Tuesday, May 6, 2025
Homeతెలంగాణతెలంగాణలో ప్రయాణికులకు ఊరట.. ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణలో ప్రయాణికులకు ఊరట.. ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) కార్మికులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.వివరాల్లోకి వెళితే, తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 6వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం అందకపోతే, మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కార్మికులు భారీ కవాతు నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం చొరవ తీసుకుని జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది.మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జేఏసీ నేతలు జరిపిన సమావేశంలో కార్మికుల సమస్యలు, డిమాండ్లపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా, ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార మార్గాలను సూచించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ చర్చలు జరిపి, వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించడం, సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయడంతో జేఏసీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక వచ్చే వరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. ప్రభుత్వ చర్యతో ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సమ్మె నిర్ణయం తాత్కాలిక వాయిదా మాత్రమేనని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత, ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల అంశం, కారుణ్య నియామకాలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, వేతన సవరణ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని జేఏసీ నేతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చేలా, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమ్మెను కొంతకాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు