ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు కొంత ఊరటనిచ్చాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాల్లో వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. అదే సమయంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను కూడా సవరించాయి. అయితే, ఇళ్లలో వాడే గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో కదలికలకు అనుగుణంగా చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 14.50 మేర ధర తగ్గింది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల నిర్వహణ వ్యయం స్వల్పంగా తగ్గనుంది.
కాగా, సాధారణ ప్రజలు ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర యథాతథంగా కొనసాగుతుందని కంపెనీలు స్పష్టం చేశాయి.
విమానయాన రంగానికి కూడా చమురు కంపెనీలు సానుకూల వార్తను అందించాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను కూడా తగ్గించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధరపై 4.4 శాతం కోత విధించాయి. దీనివల్ల కిలోలీటర్‌కు రూ. 3,954 మేర ధర తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ. 85,486.80కి చేరింది.
ఏటీఎఫ్ ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. గత నెలలో, అంటే ఏప్రిల్ 1న కూడా చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరలను కిలోలీటర్‌పై 6.15 శాతం (రూ. 5,870) మేర తగ్గించాయి. వరుసగా రెండు నెలల పాటు ధరలు తగ్గడంతో విమానయాన సంస్థలకు కొంతమేర నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.