విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : వికాస తరంగిణి రాజాం ఆధ్వర్యంలో 10 రోజులపాటు జరిగిన ప్రజ్ఞ వేసవి శిక్షణ తరగతులు నేటితో ముగిసాయి. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రజ్ఞాదైనందిని శ్లోకాలు, సప్త ఋషుల చరిత్రలు, మన ఇతిహాసాల పరిచయం మరియు నీతి పద్యాలు బోధించినట్లు వికాస తరంగణి ముఖ్య సమన్వయకర్త వాకచర్ల వెంకట పైడిరాజు తెలియజేశారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోటివేషనల్ స్పీకర్ బూరాడ శివకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మన ఇతిహాసాల పట్ల సనాతన ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే జీవితంలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకొని ముందడుగు వేయడం సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. 30 మంది విద్యార్థులు ప్రజ్ఞా తరగతులను వినియోగించుకోనగా, ఉపాధ్యాయులు బలగ ప్రసాదరావు, ముడిల శంకరరావు, గడే అప్పలనాయుడు, మురపాక గణేష్. పాలవలస రాంబాబు శిక్షకులుగా వ్యవహరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు లంకలపల్లి బాలవర్ధన సాయి (ప్రథమ స్థానం), అమనాన నవ్య శ్రీ (ద్వితీయ స్థానం), లంక సాహిత్ (తృతీయ స్థానం) అందవరపు భవిష్య ప్రియ (కన్సోలేషన్) లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు అమనాన నీలకంఠం, మహంతి సత్యనారాయణ, డొంక త్రినాధులు, పెంకి చైతన్య మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.