Tuesday, January 28, 2025
Homeవిశ్లేషణసేవ్‌ ది హౌజ్‌

సేవ్‌ ది హౌజ్‌

చింతపట్ల సుదర్శన్‌

అరుగు మీద మంచి నిద్రలో ఉన్న డాగీకి మనుషుల అలికిడి వినిపించి మెలకువ వచ్చింది. ఈ డాంకీ ఇంకా రాలేదు ఎక్కడ న్యూస్‌ పేపర్లు నవుల్తూ ఉండిపోయిందో అనుకుంటూ ఇంటి లోపలికి తొంగిచూసింది. లోపల ఓ పీచు గడ్డంవాడు, ఓ పిల్లి మీసాలోడూ, ఓ బట్ట గుండోడు ఉన్నారు. ఎవరు వీళ్లు? ఎందుకు ఈ కొంపలోకి జొరబడ్డారు? పెద్దగా అరిస్తే అటునుంచటే పారిపోతారా లేదా దుడ్డుకర్ర ఏదైనా తీసుకుని మీదికి వస్తారా? చూస్తే ‘అన్‌ సోషల్‌ ఎలిమెంట్స్‌’ లాగున్నారు. ఎందుకైనా మంచిది డాంకీ వచ్చేదాకా ఆగుదాం అనుకున్న డాగీకి అరుగు ఎక్కుతున్న డాంకీ కనిపించింది. వచ్చావా! వందేళ్లు నీకు అందామనుకుంది కాని అది అత్యాశపరులైన మనుషులకే కాని తమకు కాదుకదా అని గుర్తొచ్చి, రారా డాంకీ భాయ్‌ నీ కోసమే వెయిటింగిక్కడ అంది. ఏమిటి సంగతి ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే తప్ప గుర్తు చెయ్యవు కదా నన్ను, పైగా వెయిటింగు కూడానా? అంది డాంకీ. పంచ్‌లు పంచుకునే టైం కాదిది. ఎమర్జెన్సీ! లోపల ముగ్గురు మనుషులున్నారు. ముగ్గురా? ముగ్గురు మూర్ఖులా, ముగ్గురు బైరాగులా, మాయల మరాటీలా లేక ఊళ్లల్లోకి వచ్చి ‘రీల్సు’ చేస్తున్న అఘోరాలా? అంది డాంకీ గోడకు వీపు ఆనించి ‘సిట్టింగ్‌’ వెయ్యబోతూ. ప్రతిదీ ‘లైట్‌’ తీసుకోడం అంత మంచిది కాదు. లోపల ముగ్గురు దొంగనాయాళ్లున్నారు. మన ఈ కూలిన కొంప మన స్వంతం. మన కొంపలోకి వచ్చిన పరాయి ముష్కరులను చూస్తూ ఊరుకుందామా? ఏమైనా చేద్దామా? ఐసీ! మ్యాటర్‌ సీరియస్‌ అన్నమాట. ఇంతకీ లోపల ఏం చేస్తున్నట్టు వాళ్లు పేకాడుతున్నారా? గంజాయి, దమ్ము కొడుతున్నారా? మెళ్లల్లో కండువాలు ఉన్నయా? ఏ పార్టీ కార్యకర్తలో గమనించావా? అంది డాంకీ. సరిగ్గా చూడలేదు కానీ, అన్ని పార్టీల్లోనూ కార్యకర్తలుగా ఇలాంటి వారే కనబడతారు. ప్రజాస్వామ్యాన్ని పీచుగడ్డంవాళ్లూ, పిల్లి మీసాల వాళ్లూ, బట్ట గుండోళ్లే కద కాపాడాల్సింది. వీళ్లు కాక ప్రభుత్వ అధికారుల మీద రాళ్లు రువ్వగలిగిన వాళ్లు, కార్లు ధ్వంసం చేయగలిగిన వాళ్లు ఎవరుంటారు చెప్పు. ఇక వీళ్లు ఏం చేస్తున్నారో చూసి చెప్తా అంది డాగీ లోపలికి దృష్టి సారించి. చూడకుండానే నేను చెప్పనా ఇక్కడెక్కడో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఓటుకు ఇంత అని అమ్ముకుని ఆ డబ్బుతో మందు తెచ్చుకుని ‘మజా’ చేసుకుంటున్నారు అంతేకదా! ఎగ్జాట్లీ ఎలా చెప్పగలిగావు అంది డాగీ. ఏముంది! ప్రజాస్వామ్యం ఇప్పుడు సూపర్‌ మార్కెట్‌ సరుకు అయింది కదా. వేలు మీద చుక్క పెట్టించుకోవడం అనే పెట్టుబడి కాని పెట్టుబడితో డబ్బు సంపాదిస్తున్నారు ఓటర్లు. ఎలాగూ గెలిచినవాడు ఊడబొడిచేది ఏమీ ఉండదని, ఓడినవాడు, గెలిచినవాడు