విశాలాంధ్ర -అనంతపురం : అనంత కరవు నివారణ లో ఆర్ డీటీ కృషి ఎనలేనిది అని… కరవు కాలం లో పేదల కడుపు నింపిన ఆర్ డీటీ కి తిరిగి విదేశీ నిధులు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరువ తీలుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఫాదర్ ఫెర్రర్ విగ్రహం ముందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. అనంతరం ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లోని కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ… దశాబ్దాలుగా విద్య, వైద్య, వ్యవసాయ, రంగాలలో పేదల అభ్యున్నతికి ఆర్డిటి విశేష కృషి చేసిందన్నారు. జిల్లాలో లక్షల మంది బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లు నిర్మించడంతోపాటు చదువు, క్రీడలలో ప్రోత్సహిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతోందన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్డిటికీ నిధుల విషయంలో తక్షణమే కూటమి సర్కారు స్పందించాలని ప్రధాని మోడీ దృష్టికి విషయం తీసుకెళ్లాలని కోరారు. ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత వాసులపై ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు జగదీష్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కేపీ కుమార్ మాట్లాడుతూ… ఫాదర్ ఫెర్రర్ ఆశయాలు కొనసాగిస్తూ జిల్లాలో పేదలకు సేవలు చేస్తున్న ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. విదేశీ నిధులు యధావిధిగా ఆర్డిటికీ అందే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యులు కే రామచంద్ర, ట్రజరర్ చౌడప్ప, జిల్లా సభ్యులు అక్కలప్ప, భూమిరెడ్డి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డానియల్ ఫోటోగ్రాఫర్ ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు ఆనంద్ వర్ధన్, శేషాద్రి, శేఖర్, బన్సీలాల్, రాజశేఖర్, వెంకటరెడ్డి, సాయి, భారత్ తదితరులు పాల్గొన్నారు