యూఏఈ, సింగపూర్, శ్రీలంక మీదుగా భారత్ లోకి పంపేందుకు యత్నాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఉత్పత్తులపై భారత్ కఠిన వైఖరి
ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి దిగుమతులపై భారత్ పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధాన్ని తప్పించుకుని, తమ ఉత్పత్తులను ఎలాగైనా భారత మార్కెట్లోకి చేర్చేందుకు పాకిస్థాన్ ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, సైంధవ లవణం (రాక్ సాల్ట్), తోలు వంటి వస్తువులను… ఇతర దేశాల గుండా భారత్‌కు పంపేందుకు పాక్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలలో ఈ వస్తువుల లేబుళ్లను మార్చి, రీప్యాకేజింగ్ చేసి, అక్కడి నుంచి భారత మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పాకిస్థాన్‌లో తయారైన ఏ వస్తువూ, ఏ మార్గంలోనూ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) భారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నారు. మే 2న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు, పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా గానీ, మూడో దేశం మీదుగా పరోక్షంగా గానీ వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం కఠినంగా అమలవుతోంది. ఈ క్రమంలోనే అనుమానిత దిగుమతులపై కస్టమ్స్ అధికారులు ప్రత్యేక నిఘా సారించారు.