రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందించే పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పథకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు గత జనవరిలో వెలువరించిన తీర్పు ఈ నిర్ణయానికి మూలంగా నిలిచింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన మొదటి గంట)లో ఉచిత వైద్యం అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025 పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది.
ఈ పథకం కింద, మోటారు వాహనం వల్ల ఏ రహదారిపై ప్రమాదం జరిగినా బాధితులు ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేందుకు అర్హులవుతారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల పాటు ఈ ఉచిత చికిత్సను పొందవచ్చు.
ట్రామా, పాలీట్రామా వంటి అత్యవసర సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సంబంధిత ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేకపోతే, తక్షణమే మరో ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణా సౌకర్యాలను కూడా ఆ ఆసుపత్రి కల్పించాలని పేర్కొంది.
బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత, అందించిన వైద్య సేవలకు సంబంధించిన బిల్లును నిర్దేశిత ప్యాకేజీకి అనుగుణంగా ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ పథకం అమలుతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అనేక మందికి సకాలంలో వైద్యం అంది, ప్రాణాలు నిలబడతాయని ఆశిస్తున్నారు.