పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. సాధారణ వీసాల గడువు ఆదివారంతో ముగియగా వైద్య వీసాలపై వచ్చిన వారికి మంగళవారం వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం విధించిన గడువు తర్వాత కూడా భారత్ లోనే ఉండిపోయిన పాకిస్థానీ పౌరులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉన్న విదేశీయులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ దాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు, పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే జారీ చేసిన పలు కేటగిరీల వీసాలను ఏప్రిల్ 27, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య వీసాలకు మాత్రం ఏప్రిల్ 29, 2025 వరకు గడువు ఇచ్చారు. సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాక్ పౌరులు ఆదివారం లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.

ఈ ఆదేశాల నేపథ్యంలో గత మూడు రోజులుగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారీగా ప్రజల తరలింపు జరిగింది. శుక్రవారం నుంచి మొత్తం 537 మంది పాకిస్థానీ జాతీయులు (వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నారు) భారత్‌ను విడిచి తమ స్వదేశానికి వెళ్లినట్లు అధికారులు పీటీఐకి తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న 850 మంది భారతీయులు (14 మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా) ఇదే మార్గం గుండా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు