మంత్రి పయ్యావుల కేశవ్ కు వినతి పత్రం అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : గుంతకల్ నియోజకవర్గం లో హంద్రీవా నుండి కృష్ణా జిల్లాలో మళ్ళించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ సోమవారం స్థానిక మంత్రి స్వగృహంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డి. జగదీష్ మాట్లాడుతూ… హంద్రీనీవా కాలువకు గుంతకల్ ముఖద్వారం లాంటిది అన్నారు. అనంతపురం జిల్లాలో కాలువ ప్రవేశించాలంటే గుంతకల్ మీదుగా పోవాలన్నారు. కానీ గుంతకల్ నియోజకవర్గం లోని వ్యవసాయ భూములకు హంద్రీనీవా కింద ఆయకట్టుకు నీరు కేటాయించడం లేదన్నారు. కేవలం పాత కొత్త చెరువు, వైటీ చెరువులకు మాత్రమే నీరు వదులుతున్నారన్నారు. వీటివలన కేవలం 1500 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఉందన్నారు. గుంతకల్లుకు చుట్టుప్రక్కల గల పత్తికొండకు 11,719, దేవనకొండకు 45,396, వజ్రకరూరుకు 7,050,ఉరవకొండకు 6,577 విడపనకల్లు13,137, బెలుగుప్పకు 35,299, ఎకరాలలో హంద్రీనీవా నుండి ఆయకట్టును ప్రతిపాదించబడిందన్నారు. కానీ గుంతకల్ కు 1500 ఎకరాలకు మాత్రమే హంద్రీనీవా నీవా నీటిని కేటాయించారన్నారు. రాగులుపాడు నుండి కాలువ ద్వారా గుంతకల్ మండలంలోని 15 చెరువులకు, చెక్ డ్యాములకు నీరు అందించే పథకమునకు టెండర్లు పిలిచి, ప్రభుత్వం భూసేకరణకు నిధుల విడుదల చేయనందువలన పనులు జరగలేదన్నారు. గుంతకల్ నియోజకవర్గం లోని రైతులకు నిరాశ మాత్రమే మిగిలిందన్నారు. వినతి పత్రం ద్వారా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మాకు మా పొలాలకు హంద్రీనీవా నుండి కృష్ణా జలాలు మళ్లించి రైతులను ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మందాలప్ప, పునుగుంటపల్లి జయరాముడు, రాము రాయల్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.