ఒకళ్లనొకళ్లు బూతులు తిట్టుకుంటూ మళ్లీ ఎన్నికలు వచ్చేదాకా, కాలక్షేపం చేస్తారని తెలిసిందే కద అంది డాంకీ. కాలక్షేపం, దుష్ప్రచారం సరే గెలిచిన వారయితే ప్రజల నెత్తిన ‘అప్పు తట్ట’ బోర్లించి రాజ భోగాలయితే అనుభవిస్తారు కదా! అనుభవిస్తారు కానయితే అవి రాజభోగాలు కావు మంత్రి భోగాలు, ఎంపీ, ఎంఎల్‌ఏ భోగాలే. సొమ్మొకడిది సోకొకడిది అనే కదా అంది డాంకీ.
ఓటుకు నోటూ, మందూ పుచ్చుకునే వాళ్లు కొందరయితే, క్యూల్లో నిలబడి, చెమటోడ్చి ఓటు వెయ్యడం అవసరమా అనుకునే వాళ్లు కొందరు. ప్రజల్ని మతం పేరా, కులం పేరా విభజించి, విడదీసి వీరంగం ఆడేస్తున్నారు నాయకులు అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. వచ్చావా బ్రో! రారా! ఇక్కడ ఓ పెద్ద సమస్య వచ్చిపడిరది అంది డాగీ. సమస్యా! అది లేకుండా భూ ప్రపంచమే ఉండదులే! మణిపూర్‌ సమస్య మళ్లీ భగ్గుమన్నది. పాపం మూడేళ్ల పసివాడి తల, చేతులు నరికేశారుట, వాడి కుటుంబం మొత్తాన్ని శవాలుగా మార్చేర్ట. అయినా ఆనాడూ ఈనాడూ చీమ కుట్టనే లేదు మన సర్కారును. అన్ని సమస్యల్నీ ‘లైట్‌’ గా తీసుకోడం అలవాటయ్యి, నాన్చడం అలవాటయ్యి, రైతుల సమస్యలయితేనేం, జాతుల సమస్యలయితేనేం, పహిల్వాన్ల సమస్యలయితేనేం అన్ని సమస్యలనీ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడమే దేశభక్తి అంటున్నారు. సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందని నమ్మే ఆధ్యాత్మికవేత్తల దేశం మనది మరి అన్నాడబ్బాయి.
దేశం సంగతి నాయకులకు వదిలేద్దాం. దేశాన్నీ, ప్రజల్నీ తాకట్టు పెడతారో, అమ్ముకుంటారో, ప్రజాస్వామ్యం పీకి పిసికేస్తారో వాళ్లకీ, ప్రజలకీ వదిలేద్దాం. ప్రస్తుతం మన ఈ కూలిన గూడును కాపాడుకోవటం, మన తక్షణ కర్తవ్యం అంది డాగీ. అవును. ఈ గంజాయి దమ్ముగాళ్లని తక్షణం తరిమేయకపోతే ఈ చోటును తమ ‘అడ్డా’ గా మార్చుకునే ప్రమాదం ఉంది అంది డాంకీ. అయితే ‘సేవ్‌ ది హౌజ్‌’ మిషన్‌ ప్రారంభించండి. నేను కనపడకుండా వాళ్ల మీద రాళ్ల దాడి చేస్తాను. డాగీ నువ్వు దిక్కులు పిక్కటిల్లేట్టు అరుపు లంకించుకో. వాళ్లిటు వైపు వస్తే, డాంకీ వెనక కాళ్లతో అటకాయిస్తుంది. దొరికితే నుద్దూ ‘పిక్కలు’ వదలకు. రెడీ ‘ఒన్‌ టూ త్రీ’ చెప్పాడు అబ్బాయి.
ఉరేయ్‌ ఈ కుక్క నా పిక్క పట్టిందిరోయ్‌ అని పీచు గడ్డంవాడు, నా తల పగిలిందిరోయ్‌ అని పిల్లి మీసాలోడు, నా నడుం విరిగిందిరోయ్‌ అని బట్ట గుండోడు అరుస్తూ, అరుగు మీది నుంచి కిందికి దొర్లి పారిపోయేరు. సొతంత్రం స్వర్గలోకం అన్నారు. కూలిన కొంపయితేనేం మన కొంపను మనం రక్షించుకోవాలి అంది డాగీ. నా వెనుక కాళ్ల సత్తువ పరీక్షించుకునే ఛాన్సు దక్కింది నాకు అంది డాంకీ. అరుగు దిగి వెళ్లిపోయేడు అబ్బాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు