అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ. 1,050 పెరిగి రూ. 99,450కి చేరుకుంది. 99.9 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం ధరపై సోమవారం రూ. 1000 తగ్గి రూ. 98,400కు పడిపోయింది. అయితే, అక్షయ తృతీయకు ఒక్క రోజు ముందు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారంపై ఏకంగా రూ. 1,100 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 99 వేలకు చేరుకుంది. అంతకుముందు ముగింపు సమయానికి ఈ ధర రూ. 97,900గా ఉంది. గతేడాది డిసెంబర్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 78,950గా ఉండేది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 20,500 (26 శాతం) పెరిగింది. మరోవైపు, వెండి ధర కూడా భారీగా పెరిగింది. మంగళవారం కిలోకు ఏకంగా రూ. 3,500 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 1,02,000కు ఎగబాకింది. అంతకుముందు సెషన్‌లో ఈ ధర రూ. 98,500 వద్ద ముగిసింది. మార్చి 19న వెండి ధర కిలోకు వెయ్యి రూపాయలు పెరిగి ఆల్‌టైమ్ హై అయిన రూ. 1,03,500కు చేరుకుని రికార్డు సృష్టించింది. అక్షయ తృతీయకు ముందు పసిడి ధరలు పెరగడం సాధారణమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